భారత్ కు శివరాత్రి… పాక్ కు మ‌ళ్లీ కాళరాత్రే

దేశం మారినా ఫ‌లితం మార‌లేదు.. టోర్నీ మారినా ఫ‌లితం మార‌లేదు.. ఆడ‌బోమంటూ డాంబికాలు ప‌లికి మ‌ళ్లీ వెన‌క్కు త‌గ్గినా.. ఫ‌లితం మార‌లేదు..! పాకిస్థాన్ కు ప‌రాభ‌వం త‌ప్ప‌లేదు.;

Update: 2026-02-15 17:30 GMT

దేశం మారినా ఫ‌లితం మార‌లేదు.. టోర్నీ మారినా ఫ‌లితం మార‌లేదు.. ఆడ‌బోమంటూ డాంబికాలు ప‌లికి మ‌ళ్లీ వెన‌క్కు త‌గ్గినా.. ఫ‌లితం మార‌లేదు..! పాకిస్థాన్ కు ప‌రాభ‌వం త‌ప్ప‌లేదు. టి20 ప్ర‌పంచ క‌ప్ లో భాగంగా ఆదివారం పాకిస్థాన్ తో కొలంబోలోని ప్రేమ‌దాస స్టేడియంలో జ‌రిగిన లీగ్ మ్యాచ్ లో టీమ్ ఇండియా 61 ప‌రుగులో ఘ‌న విజ‌యం సాధించింది. గ‌త ఏడాది ఆసియా క‌ప్ లో వ‌రుస‌గా మూడు ఆదివారాల్లో ఫైన‌ల్ స‌హా మూడుసార్లు ఓడించిన టీమ్ ఇండియాకు ఇది మ‌రో గెలుపు. పాక్ పై టి20 ప్ర‌పంచ క‌ప్ లో ఏడో విజ‌యం. ఇదివ‌ర‌కు ఏడు సార్లు త‌ల‌ప‌డ‌గా ఆరుసార్లు మ‌న టీమ్ ఇండియా గెలీఇచింది. 2021లో మాత్ర‌మే ఓడిపోయింది. ఇక ఆదివారం నాటి ఫైన‌ల్ కు వ‌స్తే టాస్ ఓడిపోవ‌డం ఒక్క‌టి త‌ప్ప టీమ్ ఇండియా మిగ‌తా ఆట‌ మొత్తం అద‌ర‌గొట్టింది. ఆసియాక‌ప్ త‌ర‌హాలోనే షేక్ హ్యాండ్ ఇవ్వ‌కుండా టాస్ ను ముగించాడు భార‌త కెప్టెన్ సూర్య‌. అస‌లు టాస్ గెలిచిన జ‌ట్టు బ్యాటింగ్ ఎంచుకునే ప‌రిస్థితుల్లో బౌలింగ్ తీసుకోవ‌డం పాక్ కెప్టెన్ స‌ల్మాన్ అలీ అఘా చేసిన పెద్ద త‌ప్పిదం. దీనిని టీమ్ ఇండియా బాగా స‌ద్వినియోగం చేసుకుంది.

అభిషేక్ డ‌కౌట్.. ఇషాన్ తుఫాన్

ఈ ప్ర‌పంచ క‌ప్ లో అమెరికాతో జ‌రిగిన మ్యాచ్ లో డ‌కౌట్ అయి.. ఆ త‌ర్వాత క‌డుపులో ఇన్ఫెక్ష‌న్ తో మైదానంలోకి కూడా రాని విధ్వంస‌క ఓపెన‌ర్ అభిషేక్ శ‌ర్మ త‌ర్వాత న‌మీబియాతో మ్యాచ్ ఆడ‌ని సంగ‌తి తెలిసిందే. పాక్ తో కీల‌క పోరు కాబ‌ట్టి అభిషేక్ తిరిగి వ‌చ్చాడు. కానీ, మ‌ళ్లీ డ‌కౌట్ అయ్యాడు. నాలుగు బంతులు ఆడినా.. ఖాతా తెర‌వ‌లేదు. దీంతో వ‌రుస‌గా రెండో మ్యాచ్ లోనూ అత‌డు డ‌కౌట్ అయిన‌ట్లు అయింది. కానీ, మ‌రో విధ్వంస‌క ఓపెన‌ర్ ఇషాన్ కిష‌న్ మాత్రం ఎలాంటి అవ‌కాశం ఇవ్వ‌లేదు. త‌న తుఫాన్ ఇన్నింగ్సే మ్యాచ్ లో తేడా చూపింది. అభిషేక్ ఔట్ అయినా.. ఏమాత్రం వెర‌వ‌ని ఇషాన్ చెల‌రేగి ఆడాడు. 40 బంతుల్లో 77 ప‌రుగులు చేశాడు. అత‌డు 10 ఫోర్లు, 3 సిక్సులు కొట్టాడు. హైద‌రాబాదీ కుర్రాడు తిల‌క్ వ‌ర్మ 24 బంతుల్లో 25, (2 ఫోర్లు, సిక్స్), కెప్టెన్ సూర్య‌కుమార్ యాద‌వ్ (29 బంతుల్లో 32, 3 ఫోర్లు), శివ‌మ్ దూబె (17 బంతుల్లో 27, 3 ఫోర్లు, సిక్స్), రింకూ సింగ్ (4 బంతుల్లో 11, సిక్స్, ఫోర్) త‌లో చేయి వేశారు. దీంతో భార‌త్ నిర్ణీత ఓవ‌ర్ల‌లో ఏడు వికెట్లు కోల్పోయి 175 ప‌రుగులు చేసింది. భారీ షాట్ లు కొట్టే ప్ర‌య‌త్నంలో హార్దిక్ పాండ్యా, అక్ష‌ర్ ప‌టేల్ డ‌కౌట్ అయ్యారు.

బంతితో మెరిసిన పాండ్యా..

బ్యాట్ తో విఫ‌ల‌మైన హార్దిక్ పాండ్యా.. బంతితో తొలి ఓవ‌ర్లోనే అద్భుత ప్ర‌ద‌ర్శ‌న చేశాడు. మెయిడిన్ ఓవ‌ర్ వేయ‌డ‌మే కాక వికెట్ తీశాడు. రెండో ఓవ‌ర్లో బుమ్రా ఏకంగా రెండు వికెట్లు ప‌డ‌గొట్టాడు. దీంతో పాక్ కు కోలుకునే చాన్స్ లేక‌పోయింది. ఓపెన‌ర్లు షాహిబ్ జాదా ఫ‌ర్హాన్ (0), స‌యీమ్ అయూబ్ (6), కెప్టెన్ స‌ల్మాన్ అఘా (4), స్టార్ బ్యాట‌ర్ బాబార్ ఆజామ్ (5) ఇలా ఎవ‌రూ నిల‌దొక్కుకోక‌పోవ‌డంతో పాక్ కు 175 ప‌రుగుల టార్గెట్ కొండంత‌గా మారింది. వికెట్ కీప‌ర్ బ్యాట‌ర్ ఉస్మాన్ ఖాన్ (34 బంతుల్లో 44) ఒక్క‌డే కాస్త ప‌రుగులు చేశాడు. 18 ఓవ‌ర్ల‌లో పాక్ కేవ‌లం 114 ప‌రుగుల‌కే ఆలౌటైంది.

భార‌త బౌల‌ర్లు భ‌ళా

తొలి ఓవ‌ర్లో వికెట్ తో హార్దిక్ ఇచ్చిన శుభారంభాన్ని మిగ‌తా భార‌త బౌల‌ర్లు అందిపుచ్చుకున్నారు. హార్దిక్, బుమ్రా, అక్ష‌ర్, వ‌రుణ్ త‌లో రెండు వికెట్లు ప‌డ‌గొట్టారు. కుల్దీప్, తిల‌క్ ఒక్కో వికెట్ తీశారు. మూడేసి ఓవ‌ర్లు వేసిన హార్దిక్, మిస్ట‌రీ స్పిన్న‌ర్ వ‌రుణ్ బౌలింగ్ ల‌ను ఆడ‌డం పాక్ కు క‌ష్ట‌మైపోయింది. బుమ్రా ఎప్ప‌టిలాగానే బుల్లెట్ బంతులు వేశాడు. 73 ప‌రుగుల‌కే 5 వికెట్లు కోల్పోయిన‌ పాక్ ఛేద‌న‌లో పోటీలో లేకుండా పోయింది. దీంతో మ‌రోసారి భార‌త్ కు శివ‌రాత్రి.. పాక్ కు కాళ‌రాత్రి అయింది.

-భార‌త్-పాక్ మ‌ధ్య 2003 వ‌న్డే ప్ర‌పంచ‌క‌ప్ మ్యాచ్ శివ‌రాత్రి రోజే జ‌రిగింది. అప్ప‌టికి టి20లు లేవు. టీమ్ ఇండియా అద్భుతంగా ఆడి గెలిచింది. అప్ప‌టినుంచి ఇరు జ‌ట్ల మ‌ధ్య శివ‌రాత్రి రోజు మ్యాచ్ జ‌ర‌గ‌డం ఇదే మొద‌టిసారి.

Tags:    

Similar News