2 ప్రపంచకప్‌లు, 2 ఐపీఎల్‌ నెగ్గిన టీమ్‌ఇండియా లక్కీ హ్యాండ్‌ రిటైర్‌

‘‘అతడు భారత క్రికెట్‌ లో లక్కీ హ్యాండ్‌.. ఫైనల్స్‌లో తప్పకుండా ఆడించండి..’’ క్రికెట్‌ను తప్ప నమ్మకాలను నమ్మని దిగ్గజ బ్యాటర్‌ సునీల్‌ గావస్కర్‌ ఓ క్రికెటర్‌ గురించి చేసిన కామెంట్‌ ఇది;

Update: 2025-06-06 15:06 GMT

‘‘అతడు భారత క్రికెట్‌ లో లక్కీ హ్యాండ్‌.. ఫైనల్స్‌లో తప్పకుండా ఆడించండి..’’ క్రికెట్‌ను తప్ప నమ్మకాలను నమ్మని దిగ్గజ బ్యాటర్‌ సునీల్‌ గావస్కర్‌ ఓ క్రికెటర్‌ గురించి చేసిన కామెంట్‌ ఇది. అతడు జట్టులో ఉంటే చాలు కప్‌ గెలుస్తామనే నమ్మకం దీనికి కారణం. అలానే.. 2011లో టీమ్‌ ఇండియా 27 ఏళ్ల అనంతరం వన్డే ప్రపంచ కప్‌ నెగ్గింది. చిత్రం ఏమంటే దీని తర్వాత మళ్లీ మన జట్టు వన్డే ప్రపంచకప్‌ గెలవలేదు. 2023లో ఫైనల్‌ చేరినా ఓడిపోయింది. అందుకే ఆ ఆటగాడిని లక్కీ హ్యాండ్‌ అన్నారేమో? ఒక్క ప్రపంచ కప్‌ గెలిచిన జట్టులో ఉంటేనే చాలు.. కానీ, అతడు రెండు ప్రపంచ కప్‌లు నె‍గ్గిన జట్టులో ఉన్నాడు. అతడే ఉత్తర్‌ ప్రదేశ్‌కు చెందిన లెగ్‌ స్పిన్నర్‌ పీయూష్‌ చావ్లా. 36 ఏళ్ల చావ్లా తాజాగా రిటైర్మెంట్‌ ప్రకటించాడు.

సరిగ్గా దిగ్గజ లెగ్‌ స్పిన్నర్‌ అనిల్‌ కుంబ్లే రిటైర్‌ అవుతున్న టైమ్‌లో వెలుగులోకి వచ్చాడు పీయూష్‌. 17 ఏళ్ల వయుసులోనే క్రికెట్‌ దేవుడు సచిన్‌ టెండూల్కర్‌ను తన గూగ్లీలతో బౌల్డ్‌చేసిన చావ్లా.. భవిష్యత్‌ స్టార్‌ స్పిన్నర్‌గా కనిపించాడు. దీనికితగ్గట్టే 2006లోనే టీమ్‌ ఇండియాకు ఎంపికయ్యాడు. కానీ, అంచనాలను అందుకోలేకపోయాడు. దేశవాళీ క్రికెట్లో చేసిన అద్భుతాలను అంతర్జాతీయంగా చేయలేకపోయాడు. దీంతో 3 టెస్టులు, 25 వన్డేలు, 7 టి20లకే అతడి అంతర్జాతీయ కెరీర్‌ పరిమితమైంది. 2006లో టెస్టుల్లోకి వచ్చిన అతడు 2012లో చివరి మ్యాచ్‌ ఆడాడు. 2007లో తొలి వన్డే, 2011లో చివరి మ్యాచ్‌ ఆడాడు. 2007 టి20 ప్రపంచ కప్‌ సభ్యుడైనా 2010లో తొలి మ్యాచ్‌ ఆడే అవకాశం వచ్చింది. అయితే, 2007 టి20, 2011 వన్డే ప్రపంచ కప్‌ లు నెగ్గిన జట్టులో మాత్రం ఉన్నాడు.

కాగా, అంతర్జాతీయ క్రికెట్‌లో వెనుకబడిన చావ్లాకు తర్వాత అవకాశాలు పెద్దగా రాలేదు.తన స్పిన్‌ బౌలింగ్‌ స్టయిల్‌ బాగుంటుంది.. కానీ, దానిని బ్యాటర్లు సులువుగా ఆడేశారు. దీంతో క్రమంగా వెనుకబడ్డాడ. అయితే, దేశవాళీలు, ఫ్రాంఛైజీ క్రికెట్‌లో తనదైన ముద్ర వేశాడు. 446 ఫస్ట్‌క్లాస్‌, 319 టీ20 వికెట్లు తీశాడు. సొంత రాష్ట్రం యూపీకి రంజీల్లో ఆడాడు. ఐపీఎల్‌లో తొలి సీజన్‌ నుంచి ఉన్నాడు. 2013 వరకు పంజాబ్‌ కింగ్స్‌కు ఆడాడు. 2019 వరకు కోల్‌కతా నైట్‌ రైడర్స్‌కు ఆడాడు. 2020లో చెన్నై, 2021 నుంచి ముంబైకి ఆడాడు. 2012, 2014లో ఐపీఎల్‌ టైటిల్‌ గెలిచిన కోల్‌కతా నైట్‌ రైడర్స్‌ జట్టులో పీయూష్‌ చావ్లా సభ్యుడు. అంతేకాదు.. ఐదుసార్లు టైటిల్‌ గెలిచిన ముంబై, చెన్నైలతో పాటు మూడుసార్లు టైటిల్‌ నెగ్గిన కోల్‌కతాకు ఆడాడు. అందుకే అతడు లక్కీ హ్యాండ్‌.

Tags:    

Similar News