క్రికెట్ లో పాక్ ఇక ‘నాకౌట్’.. టీమ్ ఇండియాతో లీగ్ మ్యాచ్ లేనట్లే
2012 నుంచి కేవలం ఐసీసీ టోర్నమెంట్లు (ప్రపంచ కప్ లు)లో మాత్రమే భారత్-పాక్ తలపడుతున్నాయి.;
అది వన్డే ప్రపంచ కప్ అయినా.. టి20 ప్రపంచ కప్ అయినా.. చాంపియన్స్ ట్రోఫీ అయినా.. ఆఖరికి ఆసియా కప్ మ్యాచ్ అయినా.. ప్రపంచ క్రికెట్లో మరే రెండు జట్లు పాల్గొన్నప్పటికీ రాని మజా భారత్-పాకిస్థాన్ మధ్య మ్యాచ్ కు వస్తుంది..
అయితే, 12 ఏళ్లుగా పాకిస్థాన్ తో ద్వైపాక్షిక క్రికెట్ సంబంధాలను తెంచుకుంది భారత్. అంటే.. ఆ జట్టు భారత్ కు రాదు.. మన జట్టు పాకిస్థాన్ గడ్డపై కాలు పెట్టదు..
2012 నుంచి కేవలం ఐసీసీ టోర్నమెంట్లు (ప్రపంచ కప్ లు)లో మాత్రమే భారత్-పాక్ తలపడుతున్నాయి. మొన్నటికి మొన్న చాంపియన్స్ ట్రోఫీ పాకిస్థాన్ లో జరిగినా భారత్ వెళ్లలేదు. దీనిమీద ఎంతో రగడ జరిగినా భారత్ కించిత్ కూడా చలించలేదు. 2023లో భారత్ లో జరిగిన వన్డే ప్రపంచ కప్ లో మాత్రం పాకిస్థాన్ పాల్గొనక తప్పలేదు.
ఐసీసీ టోర్నీల్లో భారత్ –పాక్ ఇప్పటివరకు లీగ్ మ్యాచ్ లతో తలపడుతున్నాయి. ఆపై ముందడుగు వేస్తే నాకౌట్ లో ఎదురవుతాయి. అయితే, పహల్గాం ఉగ్ర దాడి తర్వాత మాత్రం ఐసీసీ టోర్నీల్లో పాకిస్థాన్ తో లీగ్ మ్యాచ్ లలోనూ తలపడేందుకు భారత్ సిద్ధంగా లేదట.
రెండు జట్ల మధ్య మ్యాచ్ జరిగితే ఉండే క్రేజ్ కారణంగా లీగ్ దశలో ఇప్పటివరకు మ్యాచ్ నిర్వహిస్తున్నారు. ఇప్పటికే పాకిస్థాన్ తో ద్వైపాక్షిక సిరీస్ లు జరగబోవని బీసీసీఐ తేల్చిచెప్పింది. పెహల్గామ్ దాడి తర్వాత పాక్ తో లీగ్ స్టేజ్ లో ఆడొద్దని కూడా భారత్ నిర్ణయించిందట. ఈ మేరకు అంతర్జాతీయ క్రికెట్ కౌన్సిల్ (ఐసీసీ)కు లేఖ రాసిందట.
అంటే.. ప్రపంచ కప్ లు, చాంపియన్స్ ట్రోఫీల్లో భారత్-పాక్ జట్లు కనీసం ఒకే గ్రూప్ లో కూడా ఉండవు. ఎలాగూ ఐసీసీ అధ్యక్షుడు ఎవరో కాదు.. భారత కేంద్ర హోం మంత్రి కుమారుడు, బీసీసీఐ మాజీ కార్యదర్శి అయిన జైషానే. ఆయన నిర్ణయం ఎలా ఉంటుందో చెప్పాల్సిన పని లేదు.