ఈసారి నిజంగా ‘ఇండియన్’ ప్రీమియర్ లీగే.. ఇవిగో సాక్ష్యాలు

ఒకప్పుడు జాతీయ క్రికెట్ జట్లకు ఎంపిక కావాలంటే ఆయా దేశాల దేశవాళీ పోటీల్లో రాణించాలి.;

Update: 2025-05-19 20:30 GMT

ఒకప్పుడు జాతీయ క్రికెట్ జట్లకు ఎంపిక కావాలంటే ఆయా దేశాల దేశవాళీ పోటీల్లో రాణించాలి. ఇలా సంవత్సరాల తరబడి ఆడినా ఫలితం దక్కుతుందనే నమ్మకం ఉండేది కాదు. ఇప్పుడు మాత్రం ఒకే ఒక్క సీజన్ ఇండియన్ ప్రీమియర్ లీగ్ (ఐపీఎల్)లో దంచికొడితే లేదా వికెట్లు తీస్తే చాలు ఏ దేశమైనా తమ జాతీయ జట్లలోకి తీసేసుకుంటుంది. ప్రపంచ క్రికెట్ ను ఐపీఎల్ కు ముందు ఐపీఎల్ తర్వాత అని చెప్పాలి. మరోవైపు తమ దేశ క్రికెట్ ను ఐపీఎల్ దెబ్బతీస్తోందనే ఫిర్యాదులు మొదట్లో చాలా ఉన్నాయి. ఇప్పుడు అవన్నీ పక్కకుపోయాయి.

ప్రస్తుత సీజన్ ఐపీఎల్ గురించి చెప్పాల్సి వస్తే.. ఎన్నో మార్పులతో మొదలైంది. సంచలనాలతో సాగింది. అండర్ డాగ్స్, ఫెయిల్యూర్ జట్లగా ముద్రపడిన జట్లు అద్భుతంగా ఆడుతున్నాయి. ఎవరూ ఊహించని విధంగా చరిత్రలో తొలిసారి యుద్ధం పరిస్థితుల కారణంగా ఆగిపోయింది. గత శనివారం నుంచి తిరిగి మొదలైంది.

ఐపీఎల్ 18 సీజన్ ఇండియాకు ఏమిచ్చిందనేది చూస్తే.. చాలా ఉంది. ఈ సీజన్ లో భారత ప్లేయర్ల హవా అంతగా సాగుతోంది.

టాప్-5 స్కోరర్స్ మనవాళ్లే..

గతంలో ఐపీఎల్ లో టాప్ స్కోరర్లను చూస్తే విదేశీయులే ఎక్కువగా ఉండేవారు. విరాట్ కోహ్లి వంటి వారు తప్ప మిగతా ఆటగాళ్లు టాప్ 5లో నిలిచింది తక్కువే. ఈసారి మాత్రం టాప్ -5 రన్స్ స్కోరర్స్ లో అందరూ ఇండియన్సే. గుజరాత్ ఓపెనర్లు సాయి సుదర్శన్ (12 మ్యాచ్ లలో 617 పరుగులు), కెప్టెన్ శుభ్ మన్ గిల్ (12 మ్యాచ్ లలో 601), రాజస్థాన్ రాయల్స్ ఓపెనర్ యశస్వి జైశ్వాల్ (13 మ్యాచ్ లలో 523), ముంబై బ్యాటర్ సూర్యకుమార్ యాదవ్ (12 మ్యాచ్ లలో 510), రాయల్ చాలెంజర్స్ బెంగళూరు స్టార్ బ్యాటర్ విరాట్ కోహ్లి (11 మ్యాచ్ లలో 505) పరుగులు చేశారు. ఈ ఐదుగురిలోనే ఆరెంజ్ క్యాప్ (అత్యధిక పరుగులకు ఇచ్చేది) ఒకరికి దక్కడం ఖాయం. విదేశీ బ్యాటర్లలో ఇంగ్లండ్ కు చెందిన జాస్ బట్లర్ (12 మ్యాచ్ లలో 500) ఆరో స్థానంలో ఉన్నాడు. గుజరాత్ కు ఆడుతున్న బట్లర్ ప్లేఆఫ్స్ తర్వాత ఇంగ్లండ్ వెళ్లిపోతున్నాడు.

టాప్ 5 వికెట్ టేకర్స్ కూడా...

బౌలర్లలో గుజరాత్ టైటాన్స్ పేసర్ ప్రసిద్ధ్ క్రిష్ణ 12 మ్యాచ్ లలో 21 వికెట్లతో టాప్ లో కొనసాగుతున్నాడు. గుజరాత్ ప్లేఆఫ్స్ చేరడం, ప్రసిద్ధ్ ఫామ్ ను బట్టి చూస్తే అతడికే పర్పుల్ క్యాప్ (అత్యధిక వికెట్లకు ఇచ్చేది) దక్కుతుంది. అయితే, బౌలర్లలో ప్రసిద్ధ్ తప్ప టాప్-5లో ఉన్న ఇండియన్ కోల్ కతా నైట్ రైడర్స్ స్పిన్నర్ వరుణ్ చక్రవర్తి (12 మ్యాచ్ లలో 17 వికెట్లు) మాత్రమే. ఇతడి కంటే ముందు.. చెన్నై సూపర్ కింగ్స్ స్పిన్నర్ నూర్ అహ్మద్ (12 మ్యాచ్ లలో 20 వికెట్లు), బెంగళూరు పేసర్ హేజిల్ వుడ్ (10 మ్యాచ్ లలో 18 వికెట్లు), ముంబై ఇండియన్స్ పేసర్ ట్రెంట్ బౌల్ట్ (12 మ్యాచ్ లలో 18 వికెట్లు) ఉన్నారు. ఆరో స్థానంలో పంజాబ్ కింగ్స్ పేసర్ అర్షదీప్ సింగ్ (12 మ్యాచ్ లలో 16 వికెట్లు) ఉన్నాడు. పంజాబ్ ప్లేఆఫ్స్ చేరింది కాబట్టి అర్షదీప్ మరిన్ని వికెట్లు తీసి దూసుకొస్తాడేమో చూడాలి.

Tags:    

Similar News