ఐపీఎల్ తొలి విజేతకు కొత్త కెప్టెన్..కెరీర్ ఇచ్చిన జట్టుకే సారథి
అంతేకాదు.. ఐపీఎల్ కు ఇదే మొదటి సీజన్ కావడం.. అందులో ఆ జట్టు విజేతగా నిలవడం మరింత విశేషం. మార్చి 8తో ముగియనున్న టి20 ప్రపంచకప్ అనంతరం మూడు వారాల్లో ఐపీఎల్ 19వ సీజన్ మొదలుకానుంది.;
ఇప్పటికే మినీ వేలం పూర్తయి.. ఏ ఆటగాడు ఎవరికి ఆడతాడో తేలిపోయిన నేపథ్యంలో.. ఈ ఏడాది మార్చి 26 నుంచి మొదలుకానున్న ఇండియన్ ప్రీమియర్ లీగ్ (ఐపీఎల్) 19వ ఎడిషన్ కు అన్ని ఫ్రాంచైజీలు ఏర్పాట్లు చేసుకుంటున్నాయి. ఈ ఏడాది సీజన్ లో 10 జట్లకు గాను 9 జట్లకు పాత కెప్టెన్లే కొనసాగనున్నారు. ఒక్క జట్టుకు మాత్రం కొత్త సారథి వచ్చాడు. ఆటగాళ్ల మార్పిడిలో భాగంగా తమ కెప్టెన్ వేరే జట్టుకు ఇచ్చి.. తెచ్చుకున్న ప్లేయర్ నే ఈ ఫ్రాంచైజీ కెప్టెన్ చేసింది. ఇంతకూ ఈ కొత్త సారథి 19 ఏళ్ల కుర్రాడిగా ఐపీఎల్ కెరీర్ మొదలుపెట్టింది ఈ జట్టు నుంచే కావడం విశేషం. అంతేకాదు.. ఐపీఎల్ కు ఇదే మొదటి సీజన్ కావడం.. అందులో ఆ జట్టు విజేతగా నిలవడం మరింత విశేషం. మార్చి 8తో ముగియనున్న టి20 ప్రపంచకప్ అనంతరం మూడు వారాల్లో ఐపీఎల్ 19వ సీజన్ మొదలుకానుంది.
అక్కడే ఓనమాలు దిద్ది..
టీమ్ ఇండియా సీనియర్ ఆల్ రౌండర్ రవీంద్ర జడేజాను ఐపీఎల్ జట్టు రాజస్థాన్ రాయల్స్ (ఆర్ఆర్) వచ్చే సీజన్ కు తమ కెప్టెన్ గా ప్రకటించింది. కొన్నేళ్లుగా ఆర్ఆర్ ను నడిపించిన వికెట్ కీపర్ బ్యాట్స్ మన్ సంజూ శాంసన్ ను ఈ ఏడాది మినీ వేలానికి ముందు మాజీ చాంపియన్ చెన్నై సూపర్ కింగ్స్ (సీఎస్కే)కు ఇచ్చిన రాజస్థాన్.. అక్కడినుంచి రవీంద్ర జడేజాను తెచ్చుకుంది. టీమ్ ఇండియా యువ ఓపెనర్ యశస్వి జైశ్వాల్, స్పిన్ ఆల్ రౌండర్ రియాన్ పరాగ్, వికెట్ కీపర్ బ్యాటర్ ధ్రువ్ జురెల్ కొన్నాళ్లుగా రాజస్థాన్ కు ఆడుతున్నారు. కానీ, వీరి కంటే అనుభవం ఉన్న జడేజాను కెప్టెన్ చేసింది రాజస్థాన్. కాగా, జడేజా 2008 సీజన్ లో ఐపీఎల్ లో ఆర్ఆర్ ద్వారానే అడుగుపెట్టాడు. ఈ తొలి సీజన్ లో ఆస్ట్రేలియా దిగ్గజ స్పిన్నర్ షేన్ వార్న్ సారథ్యంలోరాజస్థాన్ విజేతగా నిలవడం గమనార్హం. నాడు 14 మ్యాచ్ లలో జడేజాకు అవకాశం దక్కింది. అప్పటికి 18 ఏళ్లున్న అతడు టీమ్ ఇండియాకు ఎంపిక కాలేదు. ఆ తర్వాత సీజన్ (2009)లోనూ రాజస్థాన్ కు ఆడిన జడేజా.. కొచ్చి టస్కర్స్ కు మారాడు. సీఎస్కేతో పాటు 2016,17లలో గుజరాత్ లయన్స్ కు ప్రాతినిధ్యం వహించాడు.
సాధారణ ఆటగాడిగా వెళ్లి.. కెప్టెన్ గా రాక
2009లో ఐపీఎల్ సీజన్ కు కొద్దిగా ముందు టీమ్ ఇండియాలోకి వచ్చాడు జడేజా. తర్వాతి కాలంలో ఫామ్ లో లేక చోటు కోల్పోయినా.. 2013 నుంచి రెగ్యులర్ సభ్యుడు అయ్యాడు. 2024లో టి20 ప్రపంచ కప్ గెలిచాక అంతర్జాతీయ టి20లకు వీడ్కోలు పలికాడు. ఇక 2009లో సాధారణ ఆటగాడిగా రాజస్థాన్ రాయల్స్ ను వీడిన అతడు ఇప్పుడు కెప్టెన్ గా తిరిగి రానుండడం విశేషంగానే చెప్పాలి. ఐపీఎల్ లో 254 మ్యాచ్ ల విశేష అనుభవం ఉన్న ఈ సర్.. మళ్లీ తమ జట్టును విజేతగా నిలుపుతాడా లేదో చూడాలి.
ఒత్తిడి తట్టుకోగలడా?
2022లోనే సీఎస్కే వంటి పెద్ద జట్టుకు కెప్టెన్ అయ్యాడు జడేజా. కానీ, 8 మ్యాచ్ లలో 6 ఓడిపోవడంతో తీవ్ర ఒత్తిడికి గురయ్యాడు. ఆటగాడిగానూ అతడి ప్రదర్శన దెబ్బతిన్నది. దీంతో కెప్టెన్సీ మధ్యలో వదిలేసి.. తన మార్గదర్శి ధోనీ తిరిగి పగ్గాలు అందుకునే పరిస్థితి కల్పించాడు. సీఎస్కే కంటే ప్రస్తుతం ఆర్ఆర్ పటిష్టంగానే ఉంది. మరి జడేజా ఒత్తిడిని ఎలా తట్టుకుంటాడో చూడాలి.