ఐపీఎల్-18 రివ్యూ.. ఆ 3 జట్లు అదరహో.. కొత్త చాంపియన్ ఖాయమా?
ఇక గత సీజన్ రన్నరప్ సన్ రైజర్స్ హైదరాబాద్ గురించి ప్రత్యేకంగా చెప్పేది ఏముంది..? 300 కొట్టేస్తుందని అనుకున్నారు. కానీ, ఇవేమీ నిజం కాలేదు.;
ఐదేసి టైటిల్స్ కొట్టిన చెన్నై సూపర్ కింగ్స్, ముంబై ఇండియన్స్.. మూడుసార్లు టైటిల్ సాధించిన కోల్ కతా నైట్ రైడర్స్.. ఈ మూడు జట్లు ఐపీఎల్-18లో గెలుపు కోసం మొహం వాచి ఉన్నాయి..
ఒక్కసారి కూడా టైటిల్ కూడా కొట్టని రాయల్ చాలెంజర్స్ బెంగళూరు (ఆర్సీబీ), ఢిల్లీ క్యాపిటల్స్ (డీసీ), పంజాబ్ కింగ్స్ మాత్రం దూసుకెళ్తున్నాయి.
ఓడలు బండ్లు బండ్లు ఓడలు కావడం అంటే ఇదేనేమో..? ఇండియన్ ప్రీమియర్ లీగ్ 18వ సీజన్ ప్రారంభానికి ముందు ముంబై, చెన్నైలను హాట్ ఫేవరెట్ లుగా చూశారు. గత సీజన్లలో వెనుకబడినా వీటికి ఉన్న స్టార్ డమ్ అలా చేసింది.
ఇక డిఫెండింగ్ చాంపియన్ కోల్ కతా నైట్ రైడర్స్ పైనా పెద్దఎత్తునే అంచనాలున్నాయి. ఇక గత సీజన్ రన్నరప్ సన్ రైజర్స్ హైదరాబాద్ గురించి ప్రత్యేకంగా చెప్పేది ఏముంది..? 300 కొట్టేస్తుందని అనుకున్నారు. కానీ, ఇవేమీ నిజం కాలేదు.
మరీ పేలవం ఏమంటే.. టైటిల్ ఫేవరెట్లు చెన్నై, ముంబై, హైదరాబాద్ దారుణంగా ఆడుతున్నాయి. పాయింట్ల పట్టికలో అట్టడుగున ఉంటూ పైకి రాలేకపోతున్నాయి.
ఐపీఎల్ 30 శాతం పూర్తయింది. అన్ని జట్లు ఐదేసి మ్యాచ్ లు ఆడాయి. మరి ఇప్పటివరకు ఉన్న ఫలితాలను చూస్తే.. అనూహ్యంగా గుజరాత్ టైటాన్స్ టాప్ లో కనిపిస్తోంది. తొలి సీజన్ (2022)లోనే టైటిల్ కొట్టి రెండో సీజన్ లో త్రుటిలో టైటిల్ చేజార్చుకున్న గుజరాత్ మళ్లీ ఫామ్ లోకి వచ్చింది.
ఇక 2008 నుంచి ఐపీఎల్ ఆడుతున్నప్పటికీ ఒక్కసారీ టైటిల్ కొట్టని ఢిల్లీ, బెంగళూరుతో పాటు పంజాబ్ ఇప్పుడు పాయింట్ల పట్టికలో 2, 3, 4 స్థానాల్లో ఉన్నాయి. కొత్త కెప్టెన్లు అక్షర్ పటేల్, శ్రేయస్ అయ్యర్ సారథ్యంలో ఢిల్లీ, పంజాబ్ ఈ సీజన్ లో బాగా ఆడుతున్నాయి.
టైటిల్ గెలవకున్నా ప్రేక్షకుల అభిమాన జట్లలో ఒకటైన బెంగళూరు కూడా కూల్ గా ముందుకెళ్తోంది. విచిత్రంగా ఈ జట్టుకూ కెప్టెన్ (రజిత్ పటీదార్) కొత్తవాడే.
ఇప్పటివరకు ఉన్న జోష్ కొనసాగితే.. గుజరాత్, బెంగళూరు, ఢిల్లీ, పంజాబ్ నాకౌట్ చేరడం ఖాయం. ఆపై గుజరాత్ గనుక ఔట్ అయి.. ఫైనల్స్ ఏ రెండు కొత్త జట్లు చేరినా.. కొత్త చాంపియన్ ను చూడడం ఖాయం.