సింగ్ ఈజ్ కింగ్.. ఐపీఎల్ లోయెస్ట్ స్కోరు డిఫెండ్.. నాటి హైదరాబాద్ లా
ఇండియన్ ప్రీమియర్ లీగ్ (ఐపీఎల్)లో కొన్ని జట్ల మ్యాచ్ లకు వ్యూయర్ షిప్ తక్కువ. అలాంటివాటిలో ఢిల్లీ క్యాపిటల్స్, పంజాబ్ కింగ్స్ ఉంటాయి.;
ఇండియన్ ప్రీమియర్ లీగ్ (ఐపీఎల్)లో కొన్ని జట్ల మ్యాచ్ లకు వ్యూయర్ షిప్ తక్కువ. అలాంటివాటిలో ఢిల్లీ క్యాపిటల్స్, పంజాబ్ కింగ్స్ ఉంటాయి. 17 సీజన్లలో ఒక్కసారీ టైటిల్ కొట్టలేకపోవడమే కాదు.. ఈ జట్లు ఆడే తీరు కూడా దీనికి కారణం. అయితే, కోల్ కతా నైట్ రైడర్స్ తో మంగళవారం జరిగిన మ్యాచ్ లో పంజాబ్ అద్భుతమే చేసింది.
ఆడుతున్నది సొంత మైదానం (ముల్లాన్ పూర్)లో.. పైగా ఈసారి జట్టు మంచి సమతూకంగా ఉంది. కెప్టెన్ భీకర ఫామ్ లో ఉన్నాడు. పైగా టాస్ గెలిచి బ్యాటింగ్ కు దిగింది పంజాబ్. కానీ, ఆట చూస్తే అత్యంత పేలవం. పాత తరహా పంజాబ్ ను తలపిస్తూ ఈసారి ఆ జట్టు కేవలం 111 పరుగులకే ఆలౌటైంది. ఇంకా 4.3 ఓవర్లు మిగిలి కూడా ఉన్నాయి. ఓపెనర్లు ప్రియాంశ్ ఆర్య (22), ప్రభ్ సిమ్రన్ సింగ్ (30) మాత్రమే మెరుగైన స్కోర్లు చేశారు. శశాంక్ సింగ్ (18) కాస్త ఫర్వాలేదనిపించాడు. దీంతో కోల్ కతా గెలుపు ఖాయం అనిపించింది.
ఛేజింగ్ లో డిఫెండింగ్ చాంపియన్ కోల్ కతా కూడా తుస్సుమనిపించింది. యువ రఘవంశీ (37) చక్కడా ఆడాడు. కానీ, కెప్టెన్ అజింక్య రహానే, ఆల్ రౌండర్ ఆండ్రీ రస్సెల్ చెరో 17 పరుగులు మాత్రమే చేశారు. పంజాబ్ బౌలర్లు యాన్సెన్ (3/17), యుజ్వేంద్ర చాహల్ (4/28) దెబ్బకు కోల్ కతా కేవలం 95 పరుగులకే చాప చుట్టేసింది. దీంతో పంజాబ్ 16 పరుగులతో గెలిచింది.
అప్పటి సన్ రైజర్స్ హైదరాబాద్ లా
ఈ మ్యాచ్ లో పంజాబ్ ఆటతీరు ఒకప్పటి సన్ రైజర్స్ హైదరాబాద్ ను తలపించింది. 130-140 పరుగులు మాత్రమే చేసినా బౌలర్ల ప్రతిభతో మ్యాచ్ లను గెలిచేది హైదరాబాద్. ఇపుడు పంజాబ్ కూడా అలానే చేసింది. అయితే, హైదరాబాద్ కంటే ఘనంగా ఐపీఎల్ లో అతి తక్కువ స్కోరును డిఫెండ్ చేసుకున్న జట్టుగా రికార్డులకెక్కింది.
పంజాబ్ 15.3 ఓవర్లలో ఆలౌటైతే కోల్ కతా 15.1 ఓవర్లకే ఇంటి బాట పట్టింది. 28 పరుగులిచ్చి 4 వికెట్లు పడగొట్టిన చహల్ కు మ్యాన్ ఆఫ్ ద మ్యాచ్ దక్కింది.