భారీ ట్రోలింగ్.. SRHకు గుణపాఠం.. సమాధానం చెప్పాల్సిందే

దీంతో ఇప్పటికైనా సన్ రైజర్స్ ఈ గుణపాఠం నేర్చి ముందుకు పోవాల్సిన అగత్యం ఏర్పడింది.;

Update: 2025-03-31 12:40 GMT

బాగా ఆడితే పొగడ్తలు.. ఆడకపోతే తిట్లు... ఇప్పుడు ఇదే సన్ రైజర్స్ హైదరాబాద్ కు శాపమైంది. ఒకప్పుడు పొగిడిన నోళ్లే ఇప్పుడు ఓటమితో తిడుతుంటే ఆత్మ పరిశీలన చేసుకోవాల్సిన అవసరం సన్ రైజర్స్ కు ఏర్పడింది. ఇప్పుడు భారీ స్కోర్లు చేయలేక సన్ రైజర్స్ ఓడిపోతుంటే భారీ ట్రోలింగ్ జరుగుతోంది. దీంతో ఇప్పటికైనా సన్ రైజర్స్ ఈ గుణపాఠం నేర్చి ముందుకు పోవాల్సిన అగత్యం ఏర్పడింది.

సన్‌రైజర్స్ హైదరాబాద్ (SRH) క్రికెట్ జట్టు ఈ సీజన్‌లో ఒక ప్రత్యేకమైన బ్రాండ్‌తో ప్రేక్షకులను అలరిస్తోంది. ప్రతి మ్యాచ్‌లోనూ బౌండరీలు, సిక్సర్ల వర్షం కురిపిస్తూ ప్రత్యర్థులకు ముచ్చెమటలు పట్టిస్తోంది. అయితే ఈ దూకుడు ఆట కొన్నిసార్లు విఫలం కావడం.. జట్టు ఓటమిని చవిచూడటం జరుగుతోంది. దీంతో కొందరు నెటిజన్లు SRHను దారుణంగా ట్రోల్ చేస్తున్నారు.

ఢిల్లీ క్యాపిటల్స్ , లక్నో సూపర్ జెయింట్స్ చేతిలో ఓటమి పాలవడంతో SRH పై విమర్శలు ఎక్కువయ్యాయి. గత రెండు మ్యాచ్‌లలో ఆశించిన స్థాయిలో రాణించలేకపోయింది. సహజంగానే ప్రతి జట్టు టోర్నమెంట్‌లో గెలుపు ఓటములను చూస్తుంది. కానీ SRH విషయంలో ఈ ట్రోలింగ్ ఒక కొత్త స్థాయికి చేరుకుంది. టోర్నమెంట్ ప్రారంభంలో SRH చూపించిన ఉత్సాహం.. వారు చేసిన భారీ స్కోర్ల కారణంగా ఇప్పుడు ప్రతి మ్యాచ్‌లోనూ 300 పరుగులు చేయాలని కొందరు డిమాండ్ చేస్తున్నారు. జట్టు 300 పరుగులు చేయలేకపోతే చాలు, సోషల్ మీడియాలో విమర్శలు వెల్లువెత్తుతున్నాయి.

నిజానికి SRHను 300 పరుగులు చేయలేదని ట్రోల్ చేయడం అనేది ఒక విధమైన స్వీయ నియంత్రణ చర్యగా చూడాలి. ఎందుకంటే ఒక జట్టు లీగ్‌పై ఎంత బలమైన ముద్ర వేసిందో, ఎంత దూకుడుగా ఆడుతుందో ఈ ట్రోలింగ్ తెలియజేస్తుంది. SRH తమ మెరుపు బ్యాటింగ్‌తో ప్రేక్షకుల్లో అంచనాలను పెంచింది. నేటికీ SRH లీగ్‌లో అత్యంత వినోదాత్మకమైన జట్లలో ఒకటిగా నిలుస్తుంది. గత కొన్నేళ్లుగా వారు ఇదే ఆటతీరును కొనసాగిస్తున్నారు. ఈ దూకుడు స్వభావాన్ని జట్టు నుండి వేరు చేయకూడదు, ట్రోలింగ్‌ను సమర్థించకూడదు. ఒక గొప్ప విజయం సాధిస్తే ఈ విమర్శలన్నీ మాయమవుతాయి.

అయితే SRH ఎదుర్కొంటున్న అసలు సవాల్ ఏమిటంటే... వారు తమ హోమ్ గ్రౌండ్ అయిన హైదరాబాద్ వెలుపల కూడా ఇదే విధమైన స్థిరమైన దూకుడు క్రికెట్‌ను ఆడటం. ఇది ఇప్పుడు జట్టుకు అత్యంత కీలకం కానుంది. ఇతర వేదికలపై కూడా SRH తమదైన శైలిలో చెలరేగితే, ఈ ట్రోలింగ్‌కు సరైన సమాధానం చెప్పినట్లవుతుంది.

Tags:    

Similar News