చెన్నైకి గట్టి ఎదురుదెబ్బ: ధోనీ దూరం.. సవాళ్ల మధ్య 'యెల్లో ఆర్మీ' ప్రస్థానం!

ఐపీఎల్ సమరం మొదలవ్వడానికి ముందే ఐదుసార్లు ఛాంపియన్ చెన్నై సూపర్ కింగ్స్‌కు ఊహించని షాక్ తగిలింది.;

Update: 2026-03-30 09:51 GMT

ఐపీఎల్ సమరం మొదలవ్వడానికి ముందే ఐదుసార్లు ఛాంపియన్ చెన్నై సూపర్ కింగ్స్‌కు ఊహించని షాక్ తగిలింది. ఆ జట్టు గుండెకాయ, లెజెండరీ కెప్టెన్ మహేంద్ర సింగ్ ధోనీ గాయం కారణంగా టోర్నీ ఆరంభ మ్యాచ్‌లకు దూరం కావడం అభిమానులను తీవ్ర ఆందోళనకు గురిచేస్తోంది. కేవలం ఆటగాడిగానే కాకుండా మైదానంలో ఒక వ్యూహకర్తగా, యువ ఆటగాళ్లకు మార్గదర్శిగా ధోనీ పోషించే పాత్ర అద్వితీయం. వికెట్ల వెనుక అతడు చేసే మ్యాజిక్, ఫీల్డింగ్ సెట్టింగ్‌లలో చూపే చాకచక్యం ఈసారి చెన్నై అభిమానులు మిస్ కానున్నారు.

గాయాల బెడద: బ్రెవిస్ కూడా దూరం!

ధోనీ గైర్హాజరీ ఒక ఎత్తు అయితే మెరుపు బ్యాటర్ డెవాల్డ్ బ్రెవిస్ కూడా గాయపడటం మేనేజ్‌మెంట్‌కు తలనొప్పిగా మారింది. విధ్వంసకర ఇన్నింగ్స్‌లతో మ్యాచ్ స్వరూపాన్నే మార్చగల బ్రెవిస్ లేకపోవడం మిడిల్ ఆర్డర్‌లో లోటును స్పష్టం చేస్తోంది. ఒకేసారి ఇద్దరు కీలక ఆటగాళ్లు అందుబాటులో లేకపోవడంతో జట్టు సమతుల్యత దెబ్బతినే ప్రమాదం ఉంది.

గైక్వాడ్ భుజాలపై గురుతర బాధ్యత

ఈ క్లిష్ట పరిస్థితుల్లో కెప్టెన్ రుతురాజ్ గైక్వాడ్ తన బ్యాటింగ్‌తోనే కాకుండా నాయకత్వంతోనూ జట్టును నడిపించాల్సి ఉంది. గైక్వాడ్ క్లాసిక్ ప్లేయర్ అయినప్పటికీ పవర్ ప్లేలో అతని నెమ్మదైన ఆరంభం కొన్నిసార్లు జట్టుపై ఒత్తిడి పెంచుతోంది. అందుకే ఈసారి అతను మరింత బాధ్యతాయుతంగా, వేగంగా ఆడాల్సిన అవసరం ఉంది.

మిడిల్ ఆర్డర్‌లో సంజు శాంసన్, శివం దూబేల పాత్ర అత్యంత కీలకం కానుంది. స్పిన్నర్లను చీల్చిచెండాడడంలో దూబే సిద్ధహస్తుడు కాగా శాంసన్ తన అనుభవంతో ఇన్నింగ్స్‌ను నిలబెట్టగలడు. వీరిద్దరూ ఫామ్‌లో ఉంటే చెన్నైకి భారీ స్కోర్లు సాధించడం కష్టమేమీ కాదు.

యువ రక్తం.. కొత్త ఆశలు

ధోనీ లేని లోటును భర్తీ చేసేందుకు వేలంలో భారీ ధరకు కొనుగోలు చేసిన వికెట్ కీపర్-బ్యాటర్ కార్తీక్ శర్మపై అందరి దృష్టి నెలకొంది. అలాగే యువ సంచలనాలు ఆయుష్ మాత్రే, సర్ఫరాజ్ ఖాన్, ఉర్విల్ పటేల్ తమకు దక్కే అవకాశాలను ఎలా మలుచుకుంటారో వేచి చూడాలి. వీరు గనుక క్లిక్ అయితే సీఎస్కే బెంచ్ స్ట్రెంత్ మరోసారి నిరూపితమవుతుంది.

బౌలింగ్ విభాగమే బలం

బ్యాటింగ్‌లో ఒడిదుడుకులు ఉన్నప్పటికీ బౌలింగ్ విభాగంలో చెన్నై చాలా పటిష్టంగా కనిపిస్తోంది. మాట్ హెన్రీ, జేమీ ఓవర్టన్, ఖలీల్ అహ్మద్, కాంబోజ్ ప్రత్యర్థి బ్యాటర్లను కట్టడి చేసేందుకు సిద్ధంగా ఉన్నారు. నూర్ అహ్మద్, అఖీల్ హుస్సేన్ వంటి ప్రపంచ స్థాయి స్పిన్నర్లు చెన్నై పిచ్‌లపై ప్రత్యర్థులను తిప్పలు పెట్టడం ఖాయం.

తొలి పోరు.. రాజస్థాన్ రాయల్స్‌తో ఢీ!

చెన్నై తన మొదటి మ్యాచ్‌లో బలమైన రాజస్థాన్ రాయల్స్ ను ఎదుర్కోనుంది. యశస్వి జైస్వాల్, సూర్యవంశీ, ధ్రువ్ జురెల్, షిమ్రాన్ హెట్‌మేయర్ వంటి హిట్టర్లను నియంత్రించడం చెన్నై బౌలర్లకు సవాలుతో కూడుకున్న పని ధోనీ వ్యూహాలు లేని మైదానంలో గైక్వాడ్ తన సేనను ఎలా నడిపిస్తాడో చూడాలి.

గాయాలు, కీలక ఆటగాళ్ల గైర్హాజరీ చెన్నై ను ఇబ్బంది పెడుతున్నా.. ఒత్తిడిలో రాణించడం ఆ జట్టుకు అలవాటే. 'విజిల్ పోడు' అంటూ అభిమానులు ఇచ్చే మద్దతు, యువ ఆటగాళ్ల కసి తోడైతే చెన్నై మళ్లీ విజయపథంలోకి రావడం అసాధ్యమేమీ కాదు.

Tags:    

Similar News