ఈ నలుగురూ.. ఐపీఎల్ మొదటినుంచి.. ఆ ఇద్దరూ జస్ట్ మిస్
ఏటా జరిగే హై ఓల్టేజ్ మ్యాచ్ (డిఫెండింగ్ చాంపియన్ వర్సెస్-రన్నరప్)కు భిన్నంగా జరుగుతుండడం గమనార్హం.;
భారత క్రికెట్ గురించి ఒక్క మాటలో చెప్పాలంటే.. 1983 వన్డే ప్రపంచ కప్ గెలుపునకు ముందు తర్వాత..! టి20ల్లో అయితే 2008లో మొదలైన ఇండియన్ ప్రీమియర్ లీగ్ (ఐపీఎల్)కు ముందు తర్వాత..! అని చెప్పుకోవాలి...! అంతగా భారత క్రికెట్ ను మార్చేశాయి ఈ రెండు సందర్భాలు. మరీ ముఖ్యంగా ఐపీఎల్ అయితే ప్రపంచ క్రికెట్ లో భారత్ ను తిరుగులేని శక్తిగా నిలిపింది. ఇప్పుడు మరొక్క వారం రోజుల్లో లీగ్ 19వ ఎడిషన్ ప్రారంభం కానుంది. డిఫెండింగ్ చాంపియన్ రాయల్ చాలెంజర్స్ బెంగళూరు (ఆర్సీబీ) ఈ నెల 28న సన్ రైజర్స్ హైదరాబాద్ (ఎస్ఆర్ హెచ్)తో తలపడనుంది. ఏటా జరిగే హై ఓల్టేజ్ మ్యాచ్ (డిఫెండింగ్ చాంపియన్ వర్సెస్-రన్నరప్)కు భిన్నంగా జరుగుతుండడం గమనార్హం.
ఇంకా ఆడుతున్నారు..
2008లో మొదలైంది ఐపీఎల్. 2026లో 19వ సీజన్ జరగనుంది. మరి ఈ 18 ఏళ్లలో మొదటినుంచి లీగ్ లో ఉన్నది ఎంతమంది..? కనుమరుగు అయినది ఎంతమంది? అంటే, ఉన్నది నలుగురే అని చెప్పాల్సి ఉంటుంది. ఆ నలుగురూ భారత క్రికెటర్లే కావడం ఇక్కడ విశేషం. మహేంద్ర సింగ్ ధోనీ, రోహిత్ శర్మ, విరాట్ కోహ్లి, మనీశ్ పాండేలు 2008 నుంచి లీగ్ లో ఉన్నారు. అయితే, మరో ఇద్దరు ఈ చాన్స్ ను త్రుటిలో కోల్పోయారు. ఈ ఏడాది రాజస్థాన్ రాయల్స్ కు ఆడనున్న ఆల్ రౌండర్ రవీంద్ర జడేజా, మిడిలార్డర్ బ్యాటర్ అజింక్య రహానేలు కూడా 2008 నుంచి లీగ్ లో ఉన్నప్పటికీ 2010లో ఆడలేదు.
కోహ్లి ఒక్కడే.. ధోనీ కూడా
2008 నుంచి ఒకటే టీమ్ కు ఆడిన రికార్డు విరాట్ కోహ్లి (రాయల్ చాలెంజర్స్ బెంగళూరు). కోహ్లి గొప్పదనం ఏమంటే, తాను ఒకసారి ఇష్టపడితే దానితోనే కొనసాగడం. అందుకే, బెంగళూరును విడిచిపెట్టలేదు. అయితే, ధోనీ కూడా చెన్నై సూపర్ కింగ్స్ తో ఇలానే కొనసాగాడు. కానీ, చెన్నైపై ఫిక్సింగ్ ఆరోపణలు రావడంతో రెండు సీజన్ల పాటు ఆ జట్టు పుణె సూపర్ జెయింట్స్ గా పేరు మార్చుకుని ఆడింది. ఇక రోహిత్ శర్మ.. లీగ్ తొలి ఎడిషన్ లో అప్పటి దక్కన్ చార్జర్స్ (సన్ రైజర్స్ హైదరాబాద్)కు ప్రాతినిధ్యం వహించడం గమనార్హం. ఆ తర్వాత ముంబై ఇండియన్స్ కు మారిన రోహిత్.. ఆ జట్టుకు ఐదు టైటిళ్లు అందించాడు.
తొలి సెంచరీ మొనగాడు..
ఐపీఎల్ లో సెంచరీ కొట్టిన తొలి భారతీయ క్రికెటర్ ఎవరు? అంటే, మనీశ్ పాండే. కర్ణాటకకు చెందిన మనీశ్.. 2009లోనే సెంచరీ కొట్టాడు. అప్పటికి అతడికి 18 ఏళ్లే. కోహ్లి, జడేజా, రహానేతో పాటు 2008లో అండర్ 19 ప్రపంచ కప్ గెలిచిన యువ టీమ్ఇండియా సభ్యుడైన మనీశ్.. సీనియర్ జట్టులో మాత్రం కుదురుకోలేకపోయాడు. ఇక లీగ్ లో తొలుత ఆర్సీబీకి ఆడిన అతడు తర్వాత సన్ రైజర్స్ హైదరాబాద్, డిల్లీ క్యాపిటల్స్, పుణె వారియర్స్, ముంబై ఇండియన్స్, లక్నో సూపర్ జెయింట్స్, కోల్ కతా నైట్ రైడర్స్ కు మారాడు. ఇప్పుడు కోల్ కతాకే ఆడుతున్నాడు. కాగా, విదేశీ క్రికెటర్లు ఎవరూ 2008 నుంచి ఇప్పటివరకు ఐపీఎల్ లో లేరు.