ఇండియాలో 2026 టి20 వరల్డ్‌కప్‌..అర్హతకు ఒక్క విజయం దూరంలో కొత్త జట్టు

వచ్చే ఏడాది భారత్‌లో జరగనున్న టి20 ప్రపంచ కప్‌లో ఓ కొత్త జట్టును చూస్తామా?.. అది కూడా ఎన్నడూ చూడని జట్టును చూస్తామా..?;

Update: 2025-07-10 23:30 GMT

ఇప్పటివరకు యూరప్‌లో క్రికెట్‌ కేవలం ఇంగ్లండ్‌, దాని పక్కన ఉండే ఐర్లాండ్‌, స్కాట్లాండ్‌లకే పరిమితం అయింది. నెదర్లాండ్స్‌ వంటి జట్లు ఇప్పుడిప్పుడే అడుగులు వేస్తున్నాయి. యూరప్‌లోనే ఫ్రాన్స్‌, జర్మనీ, స్పెయిన్‌, ఇటలీ వంటి పెద్ద దేశాలు, అభివృద్ధి చెందిన దేశాలు ఉన్నప్పటికీ ప్రపంచ కప్‌లో పోటీ పడే స్థాయికి ఎదగలేదు. అలాంటిది ఇటలీ ఏకంగా ఇండియాలో జరిగే టి20 ప్రపంచ కప్‌నకు అర్హత సాధిస్తే అది పెద్ద సంచలనమే.

వచ్చే ఏడాది భారత్‌లో జరగనున్న టి20 ప్రపంచ కప్‌లో ఓ కొత్త జట్టును చూస్తామా?.. అది కూడా ఎన్నడూ చూడని జట్టును చూస్తామా..? పరిస్థితుల ప్రకారం కాస్త దీనికి అవకాశాలు ఉన్నట్లుగానే కనిపిస్తోంది. టీమ్‌ ఇండియా టి20 ప్రపంచ కప్‌ డిఫెండింగ్‌ చాంపియన్‌ అనే సంగతి తెలిసిందే. గత ఏడాది అమెరికా, కరీబియన్‌ దీవుల్లో జరిగిన టి20 ప్రపంచ కప్‌ ను టీమ్ ఇండియా గెలుచుకున్న సంగతి తెలిసిందే. అంటే.. మన దేశంలో వచ్చే ఏడాది జరిగే టోర్నీలో డిఫెండింగ్ చాంపియన్ గా ఆడనుంది. భారత్‌తో పాటు శ్రీలంక కూడా ఈ టి20 ప్రపంచ కప్‌నకు ఆతిథ్యం ఇవ్వనుంది.

2026లో జరిగే ఈ ప్రపంచ కప్‌లో ఎన్నడూ చూడని ఓ కొత్త జట్టును చూస్తామనిపిస్తోంది. తాజాగా ప్రపంచ కప్‌ కోసం క్వాలిఫయర్‌ మ్యాచ్‌లు జరుగుతున్నాయి. యూరప్ రీజియన్ గ్రూప్‌ మ్యాచ్‌లో ఇటలీ.. కొద్దిగా పేరున్న స్కాట్లాండ్‌ జట్టును 12 పరుగుల తేడాతో ఓడించింది. తద్వారా ప్రపంచ కప్‌ క్వాలిఫయింగ్‌కు కాస్త దగ్గరైంది. ఈ గ్రూప్‌లో ఇటలీ మూడు మ్యాచ్‌లు ఆడి రెండు గెలిచింది.

ఒకదాంట్లో ఫలితం రాలేదు. దీంతో గ్రూప్‌ టాపర్‌గా ఉంది. స్కాట్లాండ్‌తో మ్యాచ్‌లో టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకున్న ఇటలీకి ఓపెనర్ ఎమిలియో గే 21 బంతుల్లోనే అర్ధ సెంచరీ సాధించి శుభారంభం అందించాడు. హ్యారీ మానెంటి (38 బంతుల్లో 38), గ్రాంట్ స్టీవర్ట్ (27 బంతుల్లో 44) రాణించారు. 168 పరుగుల లక్ష్యాన్ని ఛేదించే క్రమంలో స్కాట్లాండ్‌ ఓపెనర్ జార్జ్ మున్సే (61 బంతుల్లో 72 పరుగులు) ఇన్నింగ్స్‌ గెలిపించేదిగా కనిపించింది. మానెంటి ఐదు వికెట్లు తీయడంతో నిర్ణీత 20 ఓవర్లలో 155/5 వద్ద ఆగిపోయింది.

ఇటలీ జట్టుకు ఆస్ట్రేలియా మాజీ టెస్ట్ ఓపెనర్ జో బర్న్స్ కెప్టెన్‌ కావడం విశేషం. శుక్రవారం జరిగే మ్యాచ్‌లో ఇటలీ.. నెదర్లాండ్స్‌తో తలపడుతుంది. ఇది గ్రూప్‌లో చివరి మ్యాచ్‌. నెదర్లాండ్స్‌ కూడా కాస్త పేరున్నదే. ఈ జట్టులోనే మన విజయవాడ యువకుడు తేజ నిడమానూరు ఉన్నాడు. ఇటలీ-నెదర్లాండ్స్‌ తలపడేది గ్రూప్ లో చివరి మ్యాచ్‌. ఇందులో గనుక ఇటలీ గెలిస్తే 2026 టి20 ప్రపంచ కప్‌నకు అర్హత సాధిస్తుంది.

Tags:    

Similar News