ఐపీఎల్-19... 2 ఫ్రాంచైజీలకు కొత్త కెప్టెన్లుగా టీమ్ఇండియా స్టార్లు
టీమ్ ఇండియా టి20 వికెట్ కీపర్ బ్యాట్స్ మన్ సంజూ శాంసన్ కొన్నేళ్లుగా రాజస్థాన్ రాయల్స్ కు ఆడుతున్నాడు. ప్రస్తుతం అతడే కెప్టెన్ కూడా.;
ఇండియన్ ప్రీమియర్ లీగ్ 19వ సీజన్ కు మినీ వేలం దగ్గరపడుతున్న కొద్దీ ఒక్కో కీలక విషయం బయటకు వస్తోంది. వచ్చే సీజన్ కు సంబంధించి సన్ రైజర్స్ హైదరాబాద్ డాషింగ్ ఓపెనర్ అభిషేక్ శర్మకు రూ.30 కోట్ల వరకు ధర పలుకుతుందని ఇటీవల కథనాలు వచ్చాయి. ఇప్పుడు మరో సంచలన విషయం బయటకు వచ్చింది. 19వ సీజన్ లో రెండు జట్లకు కెప్టెన్లు మారనున్నట్లు సమాచారం. వీటిలో ఒకటి మూడుసార్లు చాంపియన్ జట్టు కాగా, మరొకటి ఇటీవలి కాలంలో బలంగా పుంజుకొన్న టీమ్.
వరుసగా రెండో ఏడాదీ..
టీమ్ ఇండియా స్టార్ ఓపెనర్ కేఎల్ రాహుల్ ఇటీవలి కాలంలో సూపర్ ఫామ్ లో ఉన్నాడు. ఇంగ్లండ్ తో ఐదు టెస్టుల సిరీస్ లో 400 పైగా పరుగులు సాధించాడు. తాజాగా వెస్టిండీస్ తో టెస్టుల్లోనూ సెంచరీ కొట్టాడు. వన్డే జట్టులో రాహుల్ ది వికెట్ కీపర్ కమ్ బ్యాటర్ పాత్ర. అలాంటి రాహుల్ గత సీజన్ వరకు లక్నో సూపర్ జెయింట్స్ కెప్టెన్ గా కొనసాగాడు. జట్టు ఓటమికి అతడిని బాధ్యుడిని చేస్తూ.. ఫ్రాంచైజీ యాజమాన్యం వ్యవహరించిన తీరు విమర్శలకు తావిచ్చింది. దీంతో రాహుల్ ఈ ఏడాది ఢిల్లీ క్యాపిటల్స్ కు వచ్చాడు. జట్టు ఓపెనర్ గా మంచి ఇన్నింగ్స్ ఆడాడు. అయితే, వచ్చే సీజన్ కు రాహుల్ ను కోల్ కతా నైట్ రైడర్స్ (కేకేఆర్) తీసుకుంటుందని వార్తలు వస్తున్నాయి. ఈ ఏడాది సీజన్ లో కేకేఆర్ కు టీమ్ ఇండియా మాజీ బ్యాటర్ అజింక్య రహానే నాయకత్వం వహించాడు. డిఫెండింగ్ చాంపియన్ గా బరిలో దిగిన జట్టు మెరుగైన ఫలితాలు సాధించలేకపోయింది. రాహుల్ ను గనుక కేకేఆర్ ఎంచుకుంటే అతడికే కెప్టెన్సీ ఇస్తుందని వేరే చెప్పాల్సిన పనిలేదు.
ఈసారి మార్పు ఖాయమేనా..??
టీమ్ ఇండియా టి20 వికెట్ కీపర్ బ్యాట్స్ మన్ సంజూ శాంసన్ కొన్నేళ్లుగా రాజస్థాన్ రాయల్స్ కు ఆడుతున్నాడు. ప్రస్తుతం అతడే కెప్టెన్ కూడా. అయితే, ఫ్రాంచైజీ కోచ్, దిగ్గజ ఆటగాడు రాహుల్ ద్రవిడ్ తో సంజూకు అభిప్రాయ భేదాలు వచ్చాయని రకరకాలుగా చెప్పుకొన్నారు. దీంతో సంజూ శాంసన్ రాజస్థాన్ ను వీడి వెళ్తాడని అన్నారు. అతడి కోసం మాజీ చాంపియన్ చెన్నై సూపర్ కింగ్స్ (సీఎస్కే) ప్రయత్నాలు చేస్తున్నట్లుగా కూడా చెప్పుకొచ్చారు. కానీ, తాజా కథనాల ప్రకారం సంజూను ఢిల్లీ క్యాపిటల్స్ తీసుకుని.. ఆల్ రౌండర్ అక్షర్ పటేల్ స్థానంలో అతడికి కెప్టెన్సీ ఇస్తుందని అంటున్నారు.
నాలుగు జట్లకు కెప్టెన్లు మారుతారా?
వచ్చే ఐపీఎల్ సీజన్ కు రాజస్థాన్ రాయల్స్ (ఆర్ఆర్), కేకేఆర్ తో పాటు చెన్నై, ఢిల్లీలకూ కెప్టెన్లు మారుతారని అనుకోవాల్సి ఉంటుంది. వీటిలో కేకేఆర్ కు వరుసగా మూడో ఏడాది కొత్త కెప్టెన్ వస్తున్నట్లు అవుతుంది. చెన్నైకు మాత్రం యువ బ్యాటర్ రుతురాజ్ గైక్వాడ్ సారథిగా ఉంటాడా? దిగ్గజం ధోనీని ఆ బాధ్యతల్లో కొనసాగిస్తారా? అన్నది చూడాలి.