సంచలనం.. ఇంగ్లండ్‌ జట్టులో కెప్టెన్‌ స్టోక్స్‌ స్థానంలో గుజరాతీ కుర్రాడు!

ఇంగ్లండ్‌ కెప్టెన్‌ బెన్‌ స్టోక్స్‌ స్థానంలో మ్యాచ్‌ నాలుగో రోజు సబ్‌స్టిట్యూట్‌గా వ్యవహరించాడు యశ్‌ వగాడియా.;

Update: 2025-06-25 23:30 GMT

నాసిర్‌ హొస్సేన్‌.. రవి బొపారా.. మాంటీ పనేసర్‌..! ఇప్పటివరకు ఇంగ్లండ్‌కు ఆడిన భారత సంతతి క్రికెటర్లు.. వీరిలో నాసిర్‌ హొస్సేన్‌ అయితే ఇంగ్లండ్‌కు కెప్టెన్‌గానూ వ్యవహరించాడు. ఇక పాకిస్థాన్‌ సంతతికి చెందిన మొయిన్‌ అలీ, ఆదిల్‌ రషీద్‌, రేహాన్‌ అహ్మద్‌, సకిబ్‌ మొహమ్మద్‌.. తదితరులు ఇంగ‍్లండ్‌ జాతీయ జట్టుకు ప్రాతినిధ్యం వహించారు. కానీ, పక్కా గుజరాతీ మూలాలున్న.. ఓ భారత సంతతి కుర్రాడు ఇప్పుడు ఏకంగా ఇంగ్లండ్‌ కెప్టెన్‌ బెన్‌ స్టోక్స్‌ స్థానంలోకి వచ్చాడు.

దిగ్గజ ఆటగాళ్లయిన రోహిత్‌ శర్మ, విరాట్‌ కోహ్లి రిటైర్మెంట్‌అనంతరం కొత్త కెప్టెన్‌.. కొత్త బ్యాటింగ్‌ లైనప్‌తో ఇంగ్లండ్‌ వెళ్లిన టీమ్‌ ఇండియా లీడ్స్‌లో జరిగిన తొలి టెస్టులో బాగానే ఆడింది. నాలుగు రోజుల పాటు పైచేయి సాధించింది. కానీ, చివరి రోజు ఆధిక్యాన్ని చేజార్చుకుంది. ఓటమితో సరిపెట్టుకుంది. ఇది బాధాకర ఫలితమే. కానీ, దీని ద్వారా కొంత మంచే జరిగిందని అనుకోవాలి. మన లోపాలు ఏమిటో తెలిసొచ్చింది. ఇక ఈ టెస్టులో మరో విచిత్రం కూడా జరిగింది. అదేమంటే.. ఓ గుజరాతీ కుర్రాడు తళుకు‍్కన్న మెరిశాడు.

ఇంగ్లండ్‌ కెప్టెన్‌ బెన్‌ స్టోక్స్‌ స్థానంలో మ్యాచ్‌ నాలుగో రోజు సబ్‌స్టిట్యూట్‌గా వ్యవహరించాడు యశ్‌ వగాడియా. కౌంటీ క్రికెట్‌లో యార్క్‌షైర్‌కు ఆడే.. వగాడియా భారత రెండో ఇన్నింగ్స్‌లో ఏడో ఓవర్ తర్వాత స్టోక్స్ మైదానం నుంచి కొద్దిసేపు బయటకు వెళ్లగా సబ్‌ స్టిట్యూట్‌గా వచ్చాడు. వాస్తవం ఏమంటే.. ఈ టెస్ట్ కోసం ఇంగ్లాండ్ అధికారిక జట్టులో యష్‌ లేడు. అయితే, స్టోక్స్ మైదానం వీడడం, ఇతర ఆటగాళ్లు అందుబాటులో లేకపోవడంతో వగాడియాను మైదానంలోకి దింపాల్సి వచ్చింది.

21 ఏళ్ల కుడిచేతి వాటం బ్యాట్స్‌మన్-ఆఫ్ స్పిన్నర్‌ అయిన యశ్‌ వగాడియా.. భవిష్యత్‌ క్రికెటర్‌గా పేరుతెచ్చుకున్నాడు. యార్క్‌షైర్‌కు ఇప్పటికే ప్రాతినిధ్యం వహించాడు. వగాడియా తల్లిదండ్రులు చాలా ఏళ్ల కిందటే బ్రిటన్‌ వెళ్లి స్థిరపడ్డారు. బ్రిటన్‌ పౌరసత్వం ఉన్న వగాడియా.. త్వరలో ఆ దేశ జాతీయ జట్టుకు ఆడే అవకాశం కూడా ఉందని అంచనా వేస్తున్నారు.

అంతర్జాతీయ క్రికెట్ ఎలా ఉంటుంది..? దానికి అవసరమైన సన్నాహాలు ఏమిటి..? ఒత్తిడిని ఎలా ఎదుర్కొంటారు..? వ్యూహాలు ఎలా ఉంటాయి? తదితరాలు తెలుసుకునేందుకు ఇంగ్లండ్‌ క్రికెట్‌ బోర్డు ఇలా కొందరు కుర్రాళ్లను జాతీయ జట్టు వెంట ఉంచుతోంది. తాజాగా లీడ్స్‌ టెస్టులో జావాద్‌ అక్తర్‌ (పాక్‌ సంతతి), నోహ్‌ కెల్లీ, యష్‌ వగాడియాలకు అవకావం వచ్చింది. ఈ ముగ్గురిలోనూ యష్‌ను స్టోక్స్‌కు ప్రత్యామ్నాయంగా ఫీల్డింగ్‌ చేసే అవకాశం వరించడం గమనార్హం.

Tags:    

Similar News