తొలిసారి క్రికెట్ ప్రపంచ చాంప్‌గా దక్షిణాఫ్రికా! దురదృష్టం లేకుంటే..
1992 వన్డే ప్రపంచ కప్.. దక్షిణాఫ్రికా తిరిగి అంతర్జాతీయ క్రికెట్‌లోకి వచ్చిన తర్వాత తొలి ప్రపంచ కప్. ఈ టోర్నీలో అద్భుతంగా ఆడిన ఆ జట్టు సెమీఫైనల్‌కు చేరింది.;
పేరుకు పెద్దజట్టే..గొప్పబ్యాట్స్‌మెన్.. గొప్పబౌలర్లు..గొప్ప ఆల్‌రౌండర్లు ఉన్న జట్టే.. కానీ, 35 ఏళ్లలో ఒక్కసారీ ప్రపంచ చాంపియన్ కాలేదు.. చాలా మెరుగ్గా ఆడిన ప్రతిసారీ ఏదో ఒక దురదృష్టం ఆ జట్టును వెంటాడేది.. పేరు దక్షిణాఫ్రికా అయినా.. దురదృష్టాఫ్రికాగా అభిమానులు పేర్కొనేవారు. ఇదంతా ప్రపంచ క్రికెట్‌లో దక్షిణాఫ్రికా గురించి ఉన్న నిజం. సఫారీలు, ప్రొటీస్‌గా పిలుచుకునే దక్షిణాఫ్రికా... 1990 వరకు జాతి వివక్ష కారణంగా నిషేధంలో ఉంది. 21 ఏళ్ల నిషేధం అనంతరం 1990ల ప్రారంభంలో తిరిగి అంతర్జాతీయ క్రికెట్‌లోకి వచ్చింది. మొదటే మంచి క్రికెట్ కల్చర్ ఉన్న టీమ్ కావడంతో.. నిషేధం ప్రభావం ఏమీ లేకపోయింది. అయితే, దురదృష్టం మాత్రం వెన్నంటే ఉండేది.
-1992 వన్డే ప్రపంచ కప్.. దక్షిణాఫ్రికా తిరిగి అంతర్జాతీయ క్రికెట్‌లోకి వచ్చిన తర్వాత తొలి ప్రపంచ కప్. ఈ టోర్నీలో అద్భుతంగా ఆడిన ఆ జట్టు సెమీఫైనల్‌కు చేరింది. కానీ, వర్షం కారణంగా ఓడింది. ఇంగ్లండ్‌లో జరిగిన ఆ మ్యాచ్‌లో 13 బంతుల్లో 22 పరుగులు చేయాల్సిన సమయంలో వర్షం పడింది. దీంతో 1 బంతికి 22 పరుగులుగా అసాధ్యమైన సమీకరణం ఎదురైంది. చివరకు ఏడుస్తూ ఇంటి బాటపట్టింది.
-1996లో భారత్‌లో జరిగిన ప్రపంచ కప్‌లోనూ దక్షిణాఫ్రికా బలమైన జట్టుగానే దిగింది. కానీ, అంచనాలను అందుకోలేకపోయింది.
-ఇక 1999 ప్రపంచ కప్‌లో మరీ ఘోరం. అత్యద్భుతంగా ఆడి సెమీస్ వరకు వచ్చి.. చివర్లో బోల్తా కొట్టింది. ఒత్తిడి తట్టుకోలేక చివర్లో చేతులెత్తేసింది.లీగ్ దశలో ఆస్ట్రేలియా మీద గెలిచే మ్యాచ్‌లో ఓడడం, అదే ఆస్ట్రేలియా సెమీస్ ప్రత్యర్థి కావడం సఫారీల కొంపముంచింది.
-2003లో సొంతగడ్డపైనే ప్రపంచ కప్ నిర్వహించినా.. తీవ్రస్థాయిలో ప్రిపేర్ అయినా... అత్యంత దారుణంగా ఓడింది. కేవలం అంచనాల ఒత్తిడిలో మునిగిపోయింది.
-2007 వన్డే ప్రపంచ కప్‌లో ఆస్ట్రేలియా చేతిలో సెమీస్‌లో పరాజయం పాలైంది. 2011లో విఫలమైనా.. 2015లో సెమీస్‌లో న్యూజిలాండ్ చేతిలో తమ దేశానికే చెంది, న్యూజిలాండ్‌లో స్థిరపడిన ఆటగాడు గ్రాంట్ ఇలియట్ (84 నాటౌట్) దెబ్బకు ఇంటిముఖం పట్టింది. ఈ మ్యాచ్‌కు వర్షం అంతరాయం కలిగించింది.
-2019లో సెమీస్ చేరకున్నా.. 2023లో భారత్‌లో జరిగిన ప్రపంచకప్ లో సెమీస్‌లో ఆస్ట్రేలియాను ఓడించలేకపోయంది.
టి20ల్లోనూ..
-2024లో జరిగిన టి20 ప్రపంచకప్ లో తొలిసారి ఫైనల్ చేరింది. కానీ, చివరి ఓవర్ వరకు గెలిచే ఊపులో కనిపించినా.. భారత్ ముందు తలొంచింది. తాజాగా ప్రపంచ టెస్టు చాంపియన్‌షిప్ (డబ్ల్యూటీసీ) ఫైనల్లో ఆస్ట్రేలియాపై గెలుపు ముంగిట ఉంది. 281 పరుగుల టార్గెట్‌కు గాను చేతిలో 8 వికెట్లు ఉండగా 69 పరుగులే చేయాలి. ఓపెనర్ మార్క్ రమ్ (102 నాటౌట్), కెప్టెన్ బవుమా (65 నాటౌట్) క్రీజులో ఉన్నారు. ఈ మ్యాచ్‌లో గనుక గెలిస్తే ప్రపంచ టెస్టు చాంపియన్ అవుతుంది దక్షిణాఫ్రికా. ఫలితంగా మహిళల, పురుషుల క్రికెట్‌లో తొలిసారి చాంపియన్‌గా నిలిచినట్లు అవుతుంది. అయితే, అసలే ఆస్ట్రేలియాతో మ్యాచ్. ఇటు దక్షిణాఫ్రికా. దురదృష్టం ఎదురుకాకుంటే.. సఫారీలదే గెలుపు. అప్పుడు చరిత్రలో కొత్త అధ్యాయం మొదలవుతుంది.