కన్నీళ్ల క్షణాలు.. భారత టీ20 జట్టు కెప్టెన్ అయిన వేళ అయ్యర్ నోటి వెంట మాటలు వైరల్
అవును.. టీమిండియా టీ20 జట్టు నయా సారథిగా బాధ్యతలు స్వీకరించిన వేళ.. స్టార్ బ్యాటర్ శ్రేయస్ అయ్యర్ గుండె గొంతుకై పలికిన మాటలు ఇప్పుడు ప్రతి ఒక్కరి కళ్లనూ చెమర్చుతున్నాయి.
కలలు కనడం వేరు.. ఆ కలలను నిజం చేసుకోవడానికి కనుపాపల్లో నిప్పులు పోసుకుని పోరాడటం వేరు. ఒక ఆటగాడి జీవితంలో ఇంతకంటే గొప్ప మలుపు.. ఇంతకంటే భావోద్వేగ క్షణం మరొకటి ఉండదేమో.. అవును.. టీమిండియా టీ20 జట్టు నయా సారథిగా బాధ్యతలు స్వీకరించిన వేళ.. స్టార్ బ్యాటర్ శ్రేయస్ అయ్యర్ గుండె గొంతుకై పలికిన మాటలు ఇప్పుడు ప్రతి ఒక్కరి కళ్లనూ చెమర్చుతున్నాయి. పడిన చోటే లేవాలి.. అవమానించిన చోటే సింహాసనాన్ని అధిష్టించాలి అనేదానికి నిలువెత్తు నిదర్శనంగా నిలిచాడు అయ్యర్. భారత జట్టుకు కెప్టెన్‌గా ఎంపికైన ఈ అపురూప సందర్భంలో తన కెరీర్‌లో ఎదుర్కొన్న చీకటి రోజులను గుర్తుచేసుకుంటూ ఆయన పంచుకున్న భావోద్వేగ వ్యాఖ్యలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.
అవమానాల నుంచి అగ్రపీఠం దాకా..
"భారత జట్టుకు కెప్టెన్‌గా ఎంపిక కావడం నాకు ఎంతో ఆనందంగా ఉంది. ఇది కేవలం దక్కిన గర్వకారణం మాత్రమే కాదు.. అంతకుమించిన ఒక పెద్ద బాధ్యత" అంటూ అయ్యర్ తన మనసులోని మాటను పంచుకున్నారు. ఈ స్థాయికి చేరుకోవడానికి తను అనుభవించిన నరకాన్ని దాటి వచ్చిన సవాళ్లను ఆయన గుర్తు చేసుకున్నారు. "సరిగ్గా రెండేళ్ల క్రితం.. నన్ను బీసీసీఐ సెంట్రల్ కాంట్రాక్ట్ నుంచి తొలగించారు. నా చుట్టూ ఎన్నో విమర్శలు.. మరెన్నో ప్రశ్నలు. ఆ సమయంలో నా లోపల ఏదో తెలియని శూన్యం. కానీ ఒకరోజు అద్దం ముందు నిలబడి నా సామర్థ్యాన్ని నిరూపించుకోవాలని నాకు నేనే గట్టిగా మాట ఇచ్చుకున్నాను. పట్టుదలతో శ్రమించాను. ఈరోజు నా లక్ష్యాన్ని ముద్దాడాను" అని అయ్యర్ చెప్తున్నప్పుడు ఆయన కళ్లల్లో ఒక గెలిచిన యోధుడి మెరుపు కనిపించింది.
అమ్మనాన్నల కన్నీళ్లు.. మరువలేని ఆ వీడియో కాల్
తాను అనుకున్న లక్ష్యాన్ని సాధించినందుకు సంతోషంగా ఉందన్న అయ్యర్.. ఈ విజయం తన కుటుంబంలో తెచ్చిన ఆనందాన్ని పంచుకుంటూ మరింత ఎమోషనల్ అయ్యారు. "ఈ అద్భుతమైన వార్త తెలిసిన వెంటనే నేను మొదట నా తల్లిదండ్రులకు వీడియో కాల్ చేశాను. నా వైపు చూసి వారు ఆనందంతో కన్నీళ్లు పెట్టుకున్నారు. ఆ కన్నీళ్లలో నా ఇన్నేళ్ల కష్టం.. వారి త్యాగం నాకు కనిపించాయి. వారిని అలా చూసి నాకూ దుఃఖం ఆగలేదు. నేనూ భావోద్వేగానికి లోనయ్యాను. ఆ నాలుగు నిమిషాల సంభాషణ.. ఆ క్షణం నా జీవితంలో ఎప్పటికీ మర్చిపోలేనిది, నా గుండెల్లో పదిలంగా దాచుకునేది" అంటూ అత్యంత హృద్యంగా వివరించారు.
ముందుంది అసలైన బాధ్యత.. లక్ష్యం ఐసీసీ ట్రోఫీలే!
వ్యక్తిగత విజయాలు, రికార్డుల కంటే దేశానికి సేవ చేయడమే తన ప్రధాన లక్ష్యమని శ్రేయస్ స్పష్టం చేశారు. "ఈ పదవి కేవలం ఆరంభం మాత్రమే. ఇప్పుడే అసలు బాధ్యత ప్రారంభమైంది. భారత జట్టును విజయపథంలో నడిపించడం.. ముఖ్యంగా దేశం ఎన్నాళ్లుగానో ఎదురుచూస్తున్న ఐసీసీ ట్రోఫీలను గెలిపించడమే నా తదుపరి ప్రధాన లక్ష్యం. జట్టు కోసం, దేశం కోసం నా వంతు శక్తి మేరకు రక్తం ధారపోసైనా సరే కృషి చేస్తాను" అని దేశంపై తనకున్న భక్తిని చాటుకున్నారు.
సెంట్రల్ కాంట్రాక్ట్ కోల్పోయి కెరీర్ ముగిసిపోయిందనుకున్న స్థితి నుంచి.. నేడు భారత జట్టును నడిపించే కెప్టెన్‌గా ఎదగడం శ్రేయస్ అయ్యర్ అకుంఠిత పట్టుదలకు, క్రమశిక్షణకు, నిరంతర కష్టానికి నిదర్శనమని ప్రపంచవ్యాప్తంగా ఉన్న క్రికెట్ అభిమానులు సెల్యూట్ చేస్తున్నారు. 'రారాజులా తిరిగొచ్చావు అయ్యర్' అంటూ నెటిజన్లు కామెంట్లు పెడుతున్నారు. శ్రేయస్ అయ్యర్ సగర్వ నాయకత్వంలో భారత టీ20 జట్టు సరికొత్త చరిత్రను లిఖించాలని.. ప్రపంచ క్రికెట్ వేదికపై భారత జెండా రెపరెపలాడాలని మనసారా కోరుకుందాం..