నితీశ్.. ఇక కష్టమే..? దక్షిణాఫ్రికాతో టి20 సిరీస్ నుంచి ఔట్
పేస్ బౌలింగ్ ఆల్ రౌండర్ గా టీమ్ ఇండియాలోకి దూసుకొచ్చి అందరినీ ఆశ్చర్యపరిచాడు విశాఖపట్టణంకు చెందిన తెలుగు కుర్రాడు నితీశ్ కుమార్ రెడ్డి.;
పేస్ బౌలింగ్ ఆల్ రౌండర్ గా టీమ్ ఇండియాలోకి దూసుకొచ్చి అందరినీ ఆశ్చర్యపరిచాడు విశాఖపట్టణంకు చెందిన తెలుగు కుర్రాడు నితీశ్ కుమార్ రెడ్డి. బ్యాటింగ్ లో హిట్టింగ్ చేయగల సామర్థ్యంతో పాటు బౌలింగ్ లో మీడియం పేస్ వేయగల నితీశ్ నిరుడు బంగ్లాదేశ్ పై టి20 సిరీస్ లో ఆకట్టుకున్నాడు. అంతే.. ఆ వెంటనే ఆస్ట్రేలియాతో టెస్టు సిరీస్ కూ ఎంపికయ్యాడు. ఏకంగా సెంచరీ కూడా కొట్టేశాడు. ఆస్ట్రేలియా గడ్డపై ఈ రికార్డును సాధించిన అతికొద్దిమంది క్రికెటర్ల జాబితాలో చేరాడు. దీంతో ఇక అతడి అంతర్జాతీయ కెరీర్ వెలిగిపోతుందని అందరూ ఆశించారు. టీమ్ ఇండియాకు మంచి క్రికెటర్ దొరికాడని కూడా భావించారు. కానీ, అనుకున్నట్లు జరిగితే అది జీవితం ఎందుకు అవుతుంది? ఇప్పుడదే పరిస్థితి నితీశ్‌కుమార్ రెడ్డికి ఎదురైంది. టెస్టుల్లోనే చోటు స్థిరం చేసుకున్నాడని భావించిన నితీశ్.. టి20ల నుంచి కూడా ఔట్ అయ్యాడు. దక్షిణాఫ్రికాతో టి20 సిరీస్ కు ప్రకటించిన జట్టులో చోటు కోల్పోయాడు.
హార్దిక్ తిరిగొచ్చాడు..
దక్షిణాఫ్రికాతో ఈ నెల 9న కటక్ లో తొలి టి20 ఆడనుంది. 11న ముల్లాన్ పూర్, 14 ధర్మశాల, 17న లక్నో, 19న అహ్మదాబాద్ లో మ్యాచ్ లు జరగనున్నాయి. బుధవారం ప్రకటించిన జట్టుకు సూర్యకుమార్ యాదవ్ కెప్టెన్. కాగా,
వైస్ కెప్టెన్ శుబ్ మన్ గిల్ ను కూడా ఎంపిక చేశారు. దక్షిణాఫ్రికాతో తొలి టెస్టులో మెడ నొప్పితో గిల్ మధ్యలోనే తప్పుకొన్నాడు. వన్డేల్లో కెప్టెన్ అయినప్పటికీ.. గాయం కారణంగా సిరీస్ కు ఎంపిక చేయలేదు. టి20 సిరీస్ కు మాత్రం గిల్ కు చోటిచ్చారు. అతడు ఫిట్ నెస్ నిరూపించుకోవాల్సి ఉంది. స్టార్ ఆల్ రౌండర్ హార్దిక్ పాండ్యా తిరిగి టి20 జట్టులోకి వచ్చాడు. ఆసియా కప్ ఫైనల్లో గాయంతో అతడు ఆడలేదు. అప్పటినుంచి వన్డేలు, టి20 జట్టుకు పాండ్యా దూరంగా ఉన్నాడు.
నితీశ్ కు కష్టకాలమే..
సమాజ్ వాదీ పార్టీ ఎంపీతో వివాహం నిశ్చయమైన హిట్టర్ రింకూ సింగ్ తో పాటు నితీశ్ కుమార్ రెడ్డిని దక్షిణాఫ్రికాతో టి20 సిరీస్ కు ఎంపిక చేయలేదు. రింకూకు వ్యక్తిగత కారణాలు ఉన్నా.. నితీశ్ కు మాత్రం కష్టకాలమే అని చెప్పొచ్చు. ఇటీవలి దక్షిణాఫ్రికాతో రెండో టెస్టులో నితీశ్ విఫలమయ్యాడు. వన్డే జట్టులో ఉన్నా తుది జట్టులో చోటు దక్కడం లేదు. ఇప్పుడు టి20 జట్టుకు కూడా తీసుకోలేదు. అసలే తరచూ గాయాల బారిన పడే నితీశ్ కు ఫిట్ నెస్ సమస్యలున్నాయి. ఇప్పుడు పెద్దగా రాణించడం లేదు కూడా. దీంతో అతడు దేశవాళీల్లో అసాధారణంగా ఆడితేనే మళ్లీ టీమ్ ఇండియా టి20 జట్టులోకి వచ్చే అవకాశం ఉంది.