ఆసియా క‌ప్..లంక మ‌ళ్లీ ఓడింది..పాక్ బ‌తికింది..టీమ్ఇండియాతో ఫైనల్‌!

సాదాసీదాగా మొద‌లై.. పాకిస్థాన్ క్రికెట‌ర్ల‌కు భార‌త ఆట‌గాళ్ల షేక్ హ్యాండ్ ల నిరాక‌ర‌ణ‌తో ఆస‌క్తిగా మారిన ఆసియా క‌ప్ లో సూప‌ర్ 4 స‌మ‌రం ర‌స‌వ‌త్త‌రంగా మారింది.;

Update: 2025-09-24 04:19 GMT

సాదాసీదాగా మొద‌లై.. పాకిస్థాన్ క్రికెట‌ర్ల‌కు భార‌త ఆట‌గాళ్ల షేక్ హ్యాండ్ ల నిరాక‌ర‌ణ‌తో ఆస‌క్తిగా మారిన ఆసియా క‌ప్ లో సూప‌ర్ 4 స‌మ‌రం ర‌స‌వ‌త్త‌రంగా మారింది. గ్రూప్-బిలో ఆడిన మూడు మ్యాచ్ ల‌లోనూ గెలిచి టేబుల్ టాప‌ర్ గా సూప‌ర్ 4కు వ‌చ్చిన శ్రీలంక‌.. ఈ ద‌శ‌లో వ‌రుస‌గా రెండు మ్యాచ్ ల‌లో ఓడి ఫైనల్ అవ‌కాశాల‌ను సంక్లిష్టం చేసుకుంది. మంగ‌ళ‌వారం పాకిస్థాన్ తో మ్యాచ్ లో లంక వెనుక‌బ‌డి.. పుంజుకుని.. మ‌ళ్లీ వెనుక‌బ‌డి.. మ‌ళ్లీ పైచేయి సాధించిన‌ట్లే క‌నిపించినా విజ‌యం అందుకోలేక‌పోయింది. మొద‌టి మ్యాచ్ లో బంగ్లాదేశ్ చేతిలో ఓడిపోవ‌డంతో ఇప్పుడు లంక ఫైన‌ల్ చేర‌డం ప‌లు స‌మీక‌ర‌ణాల మీద ఆధార‌ప‌డి ఉంది.

సూప‌ర్ 4 మ‌హా ర‌స‌వ‌త్త‌రం

ఆసియా క‌ప్ సూప‌ర్ 4లో మూడు మ్యాచ్ లు ముగిసేస‌రికి ఫైన‌ల్ రేసు రంజుగా మారింది. లంక‌ను బంగ్లా, పాక్ ఓడించ‌గా.. పాక్ ను భార‌త్ మ‌ట్టిక‌రిపించింది. బుధ‌వారం బంగ్లాదేశ్ పై భార‌త్ గెలిస్తే నేరుగా ఫైన‌ల్ కు చేరుతుంది. బంగ్లా విజ‌యం సాధించినా తుది పోరుకు వెళ్తుంది. ఎటొచ్చి శ్రీలంక ప‌రిస్ధితే తేలాల్సి ఉంటుంది. బుధ‌వారం భార‌త్ చేతిలో బంగ్లా ఓడితే ఫైన‌ల్ రేసు ఇంకా టైట్ అవుతుంది.

పాక్, బంగ్లా సెమీఫైన‌ల్...

సూప‌ర్ లో ఈ నెల 20న శ్రీలంక‌ను ఓడించిన‌ప్ప‌టికీ... బ‌లాబ‌లాల‌ రీత్యా బుధ‌వారం భార‌త్ మీద బంగ్లా గెలుపు క‌ష్ట‌మే. ఈ ప్ర‌కారం అయితే.. బంగ్లా-పాక్ మ‌ధ్య గురువారం జ‌రిగే మ్యాచ్ అన‌ధికారిక సెమీఫైన‌ల్ అవుతుంది. ఇందులో గెలిచిన జ‌ట్టు ఫైన‌ల్ దాదాపు చేరిన‌ట్లే... అయితే, వ‌రుస‌గా రెండు రోజులు రెండు మ్యాచ్ లు ఆడాల్సి రావ‌డం బంగ్లాకు స‌వాల్. ఒక‌వేళ బంగ్లా బుధ‌వార‌మే భార‌త్ పై గెలిస్తే ముందే ఫైన‌ల్ కు వెళ్తుంది. అప్పుడు టీమ్ ఇండియా ఈ నెల 26న లంక‌పై క‌చ్చితంగా గెలవాలి.

లంక రేసులో ఉంది.. టెక్నిక‌ల్ గానే...

ఆసియా క‌ప్ ఫైన‌ల్ పై శ్రీలంక ఆశ‌లు వ‌దులుకోవాల్సిందే. కానీ, టెక్నిక‌ల్ గా మాత్రం ఆ జ‌ట్టు పోటీలోనే ఉంద‌ని చెప్పాలి. అదెలాగంటే.. బంగ్లాదేశ్ జ‌ట్టు భార‌త్, పాక్ ల‌పై గెలవాలి. లంక కూడా భార‌త్ పై విజ‌యం సాధించాలి. అది కూడా భారీ తేడాతో...! భార‌త్, పాక్ నెట్ ర‌న్ రేట్ ను దాటాలంటే శ్రీలంక హ‌నుమంతుడిలాగా పెద్ద గెంతు వేయాల్సిందే. కానీ, దీనికి అవ‌కాశాలు చాలా త‌క్కువ‌. వాస్త‌వానికి ఫైన‌ల్ రేసులో ఉన్న లంక‌.. వ‌రుస‌గా రెండు మ్యాచ్ ల‌లో పేల‌వ ప్ర‌ద‌ర్శ‌న‌తో వెనుక‌బ‌డింది.

-ఆదివారం ఫైన‌ల్ లో భార‌త్-పాక్ పోటీ చూసే చాన్సుంది. ఎందుకంటే బంగ్లాను ఓడించ‌డం పాక్ కు కాస్త తేలికే కాబ‌ట్టి. అంటే.. వ‌రుస‌గా మూడోసారి పాక్ తో భార‌త్ షేక్ హ్యాండ్ లు ఇవ్వ‌కుండానే ఆడ‌నుంద‌న్న‌మాట‌

Tags:    

Similar News