ఐపీఎల్18: ఆరెంజ్ ఆర్మీ ’మధ్యలో’ మునిగింది..లేదంటేనా ప్లేఆఫ్స్ పండుగే

ఇక తొలి మ్యాచ్ లో అద్భుతంగా ఆడి గెలిచాక.. వరుసగా నాలుగు ఓడిపోవడం కూడా పెద్ద మైనస్. వీటిలో కనీసం రెండు గెలిచినా 17 పాయింట్లు అయ్యేవి.;

Update: 2025-05-26 11:40 GMT

ప్రస్తుత ఐపీఎల్ తొలి మ్యాచ్ లోనే 286 పరుగులతో మోత మోగించి.. ఇక 300 కొట్టడమే తరువాయి అనిపించిన జట్టు కనీసం ప్లేఆఫ్స్ కూడా చేరడదని అనుకుంటామా..? దూకుడైన బ్యాటర్లు, మేటి పేసర్లు ఉన్న జట్టు ఓ దశలో పాయింట్ల పట్టికలో కింద ఉంటుందని భావించామా..? ఇదంతా సన్ రైజర్స్ హైదరాబాద్ విషయంలో జరిగింది. గత సీజన్ లోనే 287 పరుగుల రికార్డు స్కోరు సాధించిన ఆరెంజ్ ఆర్మీ ఫైనల్ కు కూడా చేరింది. ఈ సీజన్ మొదటి మ్యాచ్ లోనే దుమ్మురేపింది. తాజాగా చివరి మ్యాచ్ లో ఏకంగా 278 పరగులు సాధించింది. ఆదివారం డిఫెండింగ్ చాంపియన్ కోల్ కతా నైట్ రైడర్స్ తో మ్యాచ్ లో అయితే 300 కొట్టేస్తుందా? అనిపించింది. కానీ, కాస్త దూరంలో ఆగిపోయింది.

ఎంతో గొప్పగా మొదలుపెట్టిన సన్ రైజర్స్ హైదరాబాద్ ను అసలు దెబ్బకొట్టింది ఏమిటి..? చివరి మూడు మ్యాచ్ లను గెలిచిన ఆరెంజీ ఆర్మీకి ఎక్కడ చేటు జరిగింది..? అంటే.. సీజన్ మధ్యలో. మొత్తం 14 మ్యాచ్ లలో ఆరు గెలిచిన కాటేరమ్మ కొడుకులు.. సొంతగడ్డ హైదరాబాద్ లో ఓ మ్యాచ్ రద్దవడంతో 13 పాయింట్లతో ఉన్నారు. వర్షం కారణంగా ఉప్పల్ లో రద్దయిన మ్యాచ్ లో హైదరాబాద్ గెలిచే అవకాశం కనిపించింది. అదే జరిగితే 14 పాయింట్లయినా ఉండేవి.

ఇక తొలి మ్యాచ్ లో అద్భుతంగా ఆడి గెలిచాక.. వరుసగా నాలుగు ఓడిపోవడం కూడా పెద్ద మైనస్. వీటిలో కనీసం రెండు గెలిచినా 17 పాయింట్లు అయ్యేవి. ప్లేఆఫ్స్ రేసులో ఉండేది. సన్ రైజర్స్ ఎంతో నమ్ముకున్న బ్యాటింగే వారిని దెబ్బతీసింది. బౌలింగ్ లో రూ.10 కోట్లకు పెగా వెచ్చించి తీసుకున్న స్టార్ పేసర్ షమీ వైఫల్యం కూడా వెన్నువిరిచింది. అభిషేక్ శర్మ, ట్రావిస్ హెడ్, ఇషాన్ కిషన్.. ముగ్గురూ విధ్వంసకారులే అయినా.. అనుకున్నంతగా రాణించలేదు. పైగా ముగ్గురూ ఎడమచేతివాటం వారే. బౌలింగ్, వ్యూహాల్లో కెప్టెన్ ప్యాట్ కమ్మిన్స్ గత సీజన్ తరహాలో మెప్పించలేకపోయాడు. నాలుగో స్థానంలో నిలకడగా ఆడే బ్యాటర్ లేకపోవడం, తెలుగు కుర్రాడు నితీశ్ కుమార్ రెడ్డి ఆ స్థానంలో విఫలం కావడం, మంచి స్పిన్నర్ లేకపోవడం, స్పిన్, పేస్ ఆల్ రౌండర్ కొరవడడంతో సన్ రైజర్స్ హైదరాబాద్ ఈ సీజన్ ను ఉసూరుమంటూ ముగించింది.

మరి వచ్చే సీజన్ కు అయినా ఆరెంజీ ఆర్మీ లోపాలను సరిచేసుకుని దుమ్మురేపుతుందని ఆశిద్దాం.

Tags:    

Similar News