ఆపరేషన్ సిందూర్ ఎఫెక్ట్.. ఐపీఎల్ మ్యాచ్ వేదిక మార్పు.. నేటి మ్యాచ్?

ఆపరేషన్ సిందూర్ అనంతరం ఉత్తరాది రాష్ట్రాల్లోని పలు ఎయిర్ పోర్ట్ లను మూసివేశారు. దీంతో ఐపీఎల్ మ్యాచ్ ల కోసం ఆటగాళ్లు ప్రయాణించడం ఎలాగన్న ప్రశ్న తలెత్తింది.;

Update: 2025-05-08 11:33 GMT

పెహల్గామ్ ఊచకోతకు ప్రతీకారంగా పాకిస్థాన్ పై భారత్ దాడులకు దిగడం ఆలస్యం.. భారత్ లో జరుగుతున్న ఐపీఎల్ నిర్వహణ గురించి చర్చ వచ్చింది. కారణం.. పాకిస్థాన్ సరిహద్దులోని కొన్ని రాష్ట్రాల్లో ఐపీఎల్ మ్యాచ్ లు జరుగుతుండడమే. ఇలాంటివాటిలో ముఖ్యమైనది ధర్మశాల. హిమాచల్ ప్రదేశ్ లో సుందరమైన హిమాలయాల మధ్య ఉన్న మైదానంలో జరిగే మ్యాచ్ లకు ఆదరణ బాగా ఉంటుంది.

ఆపరేషన్ సిందూర్ అనంతరం ఉత్తరాది రాష్ట్రాల్లోని పలు ఎయిర్ పోర్ట్ లను మూసివేశారు. దీంతో ఐపీఎల్ మ్యాచ్ ల కోసం ఆటగాళ్లు ప్రయాణించడం ఎలాగన్న ప్రశ్న తలెత్తింది.

వరుసగా ఆరు విజయాలతో పాయింట్ల పట్టికలో పైకి దూసుకొచ్చిన ముంబై ఇండియన్స్ (ఎంఐ), ప్లేఆఫ్స్ రేసులో పోటీ పడుతున్న పంజాబ్ కింగ్స్ మధ్య మ్యాచ్ ఈ నెల 11న జరగనుంది. అయితే, ధర్మశాల ఎయిర్ పోర్ట్ మూసివేతతో ఆటగాళ్లు అక్కడకు చేరుకోవడం కష్టం కానుంది.

ధర్మశాల మైదానం పంజాబ్ కింగ్స్ కు సొంత మైదానం. ఇప్పుడు ఆపరేషన్ సిందూర్ కారంణంగా ముంబైతో ఆ జట్టు మ్యాచ్‌ ను గుజరాత్ రాజధాని అహ్మదాబాద్‌ కు మార్చారు.

పంజాబ్–ముంబై మ్యాచ్ ను తమదగ్గర నిర్వహించాలని బీసీసీఐ కోరినట్లు గుజరాత్ క్రికెట్‌ అసోసియేషన్‌ సెక్రటరీ అనిల్‌ పటేల్‌ తెలిపాడు.

ఎలాగూ ముంబై పక్కనే ఉంటుంది కాబట్టి... అహ్మదాబాద్ కు ముంబై ఆటగాళ్లు తేలిగ్గానే చేరుకునే వీలుంది. పంజాబ్ కింగ్స్ ఆటగాళ్లు 9, 10 తేదీల్లో అహ్మదాబాద్ కు వస్తారని భావించవచ్చు.

మరి నేటి మ్యాచ్...?

పంజాబ్ తమ సొంత మైదానం అయిన ధర్మశాలలో గురువారం ఢిల్లీ క్యాపిటల్స్‌ తో ఆడనుంది. ఈ మ్యాచ్‌ లో ఎలాంటి మార్పు లేదు. ఇప్పటికే రెండు జట్ల ఆటగాళ్లు చేరుకోవడంతో సమస్య లేకుండాపోయింది. అయితే, ధర్మశాల మైదానంలో ఫ్లడ్‌ లైట్ల వినియోగంతో ఏమైనా భద్రతా సమస్యలు వస్తాయని భావించారు. అదేమీ లేదని తేలడంతో మ్యాచ్ నిర్వహణకు ఆటంకాలు తొలగాయి.

Tags:    

Similar News