ఆ ఒక తప్పే పంజాబ్ కు ట్రోఫీని దూరం చేసింది..

ఐపీఎల్ 2025 సీజన్‌లో శరవేగంగా ఆడి ఫైనల్‌కి చేరిన పంజాబ్ కింగ్స్, కీలక సందర్భంలో మాత్రం తీవ్రంగా తడబడ్డారు.;

Update: 2025-06-04 04:58 GMT

ఐపీఎల్ 2025 సీజన్‌లో శరవేగంగా ఆడి ఫైనల్‌కి చేరిన పంజాబ్ కింగ్స్, కీలక సందర్భంలో మాత్రం తీవ్రంగా తడబడ్డారు. బెంగళూరుతో జరిగిన ఫైనల్‌లో ఛేదనలో తడబడింది. కానీ ఈ పరాజయంలో ఓ కీలక తప్పిదమే ప్రధాన కారణమైందని విశ్లేషకుల అభిప్రాయం.

మ్యాచ్ రెండవ ఇన్నింగ్స్‌లో అర్ధాంతరానికి వచ్చేసరికి పంజాబ్ కాస్త ఒత్తిడిలో పడింది. ఇలాంటి సమయంలో జట్టు మెరుగైన నిర్ణయం తీసుకోవాల్సి ఉండేది. కానీ వారు ఆశ్చర్యకరంగా తక్కువ అనుభవం ఉన్న నేహల్ వధేరాను క్రీజులోకి పంపారు.

అనుభవజ్ఞుడైన మార్కస్ స్టోయినిస్‌ను బెంచ్ మీద ఉంచి, నేహల్‌ను పంపడం పూర్తిగా వెర్రితనంగా మారింది. మ్యాచ్ ఒత్తిడిలో ఉండగా, నేహల్ 18 బంతుల్లో 15 పరుగులు మాత్రమే చేశాడు. ఇది జట్టు ఛేదనను పూర్తిగా నెమ్మదిపరిచింది. అదే సమయంలో అవసరమైన రన్‌రేట్ దాదాపు 10కి పైగానే ఉంది.

ఈ సమయంలో స్టోయినిస్‌ను పంపి ఉండి ఉంటే పరిస్థితి పూర్తిగా భిన్నంగా ఉండేదని క్రికెట్ నిపుణులు చెబుతున్నారు. స్టోయినిస్ చివర్లో 2 బంతుల్లో 6 పరుగులు కొట్టాడు. కానీ అప్పటికే ఆట దాదాపుగా పంజాబ్ చేతుల నుంచి జారిపోయింది.

చివరికి పంజాబ్ కేవలం 6 పరుగుల తేడాతో ఓడిపోయింది. ఈ ఓటమిలో మూడో డౌన్ లో వచ్చి నెమ్మదిగా ఆడిన ఇన్నింగ్స్‌దే ప్రధాన కారణం అని చెప్పొచ్చు. ఒకవేళ ఆ సమయంలో మరింత ఆత్మవిశ్వాసంతో బరిలోకి దిగుతూ, ఆటలో అగ్రశ్రేణి ఆటగాళ్లను పంపి ఉండి ఉంటే పంజాబ్‌కి టైటిల్ వచ్చే అవకాశం ఉండేది.

ఈ నిర్ణయం పంజాబ్ అభిమానుల గుండెల్లో గాయంగా మిగిలిపోయింది. ఓ చిన్న తప్పిదం.. కానీ ఫలితం మాత్రం టైటిల్ కోల్పోయేలా చేసింది!

Tags:    

Similar News