పాక్ క్రికెటర్లతో షేక్ హ్యాండ్స్ లేవ్..టీమిండియా చేతిలో షేమ్ షేమ్
పాకిస్థాన్ పై మళ్లీ టీమ్ ఇండియాదే పైచేయి...! ఆసియా కప్ లో లీగ్ దశలో ప్రత్యర్థి జట్టును చితక్కొట్టిన భారత్ సూపర్ 4 మ్యాచ్ లోనూ చెలరేగింది.;
పాకిస్థాన్ పై మళ్లీ టీమ్ ఇండియాదే పైచేయి...! ఆసియా కప్ లో లీగ్ దశలో ప్రత్యర్థి జట్టును చితక్కొట్టిన భారత్ సూపర్ 4 మ్యాచ్ లోనూ చెలరేగింది. ప్రత్యర్థిని చితక్కొట్టింది. ఆదివారం జరిగిన మ్యాచ్ లో భారత్ 6 వికెట్ల తేడాతో ఘన విజయం సాధించింది. టాస్ గెలిచిన భారత్ బౌలింగ్ ఎంచుకుంది. పాక్ నిర్ణీత 20 ఓవర్లలో 5 వికెట్లు కోల్పోయి 171 పరుగులు చేసింది. ఈ లక్ష్యాన్ని టీమ్ ఇండియా 18.5 ఓవర్లలో కేవలం 4 వికెట్లే కోల్పోయి ఛేదించేసింది. యువ ఓపెనర్లు అభిషేక్ శర్మ ఓపెనర్లు అభిషేక్ శర్మ (74; 39 బంతుల్లో 6 ఫోర్లు, 5 సిక్స్‌లు), శుభ్‌మన్ గిల్ (47; 28 బంతుల్లో 8 ఫోర్లు) చెలరేగి ఆడారు. హైదరాబాదీ కుర్రాడు తిలక్ వర్మ (30 నాటౌట్; 19 బంతుల్లో 2 ఫోర్లు, 2 సిక్స్‌లు) ఫినిషింగ్ టచ్ ఇచ్చాడు. ఈ నెల 24న భారత్, బంగ్లాదేశ్ మధ్య సూపర్-4 మ్యాచ్ జరగనుంది.
మళ్లీ షేక్ హ్యాండ్ లేదు..
పెహల్గాం ఉగ్రదాడి నేపథ్యంలో పాకిస్థాన్ ఆటగాళ్లకు షేక్ హ్యాండ్ ఇవ్వకుండానే తొలి మ్యాచ్ ఆడిన టీమ్ ఇండియా సూపర్ 4లోనూ అదే విధానం పాటించింది. టాస్ పూర్తయ్యాక, మ్యాచ్ ముగిశాక దాయాది జట్టు ఆటగాళ్లతో కరచాలనం చేయలేదు. టాస్ గెలిచిన భారత కెప్టెన్ సూర్యకుమార్ యాదవ్ బౌలింగ్ ఎంచుకున్నట్లు చెప్పిన పాక్ సారథి సల్మాన్ అఘాకు షేక్ హ్యాండ్ ఇవ్వకుండానే వెళ్లిపోయాడు. మ్యాచ్ ముగిశాక కూడా హైదరాబాదీ తిలక్ వర్మ, ఆల్ రౌండర్ హార్దిక్ పాండ్యాలు నేరుగా పెవిలియన్ కు చేరుకున్నారు. దీంతో పాక్ ఆటగాళ్ల మొహాలు చిన్నబోయాయి.
క్యాచ్ లు చేజారకుండా ఉంటే మరింత చిత్తు
ఆదివారం సూపర్ 4 మ్యాచ్ లో భారత ఆటగాళ్లు పాకిస్థాన్ బ్యాట్స్ మెన్ ఇచ్చిన పలు క్యాచ్ లను వదిలేశారు. హైదరాబాదీ తిలక్ వర్మ, వైస్ కెప్టెన్ శుబ్ మన్ గిల్, ఓపెనర్ అభిషేక్ శర్మ, స్పిన్నర్ కుల్దీప్ యాదవ్ లు క్యాచ్ లను పట్టలేకపోయారు. దీంతో పాకిస్థాన్ కాస్త గౌరవప్రదమైన స్కోరు చేయగలిగింది. లేదంటే మరింత తక్కువ స్కోరుకే పరిమితం అయ్యేది. మరింత ఘోరంగా ఓడిపోయేది. అయితే, క్యాచ్ లు పట్టలేకపోయినా భారత జైత్రయాత్ర మాత్రం కొనసాగింది.
ఫైనల్లోనూ షేక్ హ్యాండ్ లేనట్లే..?
పెహల్గాం ఉగ్రదాడి, ఆపరేషన్ సిందూర్ లో ప్రాణాలు కోల్పోయిన పర్యాటకులు, వీర సైనికులకు నివాళిగా.. ఉగ్రదాడికి నిరసనగా భారత ఆటగాళ్లు ఆసియా కప్ లో పాక్ ఆటగాళ్లకు షేక్ హ్యాండ్ లు ఇవ్వడంలేదు. గ్రూప్ ఏ మ్యాచ్, సూపర్ 4లో దీనినే పాటించారు. ఒకవేళ పాక్ ఫైనల్ కు చేరినా ఇదే పద్ధతిని అవలంబించే చాన్సుంది. ఇప్పటికే గ్రూప్ దశ విజయాన్ని భారత సైనికులకు అంకింతం ఇస్తున్నట్లు కెప్టెన్ సూర్యకుమార్ యాదవ్ చెప్పిన సంగతి తెలిసిందే.
కొసమెరుపుః ఈ సూపర్ 4 మ్యాచ్ కు కూడా రిఫరీగా ఆండీ పైక్రాఫ్ట్ వ్యవహరించాడు. గ్రూప్ దశలో ఇతడి కారణంగానే భారత ఆటగాళ్లు షేక్ హ్యాండ్ లు ఇవ్వలేదంటూ నానా యాగీ చేసింది పాక్ జట్టు. యూఏఈతో మ్యాచ్ ఆడేది లేదంటూ మేకపోతు గాంభీర్యం ప్రకటించింది. చివరకు అదంతా ఉత్తుత్తి బెదిరింపు అని తేలింది.