దక్షిణ భారతదేశంలో మిగతా ఐపీఎల్ మ్యాచ్ లు.. హైదరాబాద్ కూ భాగ్యం

పాకిస్థాన్ పై యుద్ధం కారణంగా అర్థంతరంగా ఆగిపోయిన ఇండియన్ ప్రీమియర్ లీగ్ (ఐపీఎల్)ను వచ్చే వారం పునరుద్ధరించే చాన్సుంది.;

Update: 2025-05-10 12:45 GMT

పాకిస్థాన్ పై యుద్ధం కారణంగా అర్థంతరంగా ఆగిపోయిన ఇండియన్ ప్రీమియర్ లీగ్ (ఐపీఎల్)ను వచ్చే వారం పునరుద్ధరించే చాన్సుంది. ఇప్పటికైతే వారం విరామం అని చెప్పినందున.. మళ్లీ మ్యాచ్ లు ఎప్పుడా? అని క్రికెట్ అభిమానులు ఎప్పుడెప్పుడా? అని ఎదురుచూస్తున్నారు. మరోవైపు దాదాపు 50 రోజులుగా రోజూ సాయంత్రం అయితే మ్యాచ్ లు చూసేందుకు అలవాటుపడిన ఐపీఎల్ అభిమానులు రెండు రోజుల నుంచి తీవ్ర నిరాశలో ఉన్నారు.

నగరాలు, పట్టణాల్లో అయితే ఆఫీసుల నుంచి వచ్చినవారు, ఊళ్లలో అయితే పనులు ముగించుకుని వచ్చినవారు రాత్రి 7.30 వరకు ఐపీఎల్ మ్యాచ్ ల కోసం టీవీల ముందు కూర్చొనేవారు. అర్థరాత్రి వరకు మ్యాచ్ లను ఆస్వాదించేవారు. రెండు రోజులుగా ఆ మజా దూరమైందని వీరంతా బాధపడుతున్నారని చెప్పొచ్చు.

కాగా, ప్లేఆఫ్స్, ఫైనల్స్ కలిపి ఐపీఎల్ 18 సీజన్ లో మొత్తం 74 మ్యాచ్ లకు గాను గురువారం 58వ మ్యాచ్ మధ్యలో నిలిపివేశారు. తొలుత ఈ సీజన్ కు పూర్తిగా రద్దు చేశారని కథనాలు వచ్చినా.. వారం పాటు విరామం మాత్రమే ఇచ్చారని స్పష్టమైంది.

ఐపీఎల్ 18ను ఉత్తర, పశ్చిమ, ఈశాన్య, తూర్పు, దక్షిణ భారతాల్లోని మొత్తం 12 వేదికల్లో నిర్వహిస్తున్నారు. యుద్ధం కారణంగా వీటిలో ఉత్తర భారతంలోని మైదానాలలో మ్యాచ్ ల నిర్వహణ సాధ్యం కాదు. ఉదాహరణకు ధర్మశాల మైదానం పాకిస్థాన్ ప్రస్తుతం దాడులు చేస్తున్న జమ్మూకు 200 కిలోమీటర్ల దూరంలో ఉంది. అందుకనే.. ఐపీఎల్ ను వచ్చేవారం పునరుద్ధరించినా.. ఉత్తర భారత దేశంలో మ్యాచ్ ల నిర్వహణ ఉండదని చెప్పొచ్చు.

ఇప్పటివరకు అందుతున్న సమాచారం ప్రకారం ఐపీఎల్ మిగతా మ్యాచ్ లను దక్షిణ భారతదేశంలోని ఉప్పల్ (హైదరాబాద్), చెపాక్ (చెన్నై), చిన్నస్వామి (బెంగళూరు) మైదానాల్లో నిర్వహించే అవకాశాలను పరిశీలిస్తున్నారట. ఈ మూడు మైదానాలు అంతర్జాతీయంగా పేరుగాంచినవే. దీంతోపాటు ఉత్తర భారతం కంటే దక్షిణ భారతం సేఫ్. అందుకనే మిగతా 16 మ్యాచ్ లను మూడు మైదానాల్లో నిర్వహించే ఆలోచన చేస్తున్నారట.

ఈ కథనాలే నిజమైతే.. హైదరాబాద్ ఉప్పల్ స్టేడియానికి లక్కీ చాన్సే. చెపాక్, చిన్నస్వామి మైదానాలతో పోలిస్తే ఉప్పల్ కు ఇప్పటివరకు అంత పేరు లేదు. ఇప్పుడు మాత్రం ఉప్పల్ పేరు మార్మోగుతుంది.

Tags:    

Similar News