భారత్ కు ఫుట్ బాల్ ప్రపంచ చాంపియన్.. ప్రఖ్యాత స్టేడియం బ్లాక్
అలాంటిది ఏకంగా ఫుట్ బాల్ చరిత్రలో దిగ్గజంగా పేరుండి, కెప్టెన్ గా ప్రపంచ కప్ కూడా అందించిన ఆటగాడు నేరుగా మన దేశానికి వస్తుండడం విశేషమే.;
ప్రపంచ ప్రఖ్యాత ఫుట్ బాల్ ప్లేయర్, ప్రపంచ చాంపియన్ భారత్ కు వస్తున్నాడు... సాధారణంగా అంతర్జాతీయ స్థాయిలో కనీసం పేరున్న ప్లేయర్లు కూడా మన దేశంలో పర్యటించరు.. కారణం.. భారత్ లో ఫుట్ బాల్ కల్చర్ కానీ, ఫుట్ బాల్ కు ఆదరణ కానీ పెద్దగా లేకపోవడమే..! అలాంటిది ఏకంగా ఫుట్ బాల్ చరిత్రలో దిగ్గజంగా పేరుండి, కెప్టెన్ గా ప్రపంచ కప్ కూడా అందించిన ఆటగాడు నేరుగా మన దేశానికి వస్తుండడం విశేషమే. అంతేకాదు, అతడు భారత క్రికెటర్లతో కలిసి మ్యాచ్ ఆడతాడని చెబుతున్నారు.
మూడేళ్ల కిందట ఖతర్ లో జరిగిన ఫుట్ బాల్ ప్రపంచ కప్ లో తమ దేశం అర్జెంటీనాను చాంపియన్ గా నిలిపాడు లియోనల్ మెస్సీ. దీంతో ప్రపంచ ఫుట్ బాల్ దిగ్గజంగా మారాడు. అలాంటి మెస్సీ.. వచ్చే ఏడాది జరిగే ప్రపంచ కప్ ఆడతాడని కూడా భావిస్తున్నారు. కాగా దీనికిముందు మెస్సీ భారత్ టూర్ చేయనున్నాడు. మెస్సీ షెడ్యూల్ కూడా ఖరారైందని చెబుతున్నారు.
మెస్సీ.. భారత మాజీ, ప్రస్తుత స్టార్ క్రికెటర్లతో కలిసి మ్యాచ్ ఆడతాడని, అందుకోసం ముంబైలోని ప్రఖ్యాత వాంఖడే స్టేడియాన్ని బ్లాక్ చేయనున్నారని తెలుస్తోంది. డిసెంబరు 13 నుంచి మూడు రోజులు మెస్సీ భారత్ లో పర్యటిస్తాడు. ముంబైతో పాటు ఫుట్ బాల్ కు బాగా ఆదరణ ఉండే కోల్ కతాలో అభిమానులను కలుస్తాడు. మెస్సీది ప్రమోషనల్ టూర్. కాబట్టి మెస్సీ రాక ఖాయమే అనుకోవాలి. మెస్సీ 2011లోనూ భారత్ కు వచ్చాడు. అప్పుడు కోల్ కతాలోనే టూర్ చేశాడు. ఈసారి కూడా ముందుగా కోల్ కతాకే వెళ్లి.. తర్వాత రోజు ముంబైకి చేరుకుంటాడు.
ఇక మెస్సీ.. క్రికెట్ ఆడబోయేది ఎవరితోనో తెలుసా? సచిన్, ధోనీ, కోహ్లి వంటి దిగ్గజాలతో. వీరి మ్యాచ్ నిర్వహణఖు ఆర్గనైజర్లు ప్రణాళిక సిద్ధం చేశాడు.
కోల్ కతాలోని చిన్నారుల కోసం ఫుట్ బాల్ వర్క్ షాప్ ను మెస్సీ ఏర్పాటు చేయనున్నాడు. ఈడెన్ గార్డెన్స్ లో మెస్సీ గౌరవార్థం గోట్ (గ్రేటెస్ట్ ఆఫ్ ఆల్ టైమ్) మ్యాచ్ నిర్వహిస్తారు. వాస్తవానికి అర్జెంటీనా ఫుట్‌బాల్ జట్టు ఈ ఏడాది అక్టోబరు, నవంబరులో కేరళ వస్తుందని రెండు నెలల కిందట ప్రకటన వచ్చింది. ఇప్పుడు ఆ జట్టు కెప్టెనే వస్తుండడంతో అర్జెంటీనా జట్టు టూర్ కష్టమే అని చెబుతున్నారు.