రోహిత్ శర్మ.. కుదిరితే ఆరో ఐపీఎల్ కప్.. లేదంటే ఇదే చివరి మ్యాచ్!

ప్రస్తుతం రోహిత్ ముందు మరో సవాల్ కూడా ఉంది. విల్ జాక్స్, రికెల్టన్ తమ దేశాలకు వెళ్లిపోవడంతో రోహిత్ ఓపెనింగ్ లో భారీ స్కోరు చేయాలి.;

Update: 2025-05-30 12:33 GMT

ఇప్పటికే అంతర్జాతీయ టి20లకు రిటైర్మెంట్ ఇచ్చి ఏడాది అవుతోంది. ఇటీవల టెస్టు క్రికెట్ నుంచి కూడా వైదొలగాడు.. ఇక మిగిలింది వన్డే ఫార్మాట్ మాత్రమే. వన్డేలు ఆరు నెలలకు ఒక్కటి కూడా జరగని పరిస్థితి. అంటే.. టీమ్ ఇండియా దిగ్గజం రోహిత్ శర్మ దాదాపు జట్టుకు దూరమైనట్లే. అతడి బ్యాటింగ్ ను చూసే భాగ్యం కేవలం ఐపీఎల్ లోనే. మరి ఇదే అతడికి చివరి ఐపీఎల్ మ్యాచ్ కానుందా? లేక మరో రెండు మ్యాచ్ లు కూడా ఆడనున్నాడా?

ఫామ్, ఫిట్ నెస్ పరంగా విమర్శలు ఎదుర్కొంటున్న రోహిత్ శర్మ.. ఐపీఎల్ లో ముంబై ఇండియన్స్ తరఫున శుక్రవారం గుజరాత్ టైటాన్స్ తో ఎలిమినేటర్ మ్యాచ్ లో ఆడనున్నాడు. ఈ సీజన్ లో పరుగులు చేయడంలో అతడు ఇబ్బంది పడుతున్నాడు. పలుసార్లు ఇంపాక్ట్ ప్లేయర్ గా దింపారు. ఒకవేళ శుక్రవారం మ్యాచ్ లో గనుక ముంబై ఓడిపోతే ఈ ఐపీఎల్ లో దాని ప్రయాణం ముగిసినట్లే. గెలిస్తే క్వాలిఫయర్ -2లో పంజాబ్ తో తలపడుతుంది. అందుకనే రోహిత్ కు ఇది చివరి మ్యాచ్ కానుందా? అనే ప్రశ్నలు వస్తున్నాయి.

రికార్డు స్థాయిలో ఐదుసార్లు ముంబైకి ఐపీఎల్ టైటిల్ అందించాడు రోహిత్. అయితే, గత ఏడాది అతడిని అనూహ్యంగా పక్కనపెట్టి గుజరాత్ నుంచి ఆల్ రౌండర్ హార్దిక్ పాండ్యాను తీసుకొచ్చి కెప్టెన్ చేశారు. రోహిత్ కేవలం ఆటగాడి పాత్రకు పరిమితం అయ్యాడు. నిరుడు ఫర్వాలేకున్నా.. ఈ సీజన్ లో అతడిది సాదాసీదా ప్రదర్శనే. వచ్చే సీజన్ కు రోహిత్ ను ముంబై ఇండియన్స్ రిటైన్ చేసుకుంటుందా? అంటే చెప్పలేం. ఫామ్ ప్రకారం చూసినా కష్టమే అని అనుకోవచ్చు. ఈ సీజన్ లోనే కాదు కొన్ని సీజన్లుగా ఐపీఎల్ లో రోహిత్ ప్రదర్శన పడిపోతూ వస్తోంది. ఆ లెక్కన అయినా రోహిత్ ను వచ్చే సీజన్ కు ముంబై కొనసాగించకపోవచ్చు.

ప్రస్తుతం రోహిత్ ముందు మరో సవాల్ కూడా ఉంది. విల్ జాక్స్, రికెల్టన్ తమ దేశాలకు వెళ్లిపోవడంతో రోహిత్ ఓపెనింగ్ లో భారీ స్కోరు చేయాలి. తద్వార జట్టుపై ఒత్తిడి పడకుండా ఉంటుంది. గుజరాత్ టైటాన్స్ వంటి మోస్తరు బౌలింగ్ బలం ఉన్న జట్టుపై రాణిస్తే.. అది ముంబై గెలుపునకు బాట వేస్తే రోహిత్ ను వచ్చే సీజన్ కు కొనసాగించవచ్చు.

రోహిత్ ను వచ్చే సీజన్ కోసం మినీ వేలంలో ముంబై రిటైన్ చేసుకోకున్నా.. అతడిని మరో జట్టు ఏదైనా కొనుగోలు చేయొచ్చు. లేదంటే అసలు రోహితే రిటైర్మెంట్ ఇచ్చే అవకాశం కూడా ఉంది. అందుకే శుక్రవారం జరిగే మ్యాచ్ ఐపీఎల్ కెరీర్ లో రోహిత్ కు అత్యంత కీలకం. జట్టు ఓడితే ఇదే అతడికి చివరి మ్యాచ్ అయినా ఆశ్చర్యం లేదు.

Tags:    

Similar News