వేరే శశాంక్ అనుకుని పొరపాటున కొంటే... నిర్దాక్షిణ్యంగా బాదుతున్నాడు!

ప్రస్తుతం దేశవ్యాప్తంగా ఒకపక్క లోక్ సభ ఎనికల సీజన్ నడుస్తుంటే.. మరోపక్క ఐపీఎల్ ఫీవర్ వైరల్ గా మారుతోన్న సంగతి తెలిసిందే.

Update: 2024-04-27 04:02 GMT

ప్రస్తుతం దేశవ్యాప్తంగా ఒకపక్క లోక్ సభ ఎనికల సీజన్ నడుస్తుంటే.. మరోపక్క ఐపీఎల్ ఫీవర్ వైరల్ గా మారుతోన్న సంగతి తెలిసిందే. ప్రతీరోజూ సాయంత్రం 7 దాటిందంటే చాలు టీవీలకూ, మొబైల్ ఫోన్లకూ అతుక్కుపోతూ ఐపీఎల్ మ్యాచ్ లను వీక్షిస్తున్నారు కోట్ల మంది! ఈ ఐపీఎల్ కారణంగా... మట్టిలోని మాణిక్యాలు ఎన్నో వెలుగులోకి వస్తున్నాయనే కామెంట్లు వినిపిస్తున్న సంగతి తెలిసిందే.

వెలుగులోకి రాని ఎంతో టాలెంటెడ్ ప్లేయర్స్.. ఈ ఐపీఎల్ పుణ్యమాని వెలుగులోకి వస్తున్నారని, ప్రపంచానికి పరిచయం అవుతున్నారని అంటున్నారు. అయితే.. ఈ ఐపీఎల్ సీజన్ లో పొరపాటున కొనబడ్డాడు శశాంక్ సింగ్. తాము వేరొకరికి బదులుగా అదే పేరుతో ఉన్న శశాంక్ ను రూ.20 లక్షలకు కొనుగోలు చేశామని పంజాబ్ యాజమాన్యం ప్రకటించింది! అయితే... ఆ పొరపాటే వారికి అదృష్టంగా మారిపోయింది!

అవును... ఇప్పుడు పంజాబ్ టీం లో శశాంక్ సింగ్ పేరు మారుమ్రోగిపోతుంది. ఈ సీజన్ లో 9 మ్యాచ్ లు ఆడిన శశాంక్ 65.75 యావరేజ్ తో, 182.64 స్ట్రైక్ రేట్ తో 263 పరుగులు సాధించాడు. ఇందులో రెండు అర్ధసెంచరీలు ఉండగా... మొత్తం 19 ఫోర్లు, 18 సిక్స్ లు బాదాడు. అంటే... ఆ 263 లోనూ 184 పరుగులు బౌండరీలతోనే రాబట్టాడన్నమాట.

ఈ క్రమంలో ఈ నెల మొదట్లో గుజరాత్ పై జరిగిన మ్యాచ్ లో 29 బంతుల్లో 61 పరుగులు సాధించిన శశాంక్ సింగ్.. తాజాగా కోల్ కతాపై జరిగిన మ్యాచ్ లో మరింత దారుణంగా చెలరేగిపోయాడు. కోల్ కతా బౌలర్లపై నిర్దాక్షిణ్యంగా విరుచుకుపడ్డాడు. అసలు సింగిల్స్‌ అన్నవి ఉన్నట్లే మరిచిపోయినట్లు ఆడేశాడు.

కోల్ కతాతో జరిగిన తాజా మ్యాచ్ లో ఆఖరి ఆరు ఓవర్లలో 66 పరుగులు చేయాల్సిన స్థితిలో... భీకరంగా విరుచుకుపడ్డాడు శశాంక్‌ సింగ్‌! నైట్‌ రైడర్స్‌ కు చిన్న అవకాశం కూడా లేకుండా చేశాడు. కళ్లు చెదిరే షాట్లతో ఒకే ఓవర్లో మూడు సిక్స్‌ లు.. ఆ తర్వాత ఓవర్లో వరుసగా రెండు సిక్సులు, ఒక ఫోర్ బాదేసి కింగ్స్‌ పనిని మరింత తేలిక చేశాడు. ఇంకా 8 బంతులుండగానే పని పూర్తిచేశాడు.

ఈ మ్యాచ్ లో నాలుగో స్ధానంలో బ్యాటింగ్‌ కు వచ్చిన శశాంక్‌.. కేవలం 28 బంతుల్లో 2 ఫోర్లు, 8 సిక్స్‌ లతో 68 పరుగులు చేసి ఆజేయంగా నిలిచాడు. అంటే ఆ 68 పరుగుల్లోనూ 56 పరుగులు బౌండరీలతోనే సాధించాడు. దీంతో... శశాంక్ సింగ్ ఇన్నింగ్స్‌ కు సంబంధించిన వీడియోలు ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్‌ గా మారాయి.

Tags:    

Similar News