ఐసీయూలో మొన్న అయ్యర్.. నేడు గిల్.. కెప్టెన్ గాయం తీవ్రమే!
అదికూడా బంతిని ఎదుర్కొంటూనో, నెట్స్ లో ప్రాక్టీస్ చేస్తూనో కాదు.. బ్యాటింగ్ సమయంలో మెడ కండరాలు పట్టేయడంతో గిల్ శనివారం కోల్ కతాలోని ఈడెన్ గార్డెన్స్ లో జరుగుతున్న తొలి టెస్టులో రిటైర్డ్ హర్ట్ గా వెనుదిరిగాడు;
టీమ్ ఇండియా కెప్టెన్ శుబ్ మన్ గిల్ గాయపడ్డాడు. అదికూడా బంతిని ఎదుర్కొంటూనో, నెట్స్ లో ప్రాక్టీస్ చేస్తూనో కాదు.. బ్యాటింగ్ సమయంలో మెడ కండరాలు పట్టేయడంతో గిల్ శనివారం కోల్ కతాలోని ఈడెన్ గార్డెన్స్ లో జరుగుతున్న తొలి టెస్టులో రిటైర్డ్ హర్ట్ గా వెనుదిరిగాడు. మళ్లీ బ్యాటింగ్ కు దిగలేదు. అతడు లేకపోవడం టీమ్ ఇండియా బ్యాటింగ్ పై ప్రభావం చూపింది. జట్టు 189 పరుగులకే సరిపెట్టుకోవాల్సి వచ్చింది. ఇక 124 పరుగుల టార్గెట్ తో రెండో ఇన్నింగ్స్ ఆడుతున్ టీమ్ ఇండియా వెంటవెంటనే ఓపెనర్ల వికెట్లు కోల్పోయింది. అయినా గిల్ రెండో ఇన్నింగ్స్ లో బ్యాటింగ్ కు దిగే వీలులేదు. ఇంతకూ అతడి గాయం తీవ్రత ఏమిటి? ఎందుకు అంత ఇబ్బంది అయింది? అత్యంత కీలక బ్యాటర్, కెప్టెన్ అయిన ఆటగాడు మైదానంలోకి రానంత పరిస్థితి ఎందుకు వచ్చింది? అనే ఈ ప్రశ్నలకు బీసీసీఐ స్పందించింది.
వర్క లోడ్ కాదు..
గిల్ మూడు ఫార్మాట్లలోనూ ఆడుతున్నాడు. వన్డే కెప్టెన్ అయ్యాడు. టి20ల్లో వైస్ కెప్టెన్ గా ఉన్నాడు. ఐపీఎల్ నుంచి మొన్నటి వెస్టిండీస్ సిరీస్ వరకు అలుపు లేకుండా క్రికెట్ ఆడాడు. ఇప్పుడు దక్షిణాఫ్రికాతో టెస్టు, వన్డే సిరీస్ ఆడాల్సి ఉంది. ఇలాంటి సమయంలో అతడి గాయం తీవ్రత ఆందోళన కలిగించేదే. అందుకనే టీమ్ ఇండియా కెప్టెన్ ది వర్క్ లోడ్ (పనిభారం)తో వచ్చిన గాయం కాదని బీసీసీఐ స్పష్టత ఇచ్చింది.
నిద్రలేమితో చేటు
నిద్ర లేమి ఎవరికైనా చేటే. ఎంత ఎక్కువగా తగినంత విశ్రాంతి తీసుకుంటే అంత మంచిది. ఇప్పుడు గిల్ కు ఇదే సమస్య ఎదురైంది. అతడికి నిద్ర లేమి కారణంగా కండరాలు పట్టేసినట్లు టీమ్ ఇండియా బౌలింగ్ కోచ్ మోర్కెల్ తెలిపాడు. ఇక గిల్ కోల్ కతా టెస్టుకు పూర్తిగా దూరమయ్యాడు. అతడిని శనివారం గ్రౌండ్ నుంచి నేరుగా ఆస్పత్రికి తీసుకెళ్లారు. ఐసీయూలో ఉంచి మరీ చికిత్స అందించారు. రెండో ఇన్నింగ్స్ లోనూ గిల్ బ్యాటింగ్ కు రాకపోతే అది జట్టు అవకాశాలపై ఎంతవరకు దెబ్బ కొడుతుందో చూడాలి. వాస్తవానికి శుక్రవారం మొదలైన ఈ టెస్టులో ఆ రోజంతా గిల్ ఫీల్డింగ్ చేశాడు. శనివారం మూడు బంతులే ఆడాడు. స్వీప్ షాట్ కొట్టబోగా మెడ పట్టేసింది. తీవ్రమైన నొప్పితో విలవిల్లాడిని అతడిని ఫిజియో పరీక్షించాడు. అనంతరం గ్రౌండ్ నుంచి బయటకు వెళ్లాడు.
దక్షిణాఫ్రితో తొలి టెస్టు మూడు రోజుల్లోనే ముగియనుంది. సోమవారం నుంచి ఆటగాళ్లకు ఖాళీ దొరుకతుంది. ఈ నెల 22 నుంచి గువాహటిలో జరిగే రెండో టెస్టు నాటికి గిల్ అందుబాటులో ఉంటాడో లేదో చూడాలి.