విరాట్‌ను కొట్టాలంత కోపం వచ్చింది.. వీరేంద్ర సెహ్వాగ్ సంచలన వ్యాఖ్యలు

భారత క్రికెట్ చరిత్రలో తనదైన దూకుడైన బ్యాటింగ్‌తో ప్రత్యర్థి బౌలర్లకు చుక్కలు చూపించిన మాజీ ఓపెనర్ వీరేంద్ర సెహ్వాగ్ తాజాగా చేసిన వ్యాఖ్యలు సోషల్ మీడియాలో హాట్ టాపిక్‌గా మారాయి.

Update: 2026-06-14 13:30 GMT

భారత క్రికెట్ చరిత్రలో తనదైన దూకుడైన బ్యాటింగ్‌తో ప్రత్యర్థి బౌలర్లకు చుక్కలు చూపించిన మాజీ ఓపెనర్ వీరేంద్ర సెహ్వాగ్ తాజాగా చేసిన వ్యాఖ్యలు సోషల్ మీడియాలో హాట్ టాపిక్‌గా మారాయి. మైదానంలో ఎప్పుడూ ప్రశాంతంగా నవ్వుతూ కనిపించే సెహ్వాగ్‌కు టీమిండియా స్టార్ బ్యాటర్ విరాట్ కోహ్లీపై ఒకానొక సమయంలో తీవ్రమైన కోపం వచ్చిందట. ఎంతలా అంటే కోహ్లీని పట్టుకుని కొట్టాలన్నంత కోపం వచ్చిందని వీరూ స్వయంగా వెల్లడించడం ఇప్పుడు క్రికెట్ వర్గాల్లో సంచలనం సృష్టిస్తోంది. అయితే ఈ కోపం వెనుక ఎలాంటి వ్యక్తిగత విభేదాలు లేవని, కేవలం జట్టు ప్రయోజనాల కోసమే తనకు అంత కోపం వచ్చిందని సెహ్వాగ్ స్పష్టం చేశాడు.

ఆస్ట్రేలియా పర్యటనలో అసలేం జరిగిందంటే..?

ఇటీవల ఒక కార్యక్రమంలో పాల్గొన్న వీరేంద్ర సెహ్వాగ్‌కు ఒక ఆసక్తికరమైన ప్రశ్న ఎదురైంది. "మీ కెరీర్‌లో ఎప్పుడైనా, ఏ ఆటగాడిపైనైనా తీవ్రమైన కోపంతో కొట్టాలనిపించిందా?" అని యాంకర్ అడగ్గా సెహ్వాగ్ ఏమాత్రం తడుముకోకుండా విరాట్ కోహ్లీ పేరును చెప్పాడు. ఆ వివరాలను చెప్పుకొచ్చాడు. "అది 2011-12 ఆస్ట్రేలియా పర్యటనలోని పెర్త్ టెస్ట్ మ్యాచ్. అప్పట్లో విరాట్ కోహ్లీ జట్టులోకి వస్తూ వస్తూనే ఎంతో అగ్రెసివ్‌గా ఉండేవాడు. ఆ మ్యాచ్ జరుగుతున్న సమయంలో విరాట్ బౌండరీ లైన్ వద్ద ఫీల్డింగ్ చేస్తున్నాడు. అక్కడ ఉన్న ఆస్ట్రేలియా ప్రేక్షకులు కోహ్లీని బాగా స్లెడ్జ్ చేశారు..వెక్కిరించారు. దాంతో సహనం కోల్పోయిన విరాట్, ప్రేక్షకులను ఉద్దేశించి తన మధ్య వేలిని చూపిస్తూ సైగ చేశాడు. ఈ ప్రవర్తన కెమెరాలకు చిక్కడంతో మ్యాచ్ రిఫరీ అతనిపై క్రమశిక్షణా చర్యలు తీసుకుని, మ్యాచ్ ఫీజులో జరిమానా విధించాడు.

కొట్టాలనేంత కోపం రావడానికి గల కారణం ఇదే

ఆ సమయంలో విరాట్ చేసిన పనికి తనకు ఎందుకు అంత కోపం వచ్చిందో కూడా సెహ్వాగ్ చాలా స్పష్టంగా వివరించాడు. ఆ సిరీస్‌లో భారత సీనియర్ బ్యాటింగ్ ఆర్డర్ పూర్తిగా విఫలమైంది. సచిన్, లక్ష్మణ్, ద్రవిడ్ వంటి దిగ్గజాలు కూడా పరుగులు చేయలేక ఇబ్బంది పడ్డారు. అలాంటి క్లిష్ట పరిస్థితుల్లో పెర్త్ టెస్టులో విరాట్ కోహ్లీ ఒక్కడే ఒంటరి పోరాటం చేస్తూ 75కు పైగా పరుగులు 75 & 44 చేసి రాణించాడు. "ఆ సిరీస్‌లో మా బ్యాటింగ్ ఘోరంగా విఫలమవుతోంది. కోహ్లీ మాత్రమే కాస్తో కూస్తో పోరాడుతున్నాడు. ఒకవేళ ఆ వేలి సైగ కారణంగా మ్యాచ్ రిఫరీ కోహ్లీపై జరిమానాతో సరిపెట్టకుండా ఒకటి లేదా రెండు మ్యాచ్‌ల పాటు నిషేధం విధించి ఉంటే పరిస్థితి ఏంటా అని నా గుండె ఆగింది. అతను లేకపోతే తర్వాతి మ్యాచ్‌లో మా బ్యాటింగ్ మరింత బలహీనపడి జట్టు ఘోర పరాజయాన్ని మూటగట్టుకోవాల్సి వచ్చేది. జట్టును అంతటి ప్రమాదంలోకి నెట్టేలా ప్రవర్తించినందుకే నాకు అతనిపై తీవ్రమైన కోపం వచ్చింది. రూమ్‌లోకి పిలిచి కొట్టాలన్నంత కసి పుట్టింది" అని సెహ్వాగ్ నవ్వుతూ నాటి జ్ఞాపకాలను పంచుకున్నాడు.

సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న వీరూ కామెంట్స్

సెహ్వాగ్ చేసిన ఈ వ్యాఖ్యలు ప్రస్తుతం నెట్టింట విపరీతంగా వైరల్ అవుతున్నాయి. అప్పట్లో విరాట్ కోహ్లీ ఎంతటి దూకుడు స్వభావాన్ని కలిగి ఉండేవాడో అదే సమయంలో యువకుడైనప్పటికీ జట్టుకు అతను ఎంత కీలకమైన ఆటగాడిగా మారాడో సెహ్వాగ్ మాటల ద్వారా మరోసారి రుజువైంది. సీనియర్ ఆటగాడిగా సెహ్వాగ్‌కు జట్టుపై ఉన్న బాధ్యతను, కోహ్లీ ప్రతిభపై అతనికి ఉన్న నమ్మకాన్ని ఈ సంఘటన అద్దం పడుతోందని క్రికెట్ అభిమానులు కామెంట్స్ చేస్తున్నారు.

Tags:    

Similar News