ఐపీఎల్.. 17 ఏళ్లలో కప్ కొట్టకున్నా..2 కోట్ల ఫాలోవర్లు..అదెలా సాధ్యం?
ఈ సీజన్ లో మాత్రం బెంగళూరు కప్ కొట్టే ఊపులో కనిపిస్తోంది. 13 మ్యాచ్ లలో 17 పాయింట్లతో మూడో స్థానంలో ఉంది. పంజాబ్ తో సమానంగా పాయింట్లు ఉన్నా రన్ రేట్ లో వెనుకబడి మూడో స్థానంలో ఉంది.;
ఇండియన్ ప్రీమియర్ లీగ్ (ఐపీఎల్)లో ఇప్పటివరకు టైటిల్ సాధించని జట్లు ఢిల్లీ క్యాపిటల్స్, పంజాబ్ కింగ్స్, లక్నో సూపర్ జెయింట్స్. వీటిలో లక్నో నాలుగు సీజన్లుగా మాత్రమే ఆడుతోంది. ఢిల్లీ, పంజాబ్ 2008 నుంచి ఉన్నప్పటికీ.. సాధారణ జట్లుగానే ముద్ర పడ్డాయి. వీటికి లీగ్ లో ఫాలోయింగ్ కూడా ఉండదు. అయితే, ఈ రెండు జట్లలాగానే మొదటినుంచి లీగ్ లో ఉంటూ.. భారీ ఫాలోయింగ్ ఉండి.. ఒక్కసారీ కప్ కొట్టని జట్టు రాయల్ చాలెంజర్స్ బెంగళూరు. అభిమానులు ముద్దుగా ఆర్సీబీ అని పిలుచుకునే బెంగళూరుకు మొదటి నుంచి స్టార్ డమ్ ఉంది.. దిగ్గజాల్లాంటి ఆటగాళ్లూ ప్రాతినిధ్యం వహించారు.. కానీ, ఆ ఒక్కటే లోటు అన్నట్లు టైటిల్ విజేతగా మాత్రం నిలవలేదు.
ఆర్సీబీకి మరో పెద్ద అసెట్ టీమ్ ఇండియా దిగ్గజం విరాట్ కోహ్లి. 2008లో తనను ఎంచుకున్న ఆర్సీబీ పట్ల కోహ్లి ఇప్పటికీ అదే విశ్వాసం చూపుతున్నాడు. ఈ సీజన్ లో మాత్రం బెంగళూరు కప్ కొట్టే ఊపులో కనిపిస్తోంది. 13 మ్యాచ్ లలో 17 పాయింట్లతో మూడో స్థానంలో ఉంది. పంజాబ్ తో సమానంగా పాయింట్లు ఉన్నా రన్ రేట్ లో వెనుకబడి మూడో స్థానంలో ఉంది. లక్నోతో మంగళవారం జరిగే మ్యాచ్ లో గెలిస్తే టాప్ లోకి వెళ్లే చాన్స్ కూడా ఉంది.
ఇక తాజాగా రాయల్ చాలెంజర్స్ బెంగూరు ఈ సీజన్ లో ఓ రికార్డును మూటగట్టుకుంది. సోషల్ మీడియా ప్లాట్ ఫామ్ ఇన్ స్టాగ్రామ్ లో 20 మిలియన్లు (2కోట్ల మంది) ఫాలోవర్లు అందుకున్న తొలి ఐపీఎల్ జట్టుగా నిలిచింది. కోహ్లి క్రేజ్ కు బెంగళూరు ఫాలోయింగ్ తోడవడంతో ఈ సంఖ్యను చేరింది. ఐదుసార్లు టైటిల్ విజేతలు ముంబై ఇండియన్స్, చెన్నై సూపర్ కింగ్స్, మూడుసార్లు గెలిచిన కోల్ కతా నైట్ రైడర్స్ కు కూడా సాధ్యం కాని ఘనతను ఆర్సీబీ అందుకుంది. ఇప్పటివరకు చెన్నైకి 17.7 మిలియన్ల ఫాలోవర్లు ఉన్నారు. దీనిని ఈ సీజన్ లోనే బెంగళూరు క్రాస్ చేసింది.
కోహ్లి టెస్టులకు రిటైర్ అయిన ఈ నెలలోనే బెంగళూరుకు 20 కోట్ల ఫాలోవర్స్ ను సొంతం చేసుకోవడం ఇక్కడ గమనించాల్సిన విషయం. కోహ్లికి ఇన్ స్టాలో 273 మిలియన్ల ఫాలోవర్లు ఉన్నారు. తాజా సమాచారంతో వీరిలో దాదాపు 10 శాతం బెంగళూరుకు ఫాలోవర్లుగా ఉన్నట్లయింది. ఒకవేళ ఆర్సీబీ గనుక ఈ సీజన్ లో కప్ కొట్టేస్తే 18 ఏళ్ల ఆ జట్టు కల తీరుతుంది. అదేగనుక జరిగితే ఆర్సీబీ ఫాలోవర్లు మరింత పెరుగుతారు అనడంలో సందేహం లేదు.