టీమ్ఇండియాకు ధ్రువ్ తార... ఇతడిని పక్కనపెడతారా?
అనుకోకుండా టీమ్ ఇండియా గడప తొక్కిన అతడు తన లక్ ను సద్వినియోగం చేసుకుంటూ సూపర్ బ్యాట్స్ మన్ గా ఎదుగుతున్నాడు. ఇంతకూ ఎవరా ఆటగాడు అంటే...?;
అచ్చం దిగ్గజ ఆటగాడు విరాట్ కోహ్లిని పోలి ఉండే బ్యాటింగ్ స్టయిల్.. దూకుడుకు దూకుడు.. నిలకడకు నిలకడ.. మూడు ఫార్మాట్లలోనూ ఆడగల సత్తా.. అన్ని షాట్లు కొట్టగల నైపుణ్యం.. ఇదంతా ఒక్క ఆటగాడిలో ఉంటే..? ఇక 140, 1&56, 125, 44& 6, 132 నాటౌట్, 127 నాటౌట్...! ఇవేమీ జట్టులోని ఆటగాళ్ల స్కోర్లు కావు.. లేదంటే మేటి బ్యాటర్ పరుగులు కూడా కావు..! ఒక బ్యాట్స్ మన్ వరుసగా చేసిన పరుగులు..! ఇందులో అంతర్జాతీయ, దేశవాళీ, విదేశాల ఏ జట్ల మ్యాచ్ లు కూడా ఉండడం గమనార్హం. అంటే, అన్నిస్థాయిల జట్లపై అతడు పరుగులు సాధించినట్లు అన్నట్లు. ఇక భవిష్యత్ లో అతడికి టీమ్ ఇండియాలో చోటు ఖాయం. అదికూడా అత్యంత కీలకమైన వన్ డౌన్ లోనే అనడంలో సందేహం లేదు. పైన చెప్పుకొన్న స్కోర్లు చూసినా ఎవరీ ప్రతిభావంతుడు? అనే ప్రశ్న తలెత్తకుండా ఉండదు. ఇటీవలి కాలంలో బహుశా అతడి స్థాయిలో నిలకడగా రాణించిన బ్యాట్స్ మన్ ఎవరూ లేరని కూడా చెప్పవచ్చు. అనుకోకుండా టీమ్ ఇండియా గడప తొక్కిన అతడు తన లక్ ను సద్వినియోగం చేసుకుంటూ సూపర్ బ్యాట్స్ మన్ గా ఎదుగుతున్నాడు. ఇంతకూ ఎవరా ఆటగాడు అంటే...?
ఇషాన్ కాలదన్నుకున్న చాన్స్..
రిషభ్ పంత్ గాయం కారణంగా అందుబాటులో లేకుండా పోవడంతో రెండేళ్ల కిందట టీమ్ ఇండియా నంబర్ వన్ వికెట్ కీపర్ బ్యాటర్ ఇషాన్ కిషన్ అనే అందరూ చెప్పేవారు. అయితే, వన్డే ప్రపంచకప్ అనంతరం ఈ ఎడమ చేతి వాటం వికెట్ కీపర్ బ్యాటర్ కాస్త తిక్కగా ప్రవర్తించాడు. ప్రపంచ కప్ లో పూర్తిస్థాయిలో అవకాశం రాకపోవడం అతడి అసమ్మతికి కారణమైంది. బీసీసీఐనే ధిక్కరించాడు. పంత్ కూడా లేకపోవడంతో ఆంధ్రా ఆటగాడు శ్రీకర భరత్ కు చాన్స్ లు దక్కాయి. అతడూ విఫలం కావడంతో 2024 ప్రారంభంలో ఇంగ్లండ్ తో జరిగిన టెస్టు సిరీస్ కు యూపీకి చెందిన ధ్రువ్ జురెల్ ను ఎంపిక చేశారు. అలా వెలుగులోకి వచ్చిన జురెల్ ఇప్పుడు దుమ్మురేపుతున్నాడు. టి20, వన్డే, టెస్టులు మూడు ఫార్మాట్లలోనూ పనికొచ్చే ఆటగాడిగా ఎదిగాడు.
బ్యాక్ టు బ్యాక్..
జురెల్ ప్రస్తుతం దక్షిణాఫ్రికా ఎ జట్టుతో జరుగుతున్న నాలుగు రోజుల మ్యాచ్ లో వరుసగా రెండు ఇన్నింగ్స్ లోనూ సెంచరీ చేశాడు. మొదటి ఇన్నింగ్స్ భారత- ఎ జట్టు 255 పరుగులు చేస్తే అందులో జురెల్ 132 నాటౌట్ కావడం గమనార్హం. ఇక రెండో ఇన్నింగ్స్ లోనూ అతడు 127నాటౌట్ గా నిలిచాడు. ఇటీవలి ఇంగ్లండ్ టూర్ లో మెరిసిన జురెల్, వెస్టిండీస్ తో టెస్టు సిరీస్ లో సెంచరీ కొట్టాడు. ఈ జోరు చూస్తుంటే టీమ్ ఇండియా టెస్టు జట్టులో ధ్రువ్ చోటు ఖాయం చేసుకున్నట్లు స్పష్టం అవుతోంది.
అతడి ప్లేస్ ఇతడికి..
టీమ్ ఇండియా టెస్టు జట్టులో వన్ డౌన్ లో కుర్రాడు సాయి సుదర్శన్ ఇంకా కుదురుకోవడం లేదు. ఓపెనర్లు జైశ్వాల్, రాహుల్ తర్వాత వన్ డౌన్ లో నిలకడైన ఆటగాడు కావాల్సి ఉంది. సాయి నిలదొక్కుకుంటే ఓకే.. ఈలోగానే జురెల్ దూసుకొస్తున్నాడు. సాయికే కాదు.. వికెట్ కీపర్ బ్యాట్స్ మన్ రిషభ్ పంత్ స్థానానికీ అతడు ఎసరు పెడుతున్నాడు. ఒకవేళ పంత్ గనుక వైస్ కెప్టెన్ కాకుంటే పక్కనపెట్టి ధ్రువ్ కు చాన్స్ లు ఇచ్చినా ఆశ్చర్యం ఉండదు. ఇప్పటికైనా దక్షిణాఫ్రికాతో సిరీస్ లో ఐదో స్థానంలో జురెల్ ను ఆడించే అవకాశం ఉంది. ఎందుకంటే.. వికెట్ కీపింగ్ లో పంత్ కంటే ధ్రువ్ చాలా మెరుగు. చూద్దాం.. ఈ క్రికెట్ ధ్రువ్ తార ప్రయాణం ఎలా ఉంటుందో?