వ‌న్డే టాస్ లాస్@ 20..! కోహ్లి సెంచ‌రీ@ 53.. రుతురాజ్ @1

ద‌క్షిణాఫ్రికాతో ఛ‌త్తీస్ గ‌ఢ్ రాజ‌ధాని రాయ్ పూర్ లో జ‌రుగుతున్న రెండో వ‌న్డేలో టీమ్ ఇండియా బ్యాట్స్ మెన్ చెల‌రేగి ఆడారు.;

Update: 2025-12-03 13:52 GMT

ద‌క్షిణాఫ్రికాతో ఛ‌త్తీస్ గ‌ఢ్ రాజ‌ధాని రాయ్ పూర్ లో జ‌రుగుతున్న రెండో వ‌న్డేలో టీమ్ ఇండియా బ్యాట్స్ మెన్ చెల‌రేగి ఆడారు. జార్ఖండ్ రాజ‌ధాని రాంచీలో జ‌రిగిన తొలి వ‌న్డేలో చేసిన ప‌రుగుల‌ను మించి ఈసారి ప‌రుగులు సాధించారు. అయితే, ఈ మ్యాచ్ తో ఓ అరుదైన అనుకోని రికార్డును భార‌త జ‌ట్టు ఖాతాలో వేసుకుంది. వ‌న్డేల్లో

వ‌రుస‌గా 20వ సారి టాస్ ఓడిపోయింది. దీనిని అత్యంత అరుదులో కెల్లా అరుదైన సంద‌ర్భంగా క్రీడా నిపుణులు పేర్కొంటున్నారు. మ‌న జ‌ట్టు ఈ ఫార్మాట్ లో చివ‌రిసారిగా టాస్ గెలిచింది ఎప్పుడో తెలుసా..? 2023 న‌వంబ‌రు 19న జ‌రిగిన వ‌న్డే ప్ర‌పంచక‌ప్ ఫైన‌ల్లో కావ‌డం గ‌మ‌నార్హం. అహ్మ‌దాబాద్ లో జ‌రిగిన ఈ మ్యాచ్ లో టీమ్ ఇండియా ఓట‌మిపాలైంది. ఇక అప్ప‌టినుంచి మ‌న జ‌ట్టు రోహిత్ శ‌ర్మ‌, శుబ్ మ‌న్ గిల్, ఇప్పుడు కేఎల్ రాహుల్ సార‌థ్యంలో 20 వ‌న్డేలు ఆడ‌గా అన్నిట్లోనూ టాస్ ఓడడం గ‌మ‌నార్హం. ద‌క్షిణాఫ్రికాతో మూడో వ‌న్డేలో అయినా టాస్ లాస్ కు తెర‌ప‌డుతుందో లేదో చూడాలి.

ర‌న్ మెషీన్.. ట‌న్ మెషీన్..

టి20ల‌కు రిటైర్మెంట్ ఇచ్చి.. టెస్టుల‌కు వీడ్కోలు చెప్పాల్సి వ‌చ్చిన విరాట్ కోహ్లి ఆస్ట్రేలియాతో వ‌న్డే సిరీస్ లో వ‌రుస‌గా రెండు డ‌క్ లు పెట్టిన స్టార్ బ్యాట్స్ మ‌న్ విరాట్ కోహ్లి.. స్వ‌దేశంలో ద‌క్షిణాఫ్రికాపై వ‌రుస‌గా రెండో సెంచ‌రీ కొట్టాడు. ఆస్ట్రేలియా టూర్ లో మూడో వ‌న్డేలో హాఫ్ సెంచరీతో ఫామ్ లోకి వ‌చ్చిన కోహ్లి.. ఇప్పుడు ద‌క్షిణాఫ్రికాపై వ‌రుస‌గా రెండో సెంచ‌రీతో కెరీర్ లో 53వ సెంచ‌రీని అందుకున్నాడు. ఈ ర‌న్ మెషీన్ ట‌న్ మెషీన్.. భ‌విష్య‌త్ లో మ‌రే క్రికెట‌ర్ కూ సాధ్యం కాని రికార్డుల‌ను త‌న పేరిట రాసుకున్నాడు.

రుతురాజ్ మార్కులు కొట్టేశాడు..

క్లాస్ గేమ్, నిల‌క‌డ‌తో పాటు ఓపెన‌ర్ గా కావాల్సినంత టెక్నిక్ ఉన్న రుతురాజ్ గైక్వాడ్ ద‌క్షిణాఫ్రికాతో రెండో వ‌న్డేలో స‌త్తా చాటాడు. నాలుగో నంబ‌రులో దిగిన అత‌డు అద్భుత టైమింగ్ తో షాట్లు కొడుతూ సెంచ‌రీ అందుకున్నాడు. కెరీర్ లో అత‌డికి ఇదే తొలి వ‌న్డే సెంచ‌రీ కావ‌డం విశేషం. టీమ్ ఇండియాకు 7 వ‌న్డేలు, 23 టి20ల్లో ప్రాతినిధ్యం వ‌హించిన రుతురాజ్ టెస్టుల్లోనూ త్వ‌ర‌లో స్థానం ద‌క్కించుకునే చాన్సంద‌ని విశ్లేష‌కులు చెబుతున్నారు.

-రాంచీలో లాగే రాయ్ పూర్ లోనూ టీమ్ ఇండియా బ్యాట‌ర్లు ద‌క్షిణాఫ్రికా బౌల‌ర్ల‌ను చిత‌క్కొట్టారు. 358 ప‌రుగులు చేశారు. ఓపెన‌ర్లు రోహిత్ (14), జైశ్వాల్ (22) విఫ‌ల‌మైనా.. కోహ్లి (93 బంతుల్లో 102, 7 ఫోర్లు, 2 సిక్సులు), రుతురాజ్ (83 బంతుల్లో 105, 12 ఫోర్లు, 2 సిక్సులు) సెంచ‌రీల‌తో క‌దంతొక్కారు. కెప్టెన్ రాహుల్ వ‌రుస‌గా రెండో హాఫ్ సెంచ‌రీ (43 బంతుల్లో 66 నాటౌట్, 6 ఫోర్లు, 2 సిక్సులు) సాధించాడు.

Tags:    

Similar News