ఐపీఎల్-18.. అరెరె.. ఈ మ్యాచ్ విన్నర్లను అనవసరంగా వదులుకున్నారే

కోల్ కతా నైట్ రైడర్స్ (కేకేఆర్)ను పదేళ్ల తర్వాత విజేతగా నిలిపాడు శ్రేయస్ అయ్యర్. కానీ, అతడు ఎక్కువ రేటు అడిగాడని కేకేఆర్ ఫ్రాంచైజీ వదలేసింది.;

Update: 2025-04-04 10:27 GMT

ఆటగాళ్లు ఫ్రాంచైజీలు మారడం ఇండియన్ ప్రీమియర్ లీగ్ (ఐపీఎల్) వంటి మెగా లీగ్ లో చాలా సహజం.. ఫ్రాంచైజీలే ఆటగాళ్లను మారుస్తుండడం కూడా సహజం.. ఎంతో ఆశలు పెట్టుకున్న ఆటగాళ్లు విఫలం అవుతుంటే వారిని వదిలేసుకుంటాయి... కానీ, గత ఏడాది నవంబరులో జరిగిన అనూహ్యంగా కొందరు ఆటగాళ్లను వద్దనుకున్నాయి. అయితే వీరేమీ సాధారణమైనవారు కాదు... మ్యాచ్ విన్నర్లు. అలాంటివారెవరో చూద్దామా?

కప్ తెచ్చిన కెప్టెన్ ను కాదని..

కోల్ కతా నైట్ రైడర్స్ (కేకేఆర్)ను పదేళ్ల తర్వాత విజేతగా నిలిపాడు శ్రేయస్ అయ్యర్. కానీ, అతడు ఎక్కువ రేటు అడిగాడని కేకేఆర్ ఫ్రాంచైజీ వదలేసింది. శ్రేయస్ తో పోల్చితే సాధారణ బ్యాటర్ అయిన వెంకటేశ్ అయ్యర్ కు మాత్రం రూ.23.75 కోట్లు వెచ్చించింది. రూ.2 కోట్లకు తీసుకున్న అజింక్య రహానేను కెప్టెన్ ను చేసింది. శ్రేయస్ ను పంజాబ్ కింగ్స్ రూ.26.75 కోట్ల రెండో రికార్డు ధరకు దక్కించుకుంది. శ్రేయస్ లేని ప్రభావం కోల్ కతాపై స్పష్టంగా కనిపిస్తోంది. నాలుగు మ్యాచ్ లు ఆడి రెండు గెలిచింది. మరోవైపు పంజాబ్ ను శ్రేయస్ అద్భుతంగా నడిపిస్తున్నాడు. టోర్నీ సాగేకొద్దీ కోల్ కతా ఎలా ఆడుతుందో చూడాలి.


దూకుడైన బ్యాటర్ ను వద్దని..

జోస్ బట్లర్.. పరిమిత ఓవర్లలో దూకుడైన బ్యాటర్. అలాంటివాడిని ఏ ఫ్రాంచైజీ వద్దనుకోదు. కానీ, రాజస్థాన్ రాయల్స్ మాత్రం రిటైన్ చేసుకోలేదు. గత సీజన్లలో రాజస్థాన్ తరఫున మంచి ఇన్నింగ్స్ ఆడిన బట్లర్ ను వదులుకోవడం ఆ జట్టు బ్యాటింగ్ లైనప్ ను దెబ్బతీసింది. రాజస్థాన్ మూడు మ్యాచ్ లు ఆడి రెండు ఓడింది. మరోవైపు బట్లర్ ను గుజరాత్ టైటాన్స్ తీసుకుంది. ఆ జట్టు తరఫున అద్భుతంగా రాణిస్తున్నాడు. బ్యాటింగ్ కాస్త బలహీనంగా ఉన్న గుజరాత్ కు బట్లర్ ఇప్పుడు పెద్ద అండ. అయితే, గుజరాత్ కూడా గత సీజన్లలో తమకు బాగా ఉపయోగపడిన దక్షిణాఫ్రికా హిట్టర్ డేవిడ్ మిల్లర్ ను వదులుకోవడం పొరపాటే. మిల్లర్ ను లక్నో సూపర్ జెయింట్స్ కొనుక్కుంది.


వద్దనుకుందా.. వదలించుకుందా..?

హైదరాబాదీ పేసర్ మొహమ్మద్ సిరాజ్ కెరీర్ తొలుత హైదరాబాద్ ఫ్రాంచైజీ సన్ రైజర్స్ (2017)తో మొదలైనా 2018 నుంచి అతడు రాయల్ చాలెంజర్స్ బెంగళూరుకు (ఆర్సీబీ) ఆడుతున్నాడు. అనంతరం టీమ్ ఇండియాకు ఎంపికయ్యాడు. మెగా వేలంలో సిరాజ్ ను బెంగళూరు వద్దనుకుంటే గుజరాత్ రూ.11 కోట్లకు పైగా ధరతో కొనక్కుంది. ఇప్పుడదే సిరాజ్ అద్భుతంగా బౌలింగ్ చేస్తున్నాడు. వాస్తవానికి తీరిక లేని అంతర్జాతీయ క్రికెట్ తో గత సీజన్ లో అలసిపోయి ఉన్న సిరాజ్ సరిగా ప్రదర్శన చేయలేదు. దీంతో బెంగళూరు వద్దనుకుంది. ఇప్పుడు టీమ్ ఇండియా వన్డే జట్టులో చోటు లేకపోవడంతో కాస్త ఫ్రీ అయిన సిరాజ్ గుజరాత్ తరఫున మంచి ప్రదర్శన కనబరుస్తున్నాడు. మొన్న బెంగళూరుపై మ్యాన్ ఆఫ్ ద మ్యాచ్ అతడే కావడం గమనార్హం.


లక్నో సూపర్ జెయింట్స్ కెప్టెన్ గా ఉన్న కేఎల్ రాహుల్ ను ఆ జట్టు ఫ్రాంచైజీ ఓనర్ సంజీవ్ గోయెంకా బహిరంగంగానే నిలదీసినంత పని చేశాడు. దీంతో రాహుల్ లక్నోకు గుడ్ బై చెప్పాడు. ఇప్పుడు ఢిల్లీ క్యాపిటల్స్ కు ఆడుతున్నాడు.


దూకుడుగా ఆడే దక్షిణాఫ్రికా ఓపెనర్ డికాక్ ను లక్నో వదులుకోగా కోల్ కతా దక్కించుకుంది.


ముంబై సైతం దూకుడైన వికెట్ కీపర్ బ్యాట్స్ మన్ ఇషాన్ కిషన్ ను వద్దనుకుంది. కిషన్ ఉండి ఉంటే ముంబైకి బ్యాటింగ్ లో పెద్ద బలం.


Tags:    

Similar News