నో ద్రవిడ్‌, రోహిత్‌.. భారత టాప్‌-5 క్రికెటర్లు..చెప్పింది ఎవరంటే?

ఈ ఐదుగురిని టాప్‌-5 క్రికెటర్లుగా ఎంపిక చేసింది టీమ్‌ ఇండియా మాజీ ఆల్‌ రౌండర్‌, మాజీ హెడ్‌ కోచ్‌ రవిశాస్త్రి.;

Update: 2025-07-23 02:30 GMT

ఒకరేమో టెస్టులు, వన్డేల్లో పదివేల పరుగులు సాధించిన గొప్ప బ్యాట్స్‌మన్‌.. మరొకరు టి20 ప్రపంచ కప్‌, చాంపియన్స్‌ ట్రోఫీ (వన్డే ఫార్మాట్‌) అందించి.. వన్డే ప్రపంచ కప్‌ ఫైనల్స్‌కు చేర్చిన గొప్ప కెప్టెన్‌.. మరొకరు అసలు భారత క్రికెట్‌ రాతనే మార్చిన స్ఫూర్తివంతమైన సారథి.. ఇక చివరగా టెస్టుల్లో 600 పైగా వికెట్లు తీసిన మేటి లెగ్‌ స్పిన్నర్‌.. కానీ, వీరెవరూ భారత టాప్‌ క్రికెటర్లు కారంటున్నాడు మరో గొప్ప క్రికెటర్‌.

మరి ఆయన చెప్పిన లిస్టు ప్రకారం చూస్తే.. భారత టాప్‌-5 క్రికెటర్లు మాజీ కెప్టెన్లు సునీల్‌ గావస్కర్‌, కపిల్‌దేవ్‌, సచిన్‌ టెండూల్కర్‌, విరాట్‌ కోహ్లి, మహేంద్ర సింగ్‌ ధోనీ. వన్డేల్లో మూడు డబుల్‌ సెంచరీలు చేసిన రోహిత్‌ శర్మ, వన్డేలు, టెస్టుల్లో 10 వేల పరుగులు సాధించిన ద్రవిడ్‌, వన్డే చరిత్రలో గొప్ప బ్యాట్స్‌మన్‌ అయిన సౌరభ్‌ గంగూలీ, అత్యధిక టెస్టు వికెట్లు తీసిన అనిల్‌ కుంబ్లేలను మాత్రం ఎంపిక చేయలేదు.

ఈ ఐదుగురిని టాప్‌-5 క్రికెటర్లుగా ఎంపిక చేసింది టీమ్‌ ఇండియా మాజీ ఆల్‌ రౌండర్‌, మాజీ హెడ్‌ కోచ్‌ రవిశాస్త్రి. కామెంటేటర్‌గా, క్రికెట్‌ పండితుడిగా మంచి పేరున్న రవిశాస్త్రి తనదైన విశ్లేషణతో ఈ ఐదుగురిని భారత టాప్‌ క్రికెటర్లుగా పేర్కొఒన్నాడు. అయితే, మాజీ కెప్టెన్లు సౌరభ్‌ గంగూలీ, రాహుల్‌ ద్రవిడ్‌, అనిల్‌ కుంబ్లేలతో పాటు ఇప్పటికీ వన్డే కెప్టెన్‌గా ఉన్న రోహిత్‌శర్మలలో ఒక్కరినీ టాప్‌-5లో చేర్చలేదు. అయితే, రవిశాస్త్రి ఎంపిక చేసిన టాప్‌-5ను తప్పుబట్టలేం కానీ.. ఈ ఐదుగురిలో ఒక్కరూ లేకపోవడమే విచిత్రం అనిపించింది. ఇంగ్లండ్‌ మాజీ కెప్టెన్లు మైకేల్‌, అలిస్టర్‌ కుక్‌లతో ఓ పాడ్‌కాస్ట్‌లో పాల్గొన్న రవిశాస్త్రిని వారు భారత టాప్‌ 5 క్రికెటర్ల గురించి ప్రశ్నించగా ఈ మేరకు సమాధానం ఇచ్చాడు.

అయితే, తాను ఎంపిక చేసిన ఐదుగురిలోనూ సునీల్‌ గావస్కర్‌ ను నంబర్‌వన్‌గా రవి అభివర్ణించాడు. కపిల్‌ను అద్భుతమైన క్రికెటర్‌గా కొనియాడాడు. అన్ని కోణాల్లో చూస్తే సచిన్‌ను నంబర్‌ వన్‌ అని ట్యాగ్‌ ఇచ్చాడు. అన్ని తరాల గ్రేట్‌ బౌలింగ్‌లో 24 ఏళ్లు ఆడడమే కాక వంద సెంచరీలు చేశాడని పేర్కొన్నాడు. కాగా, ధోనీ, కోహ్లిలు ఏడాదికి 15-20 అడ్వర్టయిజ్‌మెంట్లు చేస్తూ ఏడాదికి రూ.100 కోట్ల వరకు సంపాదిస్తున్నారని రవిశాస్త్రి అంచనా వేశాడు. ఈ టీమ్‌ ఇండియా మాజీ ఆల్‌ రౌండర్‌ ఎంపిక చేసిన టాప్‌-5 క్రికెటర్లలో కపిల్‌దేవ్‌, మహేంద్ర సింగ్‌ ధోనీలు భారత్‌ కు వన్డే ప్రపంచ కప్‌ అందించారు. గావస్కర్‌, కపిల్‌తో కలిసి ఆడిన రవిశాస్త్రి.. ధోనీ, కోహ్లి కెప్టెన్సీ సమయంలో హెడ్‌ కోచ్‌గా ఉన్నాడు.

Tags:    

Similar News