ఐపీఎల్ తోనే 200 కోట్లు సంపాదించారు..
ఇండియన్ ప్రీమియర్ లీగ్(ఐపీఎల్).. ప్రపంచంలోనే క్యాష్ రిచ్ లీగ్. ప్రతిభావంతులైన విదేశీ ఆటగాళ్లు వారి దేశానికి ఏడాది మొత్తం ఆడినా రాని డబ్బు.. ఒక్క ఐపీఎల్ సీజన్ లో ఆడితే వచ్చేస్తుంది.;
ఇండియన్ ప్రీమియర్ లీగ్(ఐపీఎల్).. ప్రపంచంలోనే క్యాష్ రిచ్ లీగ్. ప్రతిభావంతులైన విదేశీ ఆటగాళ్లు వారి దేశానికి ఏడాది మొత్తం ఆడినా రాని డబ్బు.. ఒక్క ఐపీఎల్ సీజన్ లో ఆడితే వచ్చేస్తుంది. అందుకే ఈ లీగ్ కోసం జాతీయ జట్లలోని స్థానాన్ని కూడా లైట్ తీసుకున్న ఆటగాళ్లు ఉన్నారు. ఆయా దేశాల క్రికెట్ బోర్డులు దీనిపై గగ్గోలు పెట్టాయి. ఇప్పుడు లీగ్ మినీ వేలం కోసం రిటైనింగ్ జాబితా కూడా విడుదలైంది. ఇక మినీ వేలం తేదీ ఎప్పుడు? అనేది తేలాల్సి ఉంది. బహుశా డిసెంబరు మధ్యలో ఉంటుందని భావిస్తున్నారు. తాజా రిటైనింగ్ జాబితా చూస్తే ఐపీఎల్ 19వ సీజన్ పలు మార్పులతో రంజింపజేస్తుంది అనిపిస్తోంది. కారణం.. చాలా జట్లు తమ కీలక ఆటగాళ్లను వదులుకున్నాయి. ఆట కంటే వివాదాలతో నిత్యం వార్తల్లో ఉండే లక్నో సూపర్ జెయింట్స్ అయితే పేస్ విభాగం మొత్తాన్ని వదులుకుంది. చెన్నై సూపర్ కింగ్స్ ఏమో కీలక ఆల్ రౌండర్ రవీంద్ర జడేజాను త్యాగం చేసింది. వికెట్ కీపర్ బ్యాటర్ సంజూ శాంసన్ ను రాజస్థాన్ రాయల్స్ నుంచి తీసుకుంది. ఇలాంటి ఎన్నో మార్పులతో 2026 సీజన్ ప్రేక్షకులకు మజా పంచనుంది అనడంలో సందేహం లేదు. ఈ నేపథ్యంలో మినీ వేలంలో ఎవరికి ఎంత ఎక్కువ ధర పలుకుతుందో అనే ఆసక్తి నెలకొంది. అది అలా ఉంచితే... కేవలం ఐపీఎల్ ద్వారానే రూ.200 కోట్లు, రూ.100 కోట్లు సంపాదించిన ఆటగాళ్లు ఉన్నారంటే ఆశ్చర్యపోవాల్సిన పనిలేదు. వారెవరో తెలుసుకుందామా?
డబుల్ హిట్ మ్యాన్..
కెరీర్ ప్రారంభంలో అప్పటి దక్కన్ చార్జర్స్ (ప్రస్తుతం సన్ రైజర్స్ హైదరాబాద్)కు ఆడాడు టీమ్ ఇండియా మాజీ కెప్టెన్ హిట్ మ్యాన్ రోహిత్ శర్మ. టి20ల్లో దుమ్మురేపే రోహిత్.. ఆ తర్వాత ముంబై ఇండియన్స్‌కు మారాడు. ఆ జట్టుకు ఐదు టైటిల్స్ అందించాడు. ఈ క్రమంలోనే రికార్డు స్థాయిలో రూ.210.9 కోట్లు ఆదాయం ఆర్జించాడు. రోహిత్‌ను నిరుడు ముంబై రూ.16.30 కోట్లకు రిటైన్ చేసుకుంది. లీగ్‌లో ఇదే అతడి అత్యధిక ధర. 2018 నుంచి రోహిత్ రేటు రూ.15 కోట్లుగా ఉంది. 2014-17 మధ్య రూ.12.50 కోట్లు పొందాడు.
కింగ్‌దే తదుపరి స్థానం..
లీగ్ మొదటి నుంచి ఒకే ఒక ఫ్రాంచైజీకి ఆడిన ఆటగాడు కింగ్ విరాట్ కోహ్లి. 2008 నుంచి రాయల్ చాలెంజర్స్ బెంగళూరుతోనే ఉన్న అతడు లీగ్‌లో రూ.209.20 కోట్లు సంపాదించాడు. 19వ సీజన్‌లోనూ బెంగళూరుకే ఆడబోతున్న కోహ్లి.. తన సహచరుడు రోహిత్‌ను అధిగమించేందుకు అవకాశం ఉంది. కారణం.. రోహిత్ కంటే కాస్త వయసు తక్కువ కావడం. ఫామ్ కూడా నిలకడగా ఉండడం.
కెప్టెన్ కూల్ రూ.200 కోట్లకు దగ్గరగా..
18 సీజన్ల నుంచి ఐపీఎల్‌లో ధోనీ అంటే చెన్నై సూపర్ కింగ్స్. చెన్నై సూపర్ కింగ్స్ అంటే ధోనీ. 45 ఏళ్లు వచ్చినా ధోనీ నాయకత్వమే దిక్కు అంటోంది చెన్నై. ఫిక్సింగ్ ఆరోపణల కారణంగా పేరు మార్చుకుని పుణె సూపర్ జెయింట్స్‌గా రెండేళ్లు లీగ్‌లో ఆడింది చెన్నై. అప్పుడు సైతం ధోనీ టీమ్‌లో భాగంగానే ఉన్నాడు. మొత్తం రూ.192.84 కోట్లు సంపాదించాడు ఈ దిగ్గజ కెప్టెన్ కూల్.
-మొదట్లో రాజస్థా్‌న్ రాయల్స్‌కు ఆడి తర్వాత చెన్నైకు వచ్చాడు టీమ్ ఇండియా కీలక ఆల్ రౌండర్ రవీంద్ర జడేజా. ఇతడు లీగ్‌లో రూ.139.01 కోట్లు ఆర్జించాడు. మళ్లీ రాజస్థాన్‌కు వెళ్లనున్న స్టార్ ప్లేయర్ ఇంకో రెండేళ్లయినా కొనసాగే చాన్సుంది.
ఒకే ఒక్క విదేశీయుడు
వయసు పెరుగుతున్నా తన స్పిన్ మాయతో కట్టిపడేస్తూ, బ్యాట్‌తోనూ విలువైన పరుగులు చేస్తుంటాడు వెస్టిండీస్ ప్లేయర్ సునీల్ నరైన్. కోల్ కతా నైట్ రైడర్స్ విజయాల్లో కీలక పాత్ర పోషించే సునీల్.. రూ.125.25 కోట్లను ఐపీఎల్ ద్వారా పొందాడు. రూ.వందకోట్లకు పైగా ఆర్జించిన ఏకైక విదేశీ ప్లేయర్ ఇతడే కావడం గమనార్హం.