డబ్ల్యూపీఎల్ వేలం.. శ్రీచరణికి బొనాంజా.. దీప్తికి భారీ ధమాకా
అత్యంత స్ఫూర్తిదాయక ఆటతో భారత అమ్మాయిలు విజేతలుగా నిలవడం.. ఇటీవలి వన్డే ప్రపంచ కప్ అనంతరం భారత్ లో మహిళా క్రికెట్ పట్ల ప్రజల్లో ఆసక్తి పెరిగింది.;
అత్యంత స్ఫూర్తిదాయక ఆటతో భారత అమ్మాయిలు విజేతలుగా నిలవడం.. ఇటీవలి వన్డే ప్రపంచ కప్ అనంతరం భారత్ లో మహిళా క్రికెట్ పట్ల ప్రజల్లో ఆసక్తి పెరిగింది. ఒకప్పుడు మహిళల క్రికెట్ మ్యాచ్ వస్తుంటే ఆ... ఏం చూస్తాం లేం అని టీవీలు బంద్ చేసినవారు ఇప్పుడు మళ్లీ అమ్మాయిల మ్యాచ్ ఎప్పుడు? అని మహా ఉత్సుకత చూపిస్తున్నారు. ఇలాంటి సమయంలో మహిళల ప్రీమియర్ లీగ్ (డబ్ల్యూపీఎల్) రూపంలో త్వరలో జరగనున్న లీగ్ పట్ల ఉత్సాహంగా ఉన్నారు. పురుషుల క్రికెట్ లోని ఇండియన్ ప్రీమియర్ లీగ్ (ఐపీఎల్) స్థాయిలో గురువారం జరుగుతున్న డబ్ల్యూపీఎల్ ఆటగాళ్ల వేలం ఆసక్తి రేపింది. జనవరి 9 నుంచి లీగ్ జరగనుందని అధికారికంగా వెల్లడైంది. పూర్తి స్థాయిలో షెడ్యూల్ విడుదల కావాల్సి ఉంది. ఇప్పటివరకు మూడు సీజన్లు జరగ్గా రెండుసార్లు ముంబై ఇండియన్స్ కప్ గెలుచుకుంది. రెండో సీజన్ లో రాయల్ చాలెంజర్స్ బెంగళూరు విజేతగా నిలిచింది. నాలుగో సీజన్ కు సంబంధించి ఢిల్లీలో వేలం నిర్వహించారు. ఇందులో రికార్డు స్థాయిలో భారత స్టార్ ఆల్ రౌండర్ దీప్తిశర్మకు రూ.3.20 కోట్లు ధర పలికింది. వన్డే ప్రపంచ కప్ లో అద్భుత ప్రదర్శన చేసిన దీప్తి (215 పరుగులు, 22 వికెట్లు) ప్లేయర్ ఆఫ్ ద టోర్నీగా నిలిచిన సంగతి తెలిసిందే. వాస్తవానికి గత సీజన్ డబ్ల్యూపీఎల్ లో ఈమె యూపీ వారియర్స్ కే ప్రాతినిధ్యం వహించింది. కానీ, వేలంలో రూ.50 లక్షల కనీస ధరకు ఆ ఫ్రాంచైజీ విడుదల చేసింది. ఇదే ధరకు కొనుగోలుకు ఢిల్లీ ముందుకురాగా.. యూపీ పోటీకి దిగి ఆర్టీఎం కార్డు ఉపయోగించింది. ఢిల్లీ తన బిడ్ ను రూ.3.20 కోట్లకు పెంచింది. ఇదే మొత్తాన్ని యూపీ చెల్లించి దీప్తిని అట్టిపెట్టుకుంది. ఇప్పటివరకు వేలంలో స్మృతి మంధానకు పలికిన రూ.3.40 కోట్ల ధర (బెంగళూరు)నే అత్యధికం. తాజాగా దీప్తి శర్మ రూ.3.20 కోట్లతో చాలా దగ్గరగా వచ్చి రెండోస్థానంలో నిలిచింది. వేలంలో మొత్తం 277 మంది క్రికెటర్లకు గాను 194 మంది ఇండియన్స్, మొత్తం 73 స్లాట్లు (23 విదేశీ ప్లేయర్ల స్లాట్లు) ఖాళీగా ఉన్నాయి.
తెలుగమ్మాయి తడాఖా
ఏపీలోని కడప జిల్లాకు చెందిన స్పిన్నర్ శ్రీచరణికి వేలంలో రూ.1.30 కోట్లు ధర దక్కింది. ఈమె కనీస ధర రూ.30 లక్షలే. ప్రపంచ కప్ లో ప్రదర్శనతో శ్రీచరణి వెలుగులోకి వచ్చింది. దీంతో ఢిల్లీ, యూపీ ఫ్రాంచైజీలు పోటీకి దిగాయి. ఢిల్లీనే చివరకు వేలంలో సొంతం చేసుకుంది.
దక్షిణాఫ్రికా కెప్టెన్ కు 1.10 కోట్లు
దక్షిణాఫ్రికా కెప్టెన్, ప్రపంచ కప్ లో రికార్డు స్థాయిలో పరుగులు చేసిన లారా వోల్వార్డ్ రూ.30 లక్షల కనీస ధర కాగా.. బెంగళూరు, ఢిల్లీ పోటీ పడ్డాయి. రూ.1.10 కోట్లతో ఢిల్లీ తీసుకుంది. ఆస్ట్రేలియా క్రికెటర్ మెగ్ లానింగ్ కు రూ.1.90 కోట్లు (యూపీ), కివీస్ ఆల్ రౌండర్ అమేలియా కెర్ కు రూ.3 కోట్ల (ముంబై) ధర దక్కింది. కివీస్ కే చెందిన సోఫీ డివైన్ ను రూ.2 కోట్లకు గుజరాత్ తీసుకుంది.
-వేలంలో ఒక్కోసారి ఒక్కొక్కరికి లక్ కలిసిరాదేమో? ఆస్ట్రేలియా వంటి మేటి జట్టుకు మేటి క్రికెటర్ గా ఉన్న అలీసా హీలిని రూ.50 లక్షల బేస్ ప్రైస్ కు కూడా ఎవరూ కొనలేదు.
-భారత స్టార్లు జెమీమా రోడ్రిగ్స్ (రూ.2.2 కోట్లు), షెఫాలీ వర్మ (2.2 కోట్లు)లను ఢిల్లీ రిటైన్ చేసుకుంది. బెంగళూరు రూ.3.5 కోట్లకు స్మృతి మంధానను రిటైన్ చేసుకుంది.