ఐపీఎల్ లో ఫిక్సింగ్? తమ జట్టుపై బీజేపీ ఎమ్మెల్యే సంచలన ఆరోపణలు
క్రేజీ క్రేజీగా సాగుతున్న ఇండియన్ ప్రీమియర్ లీగ్ (ఐపీఎల్) 18వ సీజన్ లో వారానికో సంచలనం బయటకు వస్తోంది.;
క్రేజీ క్రేజీగా సాగుతున్న ఇండియన్ ప్రీమియర్ లీగ్ (ఐపీఎల్) 18వ సీజన్ లో వారానికో సంచలనం బయటకు వస్తోంది. మొదట సన్ రైజర్స్ హైదరాబాద్ ఫ్రాంచైజీ హోం గ్రౌండ్ ఉప్పల్ టికెట్ల గురించి హైదరాబాద్ క్రికెట్ సంఘం (హెచ్ సీఏ)తో గొడవ పడింది. వేరే చోటకు వెళ్లిపోతామని బెదిరించింది. ఆపై హైదరాబాద్ లో ఓ బుకీ ఫిక్సింగ్ ప్రయత్నాలు చేస్తున్నాడని, ప్లేయర్లు అప్రమత్తంగా ఉండాలని హెచ్చరించింది.
ఇప్పుడు మరో జట్టుకు సంబంధించి ఫిక్సింగ్ ఆరోపణలు వస్తున్నాయి. ఇప్పటికే బెట్టింగ్, స్పాట్ ఫిక్సింగ్ ఆరోపణలతో రెండేళ్ల నిషేధానికి గురైన జట్టు విషయంలోనే ఇలాంటగి ఆరోపణలు వస్తుండడంతో ఏదో జరుగుతోంది? అనే అనుమానం కలుగుతోంది. ఆ జట్టు ఐపీఎల్ వ్యవస్థాపకుల్లో ఒకడు, ఫిక్సింగ్ ఆరోపణలున్న లలిత్ మోదీ భాగస్వామ్యం ఉన్న రాజస్థాన్ రాయల్స్ కావడం గమనార్హం.
ఇంతకూ ఏం జరిగింది?
ఈ నెల 19న రాజస్థాన్ రాయల్స్ హోం గ్రౌండ్ జైపూర్ లో లక్నో సూపర్ జెయింట్స్ తో మ్యాచ్ ఆడింది. తొలుత బ్యాటింగ్ కు దిగిన లక్నో 5 వికెట్లకు 180 పరుగులు చేసింది. ఇక ఛేజింగ్ లో ఆఖరి ఓవర్ లో 9 పరుగులు చేయలేక రాయల్స్ రెండు పరుగుల తేడాతో ఓడింది. దీనిపైనే తాజాగా రాజస్థాన్ క్రికెట్ అసోసియేషన్ (ఆర్‌సీఏ), రాజస్థాన్ రాయల్స్ జట్ల మధ్య విభేదాలు బయటపడ్డాయి. రాయల్స్ ఫిక్సింగ్ కు పాల్పడిందంటూ రాజస్థాన్ క్రికెట్ అసోసియేషన్ (ఆర్‌సీఏ) అడ్‌హక్ కమిటీ కన్వీనర్ జైదీప్ బిహానీ చేసిన ఆరోపణలు తీవ్ర దుమారం రేపుతున్నాయి.
ఈయన సాధారణ వ్యక్తి అయితే, ఆరోపణలకు బలం ఉండేది కాదేమో..? జైదీప్ బిహానీ రాజస్థాన్ అధికార పార్టీ బీజేపీ ఎమ్మెల్యే. అందుకనే ఆయన ఆరోపణలు తీవ్ర చర్చనీయం అవుతున్నాయి. ఆడుతున్నది సొంత మైదానం అయినా.. రాయల్స్ ఇలా ఓడిపోవడం ఏమిటని ఆయన ప్రశ్నిస్తున్నారు. ఇక ఫిక్సింగ్ ఆరోపణల మీద రాజస్థాన్ రాయల్స్ యాజమాన్యం స్పందించలేదు.
అసలే ఈ సీజన్ లో రాజస్థాన్ ప్రదర్శన సరిగా లేదు. కెప్టెన్ సంజూ శాంసన్ గాయంతో మ్యాచ్ లకు అందుబాటులో ఉండడం లేదు. మంచి ఆటగాళ్లను వదులుకుని రాయల్స్ సూప్ లో పడింది.
సారీ ద్రవిడ్ సర్..
ఫిక్సింగ్ ఆరోపణలు రాజస్థాన్ జట్టుకు కొత్త కాకపోవచ్చు. కానీ, ఆ జట్టు హెడ్ కోచ్ రాహుల్ ద్రవిడ్ ను మాత్రం బాగా బాధిస్తాయి. టీమ్ ఇండియా దిగ్గజం అయిన ద్రవిడ్ జెంటిల్ మన్. అందరూ గౌరవించే వ్యక్తి. అలాంటి ఆటగాడు కోచ్ గా ఉన్న జట్టుపై ఆరోపణలు రావడం ఆయనకు కాదు క్రికెట్ కు తలవంపులు.