ఆసియా కప్ డౌట్.. బంగ్లాదేశ్ టూర్ ఔట్.. క్రికెట్ పై పెహల్గాం ఎఫెక్ట్

మొన్నటికి మొన్న జరిగిన చాంపియన్స్ ట్రోఫీకి పాకిస్థాన్ వెళ్లేది లేదని చెప్పింది టీమ్ ఇండియా.;

Update: 2025-05-03 11:17 GMT

మొన్నటికి మొన్న జరిగిన చాంపియన్స్ ట్రోఫీకి పాకిస్థాన్ వెళ్లేది లేదని చెప్పింది టీమ్ ఇండియా. దీంతో మన జట్టు దుబాయ్ లో మ్యాచ్ లు ఆడింది. అయితే, పెహల్గాం దాడి తర్వాత భారత్-పాక్ క్రికెట్ అనే మాటే వినిపించేదేమో అనే పరిస్థితి నెలకొంటోంది. వాస్తవానికి ఈ ఏడాది మరోసారి టీమ్ ఇండియా-పాకిస్థాన్ తలపడాల్సి ఉంది. దీనికి వేదిక ఆసియా కప్ కానుంది. అయితే, అసలు ఈ ఆసియా కప్ నిర్వహణే అనుమానంలో పడింది.

పెహల్గాంలో ఏప్రిల్ 22న జరిగిన ఉగ్ర దాడిలో 26 మంది పర్యాటకులు ప్రాణాలు కోల్పోవడం తీవ్ర సంచలనం రేపిన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో పాకిస్థాన్ పైనే ఆరోపణలు వస్తున్నాయి. దీంతో ఆ దేశంతో సమీప భవిష్యత్ లో క్రికెట్ సంబంధాలు ఉండవని తేలిపోయింది. అంతేకాదు.. ఇప్పటివరకు ఐసీసీ టోర్నీల్లో లీగ్ దశలో భారత్-పాక్ మ్యాచ్ లు జరుగుతున్నాయి. ఇకపై నాకౌట్ లో మాత్రమే ఈ రెండు జట్ల మ్యాచ్ నిర్వహించేలా చూస్తున్నారు.

మరోవైపు ఐసీసీ టోర్నీలలోనూ పాక్ తో మ్యాచ్ ల విషయమై దృష్టిపెట్టాలని బీసీసీఐ ఉపాధ్యక్షుడు రాజీవ్ శుక్లా ఐసీసీని కోరారు. అందుకనే ఆసియా కప్‌ లో భారత్ ఆడడం కష్టమేనని, టోర్నీని వాయిదా వేస్తారని అంటున్నారు.

ఆసియా కప్ ను దుబాయ్ వంటి న్యూట్రల్ (తటస్థ) వేదికపై నిర్వహిస్తారు. ఈసారి షెడ్యూల్ ను ప్రకటించాల్సి ఉంది. దీనికిముందు టీమ్ ఇండియా.. బంగ్లాదేశ్ లో పర్యటించాల్సి ఉంది.

అసలు బంగ్లాకు వెళ్తేనే కదా..?

వచ్చే ఆగస్టులో టీమ్ ఇండియా మూడు వన్డేలు, మూడు టి20ల కోసం బంగ్లాదేశ్ వెళ్లాల్సి ఉంది. కానీ, ఈ టూర్ కూడా క్యాన్సిల్ కావడం ఖాయం అంటున్నారు. కారణం.. బంగ్లాదేశ్ తాత్కాలిక ప్రభుత్వ అధినేత యూనస్ భారత్ లోని ఈశాన్య రాష్ట్రాల గురించి చేసిన వ్యాఖ్యలు. పైగా బంగ్లాదేశ్ పాకిస్థాన్ కు మద్దతుగా వ్యవహరిస్తోందనే ఆరోపణలున్నాయి.

గత ఏడాది ఆగస్టులో బంగ్లా ప్రధాని షేక్ హసీనా ఆ దేశాన్ని వీడి భారత్ కు వచ్చి ప్రవాసంలో ఉంటున్న సంగతి తెలిసిందే. అసలే భారత్ పట్ల కాస్త ద్వేషం ఉన్న యూనస్ వంటివారు.. ఇప్పుడు మరింత కడుపు మంటతో రగులుతున్నారు. అందుకే బంగ్లాదేశ్ టూర్ అవసరమా? అని బీసీసీఐ భావిస్తోందని సమాచారం.

Tags:    

Similar News