క్రికెట్‌లో షాకింగ్ రికార్డు.. కేవలం 2 పరుగులకే ఆలౌట్.. 8 మంది డకౌట్.. ఇది మ్యాచ్ కాదు, చరిత్ర!
క్రికెట్ అనగానే పరుగుల వర్షం, సిక్సర్లు, ఫోర్లు గుర్తుకొస్తాయి. అయితే, కొన్నిసార్లు అద్భుతమైన బౌలింగ్ ప్రదర్శనలతో జట్లు అతి తక్కువ పరుగులకే ఆలౌట్ అవుతుంటాయి.;
క్రికెట్ అనగానే పరుగుల వర్షం, సిక్సర్లు, ఫోర్లు గుర్తుకొస్తాయి. అయితే, కొన్నిసార్లు అద్భుతమైన బౌలింగ్ ప్రదర్శనలతో జట్లు అతి తక్కువ పరుగులకే ఆలౌట్ అవుతుంటాయి. కానీ, కేవలం 2 పరుగులకే ఒక టీమ్ ఆలౌట్ అవ్వడం ఎప్పుడైనా చూశారా? వినడానికే ఆశ్చర్యంగా ఉంది కదా. తాజాగా ఇంగ్లాండ్‌లో జరుగుతున్న కౌంటీ క్రికెట్ లీగ్‌లో ఇలాంటి అసాధారణ సంఘటనే ఒకటి జరిగింది. ఈ మ్యాచ్‌లో ఏకంగా 8 మంది బ్యాట్స్‌మెన్ కనీసం ఒక్క పరుగు కూడా చేయకుండానే పెవిలియన్ చేరారు. ఈ ఘటన ఇప్పుడు క్రికెట్ ప్రపంచంలో చర్చనీయాంశంగా మారింది.
భారత్, ఇంగ్లాండ్ మధ్య జూన్ 20 నుండి ఆగస్టు 4 వరకు ఐదు మ్యాచ్‌ల టెస్ట్ సిరీస్ జరగనున్న నేపథ్యంలో అంతకంటే ముందే కౌంటీ క్రికెట్ లీగ్‌లో ఒక వింత రికార్డు నమోదైంది. నార్త్ లండన్ సీసీ (North London CC), రిచ్‌మండ్ సీసీ, మిడ్డెక్స్ (Richmond CC, Middx) జట్ల మధ్య జరిగిన ఒక మ్యాచ్‌లో ఈ రికార్డు క్రియేట్ అయింది.
నార్త్ లండన్ సీసీ జట్టు ముందుగా బ్యాటింగ్ చేసింది. బ్యాట్స్‌మెన్‌లు చెలరేగి ఆడి 45 ఓవర్లలో 6 వికెట్లు కోల్పోయి ఏకంగా 426 పరుగుల భారీ లక్ష్యాన్ని ప్రత్యర్థి ముందుంచారు. నార్త్ లండన్ ఓపెనింగ్ బ్యాట్స్‌మెన్ డేనియల్ సిమన్స్ 140 పరుగులతో అద్భుతమైన ఇన్నింగ్స్ ఆడాడు. మిగిలిన ఏ బ్యాట్స్‌మెన్ కూడా కనీసం అర్థ సెంచరీ కూడా చేయలేకపోయినా, జట్టు భారీ స్కోరు సాధించింది.
427 పరుగుల భారీ లక్ష్యంతో బరిలోకి దిగిన రిచ్‌మండ్ సీసీ, మిడ్డెక్స్ జట్టు బ్యాట్స్‌మెన్‌లు ప్రత్యర్థి బౌలర్ల ధాటికి కకావికలమయ్యారు. కేవలం 5.4 ఓవర్లలోనే 2 పరుగులకు ఆలౌట్ అయ్యారు. ఈ 2 పరుగులలో కూడా, ఒక పరుగు వైడ్ ద్వారా వచ్చింది. బ్యాట్స్‌మెన్ చేసిన ఏకైక పరుగును టామ్ పిట్రైడిస్ సాధించాడు. మిగిలిన బ్యాట్స్‌మెన్ అందరూ సున్నా పరుగులకే (డకౌట్) పెవిలియన్ చేరారు. ఈ మ్యాచ్‌లో నార్త్ లండన్ సీసీ జట్టు 424 పరుగుల భారీ తేడాతో ఘన విజయం సాధించింది. నార్త్ లండన్ సీసీ బౌలర్లైన థామస్ స్పౌటన్, మాథ్యూ రాసన్ అద్భుతంగా బౌలింగ్ చేసి ప్రత్యర్థిని ఆలౌట్ చేశారు. అలాగే, మాథ్యూ ఒక రనౌట్ ద్వారా కూడా వికెట్ సాధించాడు.
కౌంటీ క్రికెట్ చరిత్రలో ఇది ఒక అరుదైన, షాకింగ్ రికార్డుగా నిలిచింది. ఇది బౌలింగ్ దాడులు, బ్యాట్స్‌మెన్‌ల బలహీనతలు రెండింటినీ స్పష్టంగా తెలియజేస్తోంది. ఈ మ్యాచ్‌ను చూసినవారంతా ఆశ్చర్యపోయారు. ఈ రికార్డును క్రికెట్ అభిమానులు చాలా కాలం గుర్తుంచుకుంటారు.