ఐపీఎల్-19 నుంచి తొలి ఔట్.. స్టార్ ప్లేయర్ సంచలన నిర్ణయం
ఇండియన్ ప్రీమియర్ లీగ్ 19వ సీజన్ మినీ వేలం మరికొన్ని వారాల్లో మొదలుకానుండగా.. స్టార్ ప్లేయర్ సంచలన నిర్ణయం తీసుకున్నాడు.;
ఇండియన్ ప్రీమియర్ లీగ్ 19వ సీజన్ మినీ వేలం మరికొన్ని వారాల్లో మొదలుకానుండగా.. స్టార్ ప్లేయర్ సంచలన నిర్ణయం తీసుకున్నాడు. ఫామ్ లో ఉన్నప్పటికీ... జట్టులో చోటుకు ఖాయం అయినప్పటికీ, వచ్చే సీజన్ లో ఆడకూడదని నిర్ణయించాడు. ఇదే ఆశ్చర్యమంటే.. అతడు పాకిస్థాన్ సూపర్ లీగ్ (పీఎస్ఎల్)లో ఆడాలని నిర్ణయించుకున్నాడు. 14 సీజన్ల పాటు ఐపీఎల్ తో కొనసాగిన అనుబంధానికి స్వస్తి పలికిన అతడిని.. 20వ సీజన్ కు ఏ జట్టు కూడా తీసుకునే అవకాశం లేదు. ఎందుకంటే, దక్షిణాఫ్రికా వంటి పెద్ద జట్టుకు కెప్టెన్ గా వ్యవహరించి, ఆ జట్టు తరఫున మూడు ఫార్మాట్లలోనూ మంచి బ్యాట్స్ మన్ గా గుర్తింపు పొందిన ఆ ఆటగాడికి ఇప్పటికే 40 ఏళ్లు దాటినందున ఫ్రాంచైజీలు ఆసక్తి చూపకపోవచ్చు. 14 సీజన్లలో చాంపియన్ జట్లు అయిన చెన్నై సూపర్ కింగ్స్, రాయల్ చాలెంజర్స్ బెంగళూరు వంటి చాంపియన్ జట్లతో పాటు ఢిల్లీ క్యాపిటల్స్ కు ఆడిన అతడు పాకిస్థాన్ సూపర్ లీగ్ లో ఏ జట్టుకు ఆడతాడో చూడాలి.
వేలం ముగింట నిర్ణయం..
దక్షిణాఫ్రికా మాజీ కెప్టెన్ ఫాఫ్ డుప్లెసిస్.. ఇండియన్ ప్రీమియర్ లీగ్ వేలం డిసెంబరు 15న జరగనుండగా తాను వచ్చే సీజన్ కు అందుబాటులో ఉండనని తెలిపాడు. 2013 నుంచి ఐపీఎల్ లో ఉన్న డుప్లెసి.. మంచి బ్యాటర్. మెరుపు ఇన్నింగ్స్ తో జట్లకు ఓపెనింగ్ ఇచ్చాడు. 2021లో చెన్నై విజేతగా నిలవడంలో ఫాఫ్ దే కీలక పాత్ర. ఆ సీజన్ లో అతడు ఓపెనింగ్ కు దిగి 633 పరుగులు చేశాడు. దూకుడు, నిలకడతో పాటు మెరుపు ఫీల్డింగ్ డుప్లెసి ప్రత్యేకత. 2021లో ప్రదర్శనతో.. వేలంలోకి రాగా అతడిని రాయల్ చాలెంజర్స్ బెంగళూరు తీసుకుంది. 2023లో టీమ్ ఇండియా స్టార్ బ్యాటర్ విరాట్ కోహ్లి కెప్టెన్సీ నుంచి తప్పుకోవడంతో డుప్లెసి సారథ్యం వహించాడు. ఏకంగా 730 పరుగులతో అద్భుతంగా రాణించాడు. ఈ ఏడాది సీజన్ లో డుప్లెసిని ఢిల్లీ క్యాపిటల్స్ తీసుకుంది.
154 మ్యాచ్ లు.. 4,773 పరుగులు
14 సీజన్ల ఐపీఎల్ కెరీర్ లో డుప్లెసి మొత్తం 154 మ్యాచ్ లు ఆడాడు. 4,773 పరుగులు చేశాడు. ఈ ఏడాది ఢిల్లీ తరఫున మాత్రం మెరుగైన ప్రదర్శన కనబర్చలేదు. వయసు కూడా మీదపడుతుండడంతో డుప్లెసి ఇక ఐపీఎల్ లో తనను కొనేందుకు ఫ్రాంచైజీలు ఆసక్తిచూపకపోవచ్చని భావించి ఉండవచ్చు. అందుకే ఐపీఎల్ తో పోలిస్తే.. క్రికెట్ ప్రమాణాలు తక్కువగా ఉండే పీఎస్ఎల్ లో డుప్లెసి ఎంచుకున్నట్లు స్పష్టం అవుతోంది. అక్కడైతే మరో రెండు, మూడు సీజన్లయినా ఆడేందుకు అవకాశం ఉంటుందని అనుకోవచ్చు. అయితే, మళ్లీ కలుద్దాం అంటూ అతడు చెబుతున్నదాని ప్రకారం.. ఐపీఎల్ లో ఏదో ఒక ఫ్రాంచైజీ కోచింగ్ స్టాఫ్ లో భాగం కానున్నట్లు కనిపిస్తోంది.