ప‌క్క‌న పెట్టిన అమ్మాయే.. టీమ్ఇండియాను ఫైన‌ల్ చేర్చింది

జెమీమా లేకుంటే ఈ మ్యాచ్ లో ఆసీస్ చేతిలో ఓట‌మి ఖాయ‌మే అని చెప్ప‌క త‌ప్ప‌దు. ఇంత‌కూ ఆమె ప్ర‌త్యేక‌త‌లు ఏమంటే.??;

Update: 2025-10-31 03:49 GMT

ఫీల్డింగ్ లో మ‌హా చురుకు... బ్యాటింగ్ లో అయితే డైన‌మైటే..! ఆమె జ‌ట్టులో ఉంటే జ‌ట్టుకే కాదు మైదానంలోని అభిమానుల‌కే పండుగ‌..! త‌న ఆటతోనే కాదు డ్యాన్స్ తోనూ అల‌రిస్తుంది ఆ అమ్మాయి..! ఈసారి మ‌హిళ‌ల‌ ప్ర‌పంచ క‌ప్ లో దుమ్మురేపుతుంద‌ని కూడా ఆశించారు.. కానీ, 0, 32, 0, 33.. ఇలా నాలుగు మ్యాచ్ లో విఫ‌లం కావ‌డంతో ప‌క్క‌న‌పెట్టారు. అయితే, తామేం కోల్పోతున్నామో గ్ర‌హించింది జ‌ట్టు మేనేజ్ మెంట్. దీనికితోడు సూప‌ర్ ఫామ్ లో ఉన్న ఓపెన‌ర్ ప్ర‌తీకా రావ‌ల్ గాయంతో దూరం కావ‌డం ఈ అమ్మాయికి మ‌రో అవ‌కాశం ఇచ్చేలా చేసింది. అదే ఇప్పుడు టీమ్ ఇండియాను ఫైనల్ కు చేర్చేందుకు కార‌ణ‌మైంది. ఇదంతా గురువారం నాటి సెమీఫైన‌ల్లో ఆస్ట్రేలియాపై అద్భుత అజేయ సెంచ‌రీ చేసి జ‌ట్టును గెలిపించిన జెమీమా రోడ్రిగ్స్ గురించి. జెమీమా లేకుంటే ఈ మ్యాచ్ లో ఆసీస్ చేతిలో ఓట‌మి ఖాయ‌మే అని చెప్ప‌క త‌ప్ప‌దు. ఇంత‌కూ ఆమె ప్ర‌త్యేక‌త‌లు ఏమంటే.??

ముంబైక‌ర్..

ముంబైలో 2000 సంవ‌త్స‌రం సెప్టెంబ‌రు 5న పుట్టిన జెమీమా.. 17 ఏళ్ల వ‌య‌సులోనే 2018లో టీమ్ ఇండియా మ‌హిళ‌ల జ‌ట్టులోకి వ‌చ్చింది. 112 టి20లు, 58 వ‌న్డేలు, 3 టెస్టులు ఆడింది. దూకుడైన బ్యాట‌ర్ కు తోడు అద్భుత‌మైన ఫీల్డ‌ర్ కావ‌డంతో టీమ్ ఇండియాలో చోటు ఖాయం చేసుకుంది. ఈ ప్రపంచ‌క‌ప్ లో మాత్రం వ‌రుస‌గా నాలుగు మ్యాచ్ ల‌లో నిరాశ‌ప‌రిచింది. దీంతో ఇంగ్లండ్ తో మ్యాచ్ లో ప‌క్క‌న‌పెట్టారు. అయితే, ఆమె లేని లోటు ఫీల్డింగ్ లోనూ క‌నిపించింది. ప్ర‌తీకాకు గాయంతో బ్యాటింగ్ కూడా బ‌ల‌హీన‌ప‌డ‌డంతో త‌ప్ప‌నిస‌రి అయి తిరిగి తుది జ‌ట్టులోకి తీసుకున్నారు. వ‌స్తూనే న్యూజిలాండ్ పై సెమీస్ కు వెళ్లాలంటే త‌ప్ప‌క గెల‌వాల్సిన మ్యాచ్ లో జెమీమా 55 బంతుల్లో 76 ప‌రుగులు చేసి త‌న స‌త్తా ఏమిటో చూపించింది. ఇప్పుడు సెమీఫైన‌ల్లో కంగారూల‌ను తోక ముడిచేలా చేసింది.

అందం.. ఆట‌.. హాకీ.. క్రికెట్.. డ్యాన్స్

అందంతో పాటు మంచి బ్యాట‌ర్ అయిన జెమీమా 12 ఏళ్ల వ‌య‌సుకే అండ‌ర్ 19 జ‌ట్టులోకి వ‌చ్చింది. దీనికిముందే ఆమె హాకీ ప్లేయ‌ర్. జాతీయ స్థాయిలో ప్రాతినిధ్యం వ‌హించింది. బాస్కెట్ బాల్, ఫుట్ బాల్ లోనూ ప్ర‌వేశం ఉంది. నాలుగేళ్ల వ‌య‌సుకే ప‌లు క్రీడ‌ల్లో ప్ర‌తిభ చాటింది. దీంతో ఆమె కోస‌మే కుటుంబం బందూప్ నుంచి ముంబైలోని బాంద్రాకు మారింది. త‌న‌పై కుటుంబం పెట్టుకున్న న‌మ్మ‌కాన్ని జెమీమా నిల‌బెట్టుకుంది. ఇంత‌కూ ఆమె కోచ్ ఎవ‌రు అనుకుంటున్నారు.. తండ్రి ఇవాన్.

-జెమీమా అంటే ఇప్పుడు దేశ‌మంతా బాగా తెలిసిపోయింది. కానీ, క్రికెట్ అభిమానుల‌కు ఆమె గురించి ఇంకా బాగా తెలుసు. మైదానంలో జెమీమా చేసే డ్యాన్స్ లు సోష‌ల్ మీడియాలో బాగా వైర‌ల్. అయితే, ఆట కంటే డ్యాన్స్ లు ఎక్కువ అని ఓ ద‌శ‌లో ఆమెకు చెడ్డ‌పేరు వ‌చ్చింది. ఆస్ట్రేలియాపై 127 ప‌రుగుల అజేయ ఇన్నింగ్స్ చూశాక ఇక‌మీద‌ట ఎవ‌రూ ఈ మాట అనే సాహ‌సం చేయ‌రేమో..?

Tags:    

Similar News