ఎంట్రీ ఆలస్యం..లేదంటే సచిన్ కంటే నేనే గొప్ప..మిస్టర్ క్రికెట్ మాట
ఆస్ట్రేలియా జట్టులో చోటుదక్కడం అంటే మామూలు మాటలు కాదు. పైగా హస్సీకి ముందు ఆ జట్టులో మైకేల్ బెవాన్ రూపంలో ప్రపంచ క్రికెట్ లోనే గొప్ప ఫినిషర్ ఉండేవాడు.;
క్రికెట్ దేవుడు అంటే సచిన్ టెండూల్కర్.. గ్రేట్ వాల్ అంటే రాహుల్ ద్రవిడ్... కింగ్ అంటే విరాట్ కోహ్లి..! మరి మిస్టర్ క్రికెట్ అంటే ఎవరు..?? దాదాపు 30 ఏళ్ల వయసులో అంతర్జాతీయ క్రికెట్ లోకి వచ్చినా, తనదైన స్థాయిలో ముద్ర వేసిన ఆ బ్యాట్స్ మన్ ఎవరు.?? కేవలం బ్యాటర్ గానే కాక మంచి ఫినిషర్ గానూ పేరు తెచ్చుకున్న ఆ క్రికెటర్ ది ఏ దేశం...? ఈ ప్రశ్నలకు సమాధానం తెలుసుకోవాలని ఉందా..?
30 వ ఏట అరంగేట్రం..
మైకేల్ హస్సీ.. ఆస్ట్రేలియా మాజీ క్రికెటర్. 1975లో పుట్టిన హస్సీ 2004లో వన్డేలు, టి20లు, 2005లో టెస్టు జట్టులోకి వచ్చాడు. అంటే దాదాపు 30వ ఏట దేశానికి తొలిసారి ఆడాడు. ఎడమచేతివాటం బ్యాటర్ అయిన హస్సీ.. 2012 వరకు దేశానికి ప్రాతినిధ్యం వహించాడు. కేవలం ఏడెనిమిదేళ్లే అయినా ప్రపంచ క్రికెట్ పై తనదైన ముద్ర వేశాడు.
నిలకడైన బ్యాటర్..
ఆస్ట్రేలియా జట్టులో చోటుదక్కడం అంటే మామూలు మాటలు కాదు. పైగా హస్సీకి ముందు ఆ జట్టులో మైకేల్ బెవాన్ రూపంలో ప్రపంచ క్రికెట్ లోనే గొప్ప ఫినిషర్ ఉండేవాడు. ఇద్దరూ ఎడమచేతివాటం బ్యాటర్లే. దీంతో హస్సీకి అంత తొందరగా పిలుపు రాలేదు. బెవాన్ రిటైర్మెంట్ తర్వాత చోటు ఖాయం చేసుకున్న హస్సీ వెనుదిరిగి చూడలేదు. 79 టెస్టుల్లో 6,235 (51.52 సగటు), 185 వన్డేల్లో 5,442 (48.15 సగటు), 38 టి20ల్లో 721 (37.94 సగటు) పరుగులు చేశాడు. ఫస్ట్ క్లాస్ క్రికెట్ లో 61 సెంచరీలు కొట్టాడు. 23వేల పైగా పరుగులు సాధించాడు. ఐపీఎల్ లో చెన్నై సూపర్ కింగ్స్ తరఫున ఆడి 59 మ్యాచ్ లలో 1,977 పరుగులు చేశాడు. రిటైర్ అయ్యాక కామెంటేటర్ గా స్థిరపడ్డాడు.
సచిన్ ను దాటేవాడినే..
తాను గనుక ఇంకా చిన్న వయసులోనే అంతర్జాతీయ క్రికెట్లోకి వచ్చి ఉంటే.. సచిన్ టెండూల్కర్ ను మించి 5 వేల పరుగులు చేసేవాడినని తాజాగా హస్సీ అన్నాడు. అత్యధిక సెంచరీలు, యాషెస్ సిరీస్ విజయాలు, ఎక్కువ ప్రపంచ కప్ లు తన ఖాతాలో ఉండేవని చెప్పుకొచ్చాడు. అయితే, ఇదంతా తన కల అని పొద్దున్నే లేవగానే అంతా మాయం అయ్యేదని ఫినిషింగ్ టచ్ ఇచ్చాడు. మొత్తానికి ఏమైనా సరే.. ఇంకా ముందుగానే ఆస్ట్రేలియాకు ఆడాల్సి ఉండాల్సిందని పేర్కొన్నాడు.
కాగా, సచిన్ 16వ ఏట దేశానికి ఆడాడు. 200 టెస్టుల్లో 15,921 పరుగులు సాధించాడు. 463 వన్డేల్లో 18,426 పరుగులు చేశాడు. ఒక్క టి20నే ఆడి 10 పరుగులు కొట్టాడు. 24 ఏళ్ల కెరీర్ లో వంద సెంచరీలు బాదాడు. అయితే, హస్సీ ఇంకా ముందుగానే వచ్చి ఉంటే ఇంకా ఎక్కువ పరుగులు చేసేవాడు కానీ.. సచిన్ అన్ని మాత్రం కాదు.