కాటేర‌మ్మ కొడుకు కుమ్మేశాడు.. 2 రోజుల్లోనే ముగిసిన యాషెస్ టెస్టు

ప్ర‌తిష్ఠాత్మ‌క యాషెస్ సిరీస్ అంటే ఇంగ్లండ్‌-ఆస్ట్రేలియా హోరాహోరీగా త‌ల‌ప‌డ‌తాయి. రెండేళ్లకోసారి జ‌రిగే ఈ సిరీస్ ప్ర‌పంచ వ్యాప్తంగా అభిమానుల‌ను అల‌రిస్తుంటుంది.;

Update: 2025-11-22 17:12 GMT

ప్ర‌తిష్ఠాత్మ‌క యాషెస్ సిరీస్ అంటే ఇంగ్లండ్‌-ఆస్ట్రేలియా హోరాహోరీగా త‌ల‌ప‌డ‌తాయి. రెండేళ్లకోసారి జ‌రిగే ఈ సిరీస్ ప్ర‌పంచ వ్యాప్తంగా అభిమానుల‌ను అల‌రిస్తుంటుంది. ఈసారి ఆస్ట్రేలియా ఆతిథ్యం ఇస్తుండ‌గా.. క‌ళ్లు తెరిచి చూసేస‌రికి మ్యాచ్ అయిపోయింది. శుక్ర‌వారం ఉద‌యం ఇలా మొద‌లైందో లేదో.. శ‌నివారం మ‌ధ్యాహ్నానికి ముగిసింది తొలి టెస్టు. మూడు ఇన్నింగ్స్ ల పాటు పూర్తిగా బౌల‌ర్ల ఆధిప‌త్యం వ‌హించిన ఈ టెస్టులో.. చివ‌ర‌కు కాటేర‌మ్మ కొడుకు త‌న బ్యాట్ ప్ర‌తాపం ఏమిటో చూపించాడు. హాఫ్ సెంచ‌రీ చేయ‌డ‌మే క‌ష్టంగా క‌నిపించిన పిచ్ పై ఏకంగా ఫాస్టెస్ట్ సెంచ‌రీనే కొట్టేశాడు. ఆస్ట్రేలియాలోనే కాదు.. భూమి మీదున్న ఏ న‌గ‌రానికి సుదూరంగా ఉండే.. ఫాస్టెస్ట్ పిచ్ గా పేరుగాంచిన పెర్త్ లో జ‌రిగిన తొలి టెస్టు ప‌లు అరుదైన రికార్డుల‌కు వేదికైంది. అవేమంటే.. ఈ టెస్టు యాషెస్ చ‌రిత్ర‌లో అతి త‌క్కువ బంతులు (847)లో ముగిసిన మూడో మ్యాచ్ గా నిలిచింది. 1888లో ఇంగ్లండ్‌లోని ఓల్డ్ డ్రాఫోర్డ్ లో 788 బంతుల్లో, లార్డ్స్ లో 792 బంతుల్లో మ్యాచ్ పూర్త‌యింది.

ఓపెన‌ర్ గా వ‌చ్చాడు.. బాదేశాడు

శుక్ర‌వారం మొద‌ట బ్యాటింగ్ చేసిన ఇంగ్లండ్ 172 ప‌రుగులకు ఆలౌటైంది. కానీ, ఆస్ట్రేలియాను 132 ప‌రుగుల‌కే క‌ట్ట‌డి చేసింది. శ‌నివారం ఉద‌యం రెండో ఇన్నింగ్స్ కు దిగిన ఇంగ్లండ్ 164 ప‌రుగుల‌కు ఆలౌటైంది. దీంతో 205 ప‌రుగుల టార్గెట్ ఆస్ట్రేలియా ముందు నిలిచింది. అయితే, మొద‌టి ఇన్నింగ్స్ లో మిడిలార్డ‌ర్ లో దిగిన కాటేర‌మ్మ కొడుకు, ఐపీఎల్ ఫ్రాంచైజీ స‌న్ రైజ‌ర్స్ హైద‌రాబాద్ బ్యాట‌ర్ రెండో ఇన్నింగ్స్ లో ఓపెన‌ర్ గా వ‌చ్చాడు. అంతే.. ఆట ఫ‌లిత‌మే మారిపోయింది. లీగ్ మ్యాచ్ లో ఆడిన‌ట్లు బ్యాట్ ఝ‌ళిపించిన హెడ్.. యాషెస్ చ‌రిత్ర‌లో రెండో ఫాస్టెస్ట్ సెంచ‌రీ చేశాడు. త‌మ మాజీ ఆట‌గాడు ఆడ‌మ్ గిల్ క్రిస్ట్ 2006లో 57 బంతుల్లో సెంచ‌రీ చేయ‌గా.. తాజా మ్యాచ్ లో హెడ్ 69 బంతుల్లో సెంచ‌రీ బాదాడు. 36 బంతుల్లో హాఫ్ సెంచ‌రీ చేసిన హెడ్‌.. మ‌రో 33 బంతుల్లో సెంచ‌రీ అందుకున్నాడు. ఇది నాలుగో ఇన్నింగ్స్ లో ఫాస్టెస్ట్ సెంచ‌రీ కావ‌డం గ‌మ‌నార్హం. హెడ్ 16 ఫోర్లు, 4 సిక్సులు కొట్టాడు. మొత్తానికి రెండే వికెట్లు ఆస్ట్రేలియా 28.2 ఓవ‌ర్ల‌లోనే 205 ప‌రుగులు చేసి గెలిచేసింది.

ఇక ఇత‌డే ఓపెన‌ర్... మున్ముందు చుక్క‌లే..

యాషెస్ సిరీస్ తొలి టెస్టు తొలి ఇన్నింగ్స్ లో ఆస్ట్రేలియా వ‌న్ డౌన్ బ్యాట‌ర్ ల‌బుషేన్ ను ఓపెన‌ర్ గా దింది,హెడ్ ను ఐదో స్థానంలో ఆడించింది. ఇది ఎంత త‌ప్పుడు ఆలోచ‌నో త‌న విధ్వంస‌క బ్యాటింగ్ తో హెడ్ త‌న ఆట‌తో చాటాడు. ఇక‌మీద‌ట‌ ఆస్ట్రేలియా రెగ్యుల‌ర్ ఓపెన‌ర్ గా అత‌డు స్థిరప‌డ‌డం ఖాయం. ఇంకో ఓపెన‌ర్ ఉస్మాన్ ఖ‌వాజా ఫామ్ లేమితో పాటు గాయాల‌తో ఇబ్బంది ప‌డుతున్నాడు. రెండో ఓపెన‌ర్ వెద‌ర్లాండ్ కొత్త ఆట‌గాడు. కాబ‌ట్టి ఖ‌వాజా బ‌దులు హెడ్ ఓపెన‌ర్ గా రావ‌డం ఖాయం. ఇంగ్లండ్ బౌల‌ర్ల‌కు యాషెస్ సిరీస్ లోని మిగ‌తా నాలుగు టెస్టుల్లో చుక్క‌లు చూప‌డం ఖాయం.

Tags:    

Similar News