రోహిత్ శర్మకు ఘోర అవమానం? టెస్టులకు వీడ్కోలు వెనుక అసలు కథ ఇదేనా!

టీమిండియా కెప్టెన్ రోహిత్ శర్మ అకస్మాత్తుగా టెస్టు క్రికెట్‌కు వీడ్కోలు పలకడం క్రికెట్ వర్గాల్లో తీవ్ర చర్చకు దారితీసింది.;

Update: 2025-05-21 02:30 GMT

టీమిండియా కెప్టెన్ రోహిత్ శర్మ అకస్మాత్తుగా టెస్టు క్రికెట్‌కు వీడ్కోలు పలకడం క్రికెట్ వర్గాల్లో తీవ్ర చర్చకు దారితీసింది. ఇంగ్లండ్‌తో జరగనున్న టెస్టు సిరీస్‌లో కెప్టెన్‌గా కొనసాగించి, ఆ సిరీస్ మధ్యలో రిటైర్మెంట్ ప్రకటిస్తానని రోహిత్ శర్మ బీసీసీఐకి సూచించినట్లు విశ్వసనీయ వర్గాల సమాచారం. అయితే, అతని విజ్ఞప్తిని బోర్డు తిరస్కరించి, ఆటగాడిగా మాత్రమే జట్టులో స్థానం కల్పిస్తామని కెప్టెన్‌గా మరొకరిని నియమిస్తామని స్పష్టం చేసినట్లు తెలుస్తోంది.

ఈ పరిణామంతో తీవ్ర మనస్తాపానికి గురైన రోహిత్ శర్మ, వెంటనే టెస్టు క్రికెట్‌కు గుడ్‌బై చెప్పినట్లు క్రీడావర్గాలు పేర్కొంటున్నాయి. రోహిత్ అకస్మిక నిర్ణయం అభిమానులను, విశ్లేషకులను ఆశ్చర్యపరిచింది. అతని ప్రస్తుత ఫామ్, వయసు వంటి అంశాలు రిటైర్మెంట్‌కు కారణమని కొందరు భావించినప్పటికీ, కెప్టెన్సీ విషయంలో బీసీసీఐతో తలెత్తిన విభేదాలే ప్రధాన కారణమని తాజా నివేదికలు స్పష్టం చేస్తున్నాయి.

బీసీసీఐ, సెలెక్టర్లు రోహిత్ శర్మను టెస్టు కెప్టెన్సీ నుంచి తప్పించాలని నిర్ణయించుకున్నారట. అతని కెప్టెన్సీలో భారత్ ఇటీవల న్యూజిలాండ్‌తో స్వదేశంలో జరిగిన సిరీస్‌ను 0-3తో కోల్పోవడం, అలాగే ఆస్ట్రేలియా పర్యటనలో బోర్డర్-గావస్కర్ ట్రోఫీని 1-3తో చేజార్చుకోవడం వంటివి ఈ నిర్ణయానికి దారితీశాయి. కెప్టెన్‌గా రోహిత్ ప్రదర్శనపై విమర్శలు వెల్లువెత్తిన నేపథ్యంలో, భవిష్యత్ ప్రణాళికల్లో భాగంగా కొత్త కెప్టెన్‌ను నియమించాలని బోర్డు భావించింది.

ఇంగ్లాండ్‌తో టెస్టు సిరీస్‌కు ముందు టీమిండియాకు కొత్త టెస్టు కెప్టెన్ వస్తాడని తెలుస్తోంది. ఈ రేసులో శుభ్‌మన్ గిల్ ముందున్నట్లు సమాచారం. టెస్టు క్రికెట్‌లో రోహిత్ శర్మ కెరీర్ అంత గొప్పగా ఏమీ లేదనే వాదనలు కూడా ఉన్నాయి. సొంతగడ్డపై, విదేశాల్లో అతని ప్రదర్శన మిశ్రమంగానే ఉందని విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు. ఇటీవల కాలంలో అతని బ్యాటింగ్ ఫామ్ కూడా అంత బాగాలేదని చెబుతున్నారు.

రోహిత్ శర్మ తన టెస్టు కెరీర్‌లో 67 మ్యాచ్‌లు ఆడి 40.57 సగటుతో 4,301 పరుగులు సాధించాడు. ఇందులో 12 సెంచరీలు ఉన్నాయి. 2019లో దక్షిణాఫ్రికాపై సాధించిన 212 పరుగులు అతని అత్యధిక వ్యక్తిగత స్కోరు. కెప్టెన్‌గా 24 టెస్టులకు నాయకత్వం వహించి, 12 విజయాలు, 9 ఓటములు, 3 డ్రాలు నమోదు చేశాడు.2022లో విరాట్ కోహ్లీ నుంచి టెస్టు కెప్టెన్సీని స్వీకరించిన రోహిత్, కెప్టెన్‌గా జట్టుకు కొన్ని విజయాలు అందించినప్పటికీ, కీలక సిరీస్‌లలో పరాజయాలు ఎదురయ్యాయి. ఈ కారణాలతోనే బీసీసీఐ కెప్టెన్సీ మార్పుపై మొగ్గు చూపినట్లు తెలుస్తోంది.

Tags:    

Similar News