అసలే ఐపీఎల్.. ఆపై ఫిక్సింగ్ భూతం.. ఇలా ఔటైతేనే డౌటు

ఇండియన్ ప్రీమియర్ లీగ్ (ఐపీఎల్) ఎంత సక్సెస్ ఫుల్ లీగ్ అనేది అందరికీ తెలుసు. అయితే, ఇందులో లోపాలు లేవా? అంటే అనేకం.;

Update: 2025-04-24 12:40 GMT

ఇండియన్ ప్రీమియర్ లీగ్ (ఐపీఎల్) ఎంత సక్సెస్ ఫుల్ లీగ్ అనేది అందరికీ తెలుసు. అయితే, ఇందులో లోపాలు లేవా? అంటే అనేకం. కానీ, ప్రేక్షకులకు ఐపీఎల్ అందించే మజా మధ్య అవేమీ నిలవడం లేదు.

ఐపీఎల్ ను దశాబ్దం కిందటే మ్యాచ్ ఫిక్సింగ్ ఆరోపణలు చుట్టుముట్టాయి. 2013లో టీమ్ ఇండియా మాజీ పేసర్ శ్రీశాంత్ స్పాట్ ఫిక్సింగ్ లో చిక్కాడు.

2016, 2017 సీజన్లలో చెన్నై సూపర్ కింగ్స్ వంటి బలమైన జట్టు మేనేజ్ మెంట్ కూడా ఫిక్సింగ్ ఆరోపణల్లో చిక్కుకుంది. 2013 నాటి బెట్టింగ్ ఆరోపణలు దీనికి కారణమయ్యాయి. ఇక అప్పట్లోనే చెన్నైతో పాటు రాజస్థాన్ రాయల్స్ బెట్టింగ్ స్కాంలో చిక్కుకుని రెండేళ్ల నిషేధానికి గురైంది. ఈ ఏడాది కూడా రాజస్థాన్ పై ఫిక్సింగ్ ఆరోపణలు వచ్చాయి. చివరి ఓవర్ లో గెలిచే అవకాశం ఉన్నా ఓడడమే దీనికి కారణం.

రూ.వేల కోట్ల ఐపీఎల్ ను ఫిక్సింగ్ భూతం నిరంతరం వెంటాడుతూనే ఉంటుంది. అందుకని అప్రమత్తంగా ఉండడమే అన్నిటికీ మించిన ఆయుధం.

కాగా, ఫిక్సింగ్ సంకేతాలు ముందుగానే తెలిసిపోతాయి. ఆటగాళ్లు అసాధారణంగా ఔటైనా.. అనూహ్య ప్రదర్శనలు చేసినా బెట్టింగ్, ఫిక్సింగ్ అనుమానాలు వస్తాయి.

ఇక సన్ రైజర్స్ హైద‌రాబాద్, ముంబై ఇండియన్స్ జట్ల మ‌ధ్య బుధవారం ఉప్పల్ లో జరిగిన మ్యాచ్ లో సన్ రైజర్స్ బ్యాటర్ ఇషాన్ కిషన్ ఔటైన తీరు కూడా ఫిక్సింగ్ అనుమానాలకు తావిచ్చింది.

ముంబై పేసర్ దీప‌క్‌ చాహర్ వేసిన బంతి లెగ్ స్టంప్‌ నకు దూరంగా వెళ్లగా.. కీప‌ర్ క్యాచ్ పట్టాడు. కామెంటేట‌ర్లు వైడ్‌ అని అంటున్నా.. అంపైర్ కూడా చేతులు అడ్డంగా ఎత్తే ప్ర‌య‌త్నంలో ఉండగా.. కిషన్ ఔటైన‌ట్లు భావించి వెళ్లిపోయాడు. దీంతో అంపైర్ నిర్ణ‌యాన్ని మార్చుకున్నాడు.

టీమ్ ఇండియా తరఫున చాలా మ్యాచ్ లు ఆడిన ఇషాన్ కిషన్ లాంటి బ్యాట్స్ మన్ కు తాను ఔటో కాదో చెప్పాల్సిన అవసరం లేదు. పైగా బంతి బ్యాట్ ను తాకిందా? లేదా? అనే సోయి కూడా లేకుండా.. రివ్యూ చాన్స్ లు ఉన్న కీలక ఆటగాడు అయినప్పటికీ అత్యంత పేలవంగా తనకు తాను ఔట్ గా నిర్ణయించుకుని వెళ్లిపోయి జట్టును దారుణంగా దెబ్బతీశాడు.

ఇషాన్ కిషన్ తాను క్రీడా స్ఫూర్తిని పాటించాడని అనుకున్నాడేమో.. కానీ, బంతి అసలు బ్యాట్ ను తాకనే లేదు. లైవ్ లో చూసినవారికీ ఈ విషయం తెలిసిపోతోంది. కానీ, ఇషాన్ వెళ్లిపోవ‌డంతో ఇలాంటివి జరిగితేనే ఫిక్సింగ్ అనుమానాలు వస్తాయి అని అభిమానులు అంటున్నారు. కొందరైతే.. సన్ రైజర్స్ హైద‌రాబాద్ టీమ్ లో ఉంటూనే తన పాత జట్టు ముంబైకి ఆడాడు ఇషాన్ అని ఎద్దేవా చేస్తున్నారు. ముంబైకి ఈ మ్యాచ్‌ గెల‌వ‌డం అత్య‌వ‌స‌రం. దీంతో టాప్ 4లో నిలుస్తుంది. అందుకే ఇలా చేశారా? అంటూ సోష‌ల్ కామెంట్లు చేస్తున్నారు. ఇక మ్యాచ్ ముగిశాక ముంబై ఆట‌గాళ్ల‌తో ఇషాన్ న‌వ్వుతూ మాట్లాడ‌డంహైద‌రాబాదీలకు తిక్క రేగేలా చేసింది.

Tags:    

Similar News