తన ’స్టాండ్’లోకి తానే సిక్స్ కొడితే..? వాంఖడేలో రోహిత్ వండర్

తాజాగా టెస్టులకు రిటైర్మెంట్ ఇచ్చిన రోహిత్ ను ముంబై క్రికెట్ సంఘం ఘనంగా సన్మానించింది.;

Update: 2025-05-17 10:53 GMT

వాంఖడే.. ఈ పేరు ఎపుడు విన్నా భారత క్రికెట్ అభిమానుల గుండె పులకించిపోతుంది.. కెప్టెన్ ధోనీ కొట్టిన సిక్స్ తో ప్రపంచ విజేతగా నిలిచిన సందర్భం తలచుకుంటేనే రోమాలు నిక్కబొడుచుకుంటాయి. సునీల్ గావస్కర్, సచిన్ టెండూల్కర్, రోహిత్ శర్మ.. ఇలా ఎందరో దిగ్గజ క్రికెటర్లను అందించింది ఈ మైదానం. మరెందరో మేటి క్రికెటర్లూ ఇక్కడినుంచి వచ్చి దేశానికి సేవలందించారు.

మొన్న సునీల్ గావస్కర్ పేరిట ప్రధాన కార్యాలయంలో బోర్డ్ రూమ్ ఏర్పాటు చేసి బీసీసీఐ అతడిని గౌరవించగా.. తాజాగా మాజీ కెప్టెన్ రోహిత్ శర్మ పేరిట ప్రఖ్యాత వాంఖడే స్టేడియంలో ఓ స్టాండ్ ను ప్రారంభించారు. దీని ఆవిష్కరణకు తల్లిదండ్రులు, భార్యా పిల్లలతో హాజరయ్యాడు రోహిత్ శర్మ. ఈ సందర్భానికి సంబంధించిన వీడియోలు ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ గా మారాయి.

తాజాగా టెస్టులకు రిటైర్మెంట్ ఇచ్చిన రోహిత్ ను ముంబై క్రికెట్ సంఘం ఘనంగా సన్మానించింది. వాంఖడేలో రోహిత్ స్టాండ్ ను మహారాష్ట్ర సీఎం దేవేంద్ర ఫడణవీస్, రోహిత్ తల్లిదండ్రులు పూర్ణిమాశర్మ, గురునాథ్‌ శర్మలు ఆవిష్కరించారు.

వాంఖడేలో గావస్కర్, సచిన్ తో పాటు వినూ మన్కడ్, దిలీల్ వెంగ్ సర్కార్ పేర్లతో ఇప్పటికే స్టాండ్ లు ఉన్నాయి. తాజాగా రోహిత్ తో పాటు ఎన్సీపీ చీఫ్, రాజకీయ శిఖరం శరద్ పవార్, టీమ్ ఇండియా మాజీ ఆటగాడు అజిత్ వాడేకర్ పేరిట స్టాండ్లు ఏర్పాటు చేశారు.

దిగువ మధ్య తరగతి కుటుంబం నుంచి వచ్చిన రోహిత్ శర్మ.. క్రికెట్ లో ఎంతో ఎత్తుకు ఎదిగాడు. దేశానికి టి20 ప్రపంచ కప్, చాంపియన్స్ ట్రోఫీ అందించాడు. వన్డే ప్రపంచ కప్, టెస్టు చాంపియన్ షిప్ లో ఫైనల్స్ కు తీసుకెళ్లాడు. అయితే, ఈ స్థాయికి ఎదిగేందుకు అతడు ఎంతో ఆర్థిక ఇబ్బందులను ఎదుర్కొన్నాడు. అయినా రోహిత్ క్రికెట్ పట్ల తన ఆపేక్షను వదులుకోలేదు. కాగా, తమ కుమారుడి పేరిట స్టాండ్ ను ఆవిష్కరించిన రోహిత్ తల్లిదండ్రులు భావోద్వేగాన్ని ఆపుకోలేకపోయారు.

ఇక రోహిత్ సైతం తన స్టాండ్ ప్రత్యేకతను వివరించాడు. సరిగ్గా రైల్ స్టేషన్ దిగి లోపలకు వచ్చే ప్రదేశంలో తన స్టాండ్ ఉందని.. వాంఖడేను చూసిన ప్రతిసారీ తనకెంతో భావోద్వేగంగా ఉంటుందని చెప్పాడు.

ఇక ప్రస్తుత ఐపీఎల్ సీజన్ శనివారం నుంచి తిరిగి మొదలుకానుంది. ముంబై ఇండియన్స్ 14 పాయింట్లతో నాలుగో స్థానంలో ఉంది. పంజాబ్ కింగ్స్ తో ఈ నెల 21న మ్యాచ్ ఆడనుంది. దీంట్లో గెలిస్తే ప్లేఆఫ్స్ చేరుతుంది. మరి ఈ మ్యాచ్ లో రోహిత్ తన పేరిట ఉన్న స్టాండ్స్ లోకి సిక్స్ కొడతాడా..? బహుశా గావస్కర్, సచిన్ లకూ ఈ అవకాశం వచ్చి ఉండకపోవచ్చు.

Tags:    

Similar News