ఐపీఎల్ డెత్ బ్యాటిల్.. హైదరాబాద్-చెన్నై-ముంబై.. ముందు ఔటయ్యేదెవరో?
ఇక యాదృచ్ఛికం, ముంబై ఇండియన్స్ రాబోయే మూడు మ్యాచ్ లు సన్‌రైజర్స్ హైదరాబాద్, చెన్నై సూపర్ కింగ్స్ తో ఉన్నాయి.;
ఇప్పటివరకు ఇండియన్ ప్రీమియర్ లీగ్ (ఐపీఎల్) 17 సీజన్లు జరిగాయి. వీటిలో 12 సార్లు ఆ మూడు జట్లే విజేతగా నిలిచాయి. రన్నరప్ లుగానూ మరో 10 సార్లు నిలిచి ఉంటాయి. అలాంటిది ఆ మూడు జట్లు 18వ సీజన్ లో కిందామీద పడుతున్నాయి.
ఐపీఎల్ లో మోస్ట్ సక్సెస్ ఫుల్ జట్టు చెన్నై సూపర్ కింగ్స్. ఐదుసార్లు టైటిల్ కొట్టడమే కాక ఐదుసార్లు రన్నరప్ గానూ నిలిచింది. మరో జట్టు ముంబై ఇండియన్స్ కూడా ఇదే స్థాయిలో ఐదు టైటిల్స్ కొట్టింది. ఒకసారి రన్నరప్ గానూ నిలిచింది. ఇక సన్ రైజర్స్ హైదరాబాద్ ఐపీఎల్ రెండో సీజన్ లోనే (దక్కన్ చార్జర్స్) టైటిల్ కొట్టింది. 2016లోనూ చాంపియన్ అయింది. గత సీజన్ లోనూ రన్నరప్ కూడా.
ప్రస్తుత సీజన్ కు వచ్చేసరికి ఐపీఎల్ లో ఈ మూడు జట్లూ తీవ్రంగా తడబడుతున్నాయి. కేవలం హైదరాబాద్ 6 మ్యాచ్ లలో 2, చెన్నై ఏడు మ్యాచ్ లలో 2 గెలిచాయి. పాయింట్ల పట్టికలో కింది నుంచి ఒకటి, రెండు స్థానాల్లో ఉన్నాయి.
ముంబై ఇండియన్స్ పరిస్థితి కూడా వీటికి భిన్నంగా ఏమీ లేదు. గత ఆదివారం ఢిల్లీతో మ్యాచ్ లో గెలవడంతో సరిపోయింది కానీ, లేదంటే పాయింట్ల పట్టికలో మరీ కింద ఉండేది. ఇప్పటివరకు 6 మ్యాచ్ లు ఆడిన ముంబై 2 మాత్రమే నెగ్గింది. పాయింట్ల పట్టికలో కింది నుంచి నాలుగో స్థానంలో ఉంది.
గురువారం హైదరాబాద్ తమ ఏడో మ్యాచ్ ను ముంబై ఇండియన్స్ తో ముంబై ఆడనుంది. ఇందులో గెలిస్తే మూడో విజయంతో పాయింట్ల పట్టికలో కాస్త పైకి వస్తుంది. ఒకవేళ ముంబై నెగ్గినా ఆ జట్టుకూ ఇది మూడో విజయమే. హైదరాబాద్ కంటే రన్ రేట్ (-1.245) మెరుగ్గా ఉండడం ముంబై (0.104)కి మేలు చేస్తోంది.
హైదరాబాద్ 23న ముంబైతో మరో మ్యాచ్ ఆడనుంది. దీని మధ్యలోనే చెన్నైతో మ్యాచ్ ఉంది. ఇక యాదృచ్ఛికం, ముంబై ఇండియన్స్ రాబోయే మూడు మ్యాచ్ లు సన్‌రైజర్స్ హైదరాబాద్, చెన్నై సూపర్ కింగ్స్ తో ఉన్నాయి.
అటు చెన్నై కూడా వచ్చే రెండు మ్యాచ్ లలో ముంబై, సన్ రైజర్స్ హైదరాబాద్ తోనే ఆడనున్నారు. దీంతో ఈ జట్లలో పైచేయి సాధించేది ఎవరా? అని ఆసక్తి నెలకొంది. ఈ మ్యాచ్ ల షెడ్యూల్, సమయం ప్రకారం మూడు జట్లలో ఏది ముందుకు సాగుతుందో నిర్ణయించాల్సి ఉంది.