200 ఏళ్ల ‘లార్డ్స్..’ ఎన్నో ప్రత్యేకతలు.. మరెన్నో ఘనతలు
క్రికెట్ పుట్టిల్లు అని ఇంగ్లండ్ గురించి చెబుతారు. ఇంకా వివరంగా చెప్పాలంటే లార్డ్స్ మైదానమే క్రికెట్ పుట్టిల్లు.;
ఐదు వన్డే ప్రపంచ కప్ ఫైనల్స్, మూడు టెస్టు చాంపియన్ షిప్ ఫైనల్స్ జరిగిన ఒకే ఒక వేదిక.. వందల ఏళ్ల కిందటే టెస్టు మ్యాచ్ వేదిక.. అక్కడ సెంచరీ కొడితే బ్యాట్స్ మన్ జన్మ ధన్యం.. ఐదు వికెట్లు తీస్తే బౌలర్ కు గొప్ప ఘనత..
2002లో ఓ గ్రౌండ్ బాల్కనీలో టీమ్ ఇండియా కెప్టెన్ సౌరభ్ గంగూలీ తన జెర్సీ విప్పి గాల్లోకి తిప్పిన సీన్ గుర్తుందా..? భారత క్రికెట్ అభిమానులు ఎప్పటికీ మర్చిపోని సీన్ అది. ఇదంతా ప్రఖ్యాత లార్డ్స్ క్రికెట్ మైదానం గురించి.
క్రికెట్ పుట్టిల్లు అని ఇంగ్లండ్ గురించి చెబుతారు. ఇంకా వివరంగా చెప్పాలంటే లార్డ్స్ మైదానమే క్రికెట్ పుట్టిల్లు. ఈ స్టేడియంలో మ్యాచ్ జరుగుతుంటే చూడడం ఓ అందమైన అనుభవం. 200 ఏళ్లకు పైగా చరిత్ర ఉన్న లార్డ్స్ గ్రౌండ్ లో గురువారం నుంచి టీమ్ ఇండియా-ఇంగ్లండ్ మధ్య మూడో టెస్టు జరగనుంది.
మెరిల్ బోన్ క్రికెట్ క్లబ్ (ఎంసీసీ).. క్రికెట్ రూల్స్ తయారుచేసే ఈ క్లబ్ లార్డ్స్ లోనే ఉంది. లాంగ్ రూమ్ తో కూడిన లార్డ్స్ పెవిలియన్ మరింత స్పెషల్. ఇక్కడకు ఎంసీసీ సభ్యులు, ఆహ్వానితులకే ప్రవేశం. లాంగ్ రూమ్ లో దిగ్గజాల పెయింటింగ్స్ ఉంటాయి. ఆటగాళ్లు గ్రౌండ్ లోకి వస్తున్నప్పుడు, లాంగ్ రూమ్ లోకి వెళ్తున్నప్పుడు ప్రేక్షకులు చప్పట్లు కొడుతూ ఉంటారు.
ఆస్ట్రేలియా-ఇంగ్లండ్ హోరాహోరీగా పోరాడే యాషెస్ కప్ గురించి తెలుసు కదా..? అసలైన యాషెస్ కప్ ఎంసీసీ మ్యూజియంలోనే ఉంది. క్రీడల్లో అత్యంత పురాతనమైన ఎంసీసీ లైబ్రరీలో క్రికెట్ కు సంబంధించిన ఎన్నో ఏళ్ల పత్రికలు, పుస్తకాలు ఉంటాయి.
లార్డ్స్ లో గురువారం నుంచి ఇంగ్లండ్-భారత్ మధ్య మూడో టెస్టు మ్యాచ్ జరగనుంది. ఐదు టెస్టుల సిరీస్ లో 1-1తో రెండు జట్లు సమంగా ఉన్నాయి. దీంతో మూడో టెస్టు కీలకంగా మారింది.
లార్డ్స్ పిచ్ పేస్ బౌలర్లకు బాగా ఉపకరిస్తుంది. గత నెలలో ఆస్ట్రేలియా-దక్షిణాఫ్రికా మధ్య ప్రపంచ టెస్టు చాంపియన్ షిఫ్ (డబ్ల్యూటీసీ) ఇక్కడే జరిగింది.
మరి లార్డ్స్ లో జరిగే మూడో టెస్టులో గెలుపు టీమ్ ఇండియాదా? ఇంగ్లండ్ దా?