9వ తరగతి రింకూ ఎడ్యుకేషన్ ఆఫీసరా..? భారత క్రికెటర్ పై ట్రోలింగ్
తండ్రి గ్యాస్ డెలివరీ చేసే వ్యక్తి అయినా.. క్రికెట్ ను నమ్ముకుని పైకి వచ్చాడు డాషింగ్ బ్యాటర్ రింకూ సింగ్.;
తండ్రి గ్యాస్ డెలివరీ చేసే వ్యక్తి అయినా.. క్రికెట్ ను నమ్ముకుని పైకి వచ్చాడు డాషింగ్ బ్యాటర్ రింకూ సింగ్. ఇండియన్ ప్రీమియర్ లీగ్ (ఐపీఎల్)లో కోల్ కతా నైట్ రైడర్స్ కు ఆడుతూ ఒకే ఓవర్ లో ఐదు సిక్స్ లు కొట్టి జట్టును గెలిపించి అటునుంచి అటు టీమ్ ఇండియాలోకీ ఎంట్రీ ఇచ్చాడు. రెండేళ్లుగా జాతీయ టి20 జట్టులో భాగమైన రింకూ ఇప్పుడు వెనక్కు తిరిగి చూసుకోవాల్సిన అవసరం లేనంతగా స్థిరపడ్డాడు. గత నవంబరులో జరిగిన ఐపీఎల్ వేలంలో కోల్ కతా నైట్ రైడర్స్ రింకూను రూ.13 కోట్లకు రిటైన్ చేసుకుంది. అంతకుముందు మూడు సీజన్లలోనూ రింకూ రేటు రూ.55 లక్షలే కావడం గమనార్హం. ఇదే రేటుతో టీమ్ ఇండియాకు ఎంపికై సెంట్రల్ కాంట్రాక్టు కూడా పొందాడు రింకూ.
సొంత ఊరు అలీగఢ్ లో దాదాపు రూ.4 కోట్లు ఖర్చు పెట్టి విల్లా కొన్న ఈ యూపీ క్రికెటర్.. దానికి వీణా ప్యాలెస్ అని తల్లి పేరు పెట్టారు. ఈ విల్లా లోనే ఓ ప్రత్యేక ప్రదేశంలో తాను ఐదు సిక్సులు కొట్టిన బ్యాట్ ను ప్రత్యేకంగా ఫ్రేమ్ కట్టించారు.
రింకూ త్వరలో ఓ ఇంటివాడు కూడా కానున్నాడు. లోక్ సభ ఎంపీ ప్రియా సరోజ్ (సమాజ్ వాదీ పార్టీ)ను త్వరలో వివాహం చేసుకోనున్నారు. ఈ నెల 8న వీరి నిశ్చితార్థం కూడా జరిగింది. నవంబరు 18న వీరి వివాహం నిర్ణయించినా.. ఆ సమయంలో దక్షిణాఫ్రికా టూర్ ఉండడంతో వాయిదా పడుతుందనే కథనాలు వచ్చాయి.
తాజాగా రింకూకు సంబంధించిన ఓ వార్త సోషల్ మీడియాలో హల్ చల్ చేస్తోంది. స్కూల్ డ్రాపౌట్ అయిన రింకూ సింగ్ ను అతడి సొంత రాష్ట్రం యూపీ ప్రభుత్వం ’బేసిక్ ఎడ్యుకేషన్ ఆఫీసర్‘గా నియమించడంపై ట్రోలింగ్ నడుస్తోంది. రింకూ 9వ తరగతి మధ్యలో ఆపేశాడు. తండ్రి పనిలో చేదోడుగా ఉండేవాడు. ఓ దశలో స్వీపర్ గా పనిచేసేందుకూ వెనుకాడలేదు. అయితే, క్రికెట్ పై ఇష్టంతో పైకి వచ్చాడు. యూపీ ప్రభుత్వం అంతర్జాతీయ స్థాయిలో ప్రతిభ చాటిన రాష్ట్ర క్రీడాకారులను నేరుగా ఉద్యోగాల్లో నియమించి గౌరవిస్తుంది. అలా రింకూను జిల్లా బేసిక్ ఎడ్యుకేషన్ ఆఫీసర్ గా నియమించింది. దీనిని నెటిజన్లు తప్పుబడుతున్నారు. తక్కువ చదువుకున్న వారు పెద్ద ఉద్యోగాలకు అర్హులని కొందరు ఎద్దేవా చేస్తున్నారు. 9వ తరగతి చదివిన వ్యక్తిని ఎడ్యుకేషన్ ఆఫీసర్ గా నియమించడం ఏమిటని నొసలు చిట్లిస్తున్నారు.
కొసమెరుపు: యూపీలో ఉన్నది బీజేపీ ప్రభుత్వం. రింకూ పెళ్లాడబోయేది ప్రధాన ప్రతిపక్షం సమాజ్ వాదీ ఎంపీని. అయినా, యూపీ ప్రభుత్వం రింకూకు ఉద్యోగం ఇవ్వడం గమనార్హం.