సూప‌ర్ ఓవ‌ర్లో 0/2..యాంటీ క్లైమాక్స్ తో బంగ్లాపై టీమ్ఇండియా ఓట‌మి

టీమ్ఇండియాకు షాక్.. ! అది కూడా బంగ్లాదేశ్ చేతిలో..! ఫైన‌ల్ కు చేరిన‌ట్లే అని భావించిన స‌మ‌యంలో అనూహ్య ఓట‌మి..!;

Update: 2025-11-22 03:52 GMT

టీమ్ఇండియాకు షాక్.. ! అది కూడా బంగ్లాదేశ్ చేతిలో..! ఫైన‌ల్ కు చేరిన‌ట్లే అని భావించిన స‌మ‌యంలో అనూహ్య ఓట‌మి..! పైగా సూప‌ర్ ఓవ‌ర్లో మ‌రింత ఘోర‌మైన అనుభ‌వం.. వ‌రుస‌గా రెండు బంతుల్లో హిట్ట‌ర్లయిన బ్యాట‌ర్లు డ‌కౌట్..! అయితే, అటు బంగ్లాదేశ్ కూడా సూప‌ర్ ఓవ‌ర్లో తొలి బంతికే వికెట్ కోల్పోయింది. కానీ, రెండో బంతి వైడ్ ప‌డింది..! ఇందులో ఓ ట్విస్టుంది.. ఆ బంతికి స్టంపింగ్ మిస్ అయింది..! బంగ్లా గెలిచింది..! ఫైన‌ల్ చేరింది..! మ‌న కంటే చిన్న జ‌ట్ట‌యిన బంగ్లా చేతిలో సెమీస్‌ ఓట‌మితో భార‌త్ నిరాశ‌గా ఆసియా క‌ప్ రైజింగ్ స్టార్స్ టోర్నీ నుంచి నిష్క్ర‌మించింది. అయితే, దీనికి ముందు కూడా మ్యాచ్ క్ల‌యిమాక్స్ లో ఆస‌క్తిక‌ర‌ ట్విస్టులు చోటుచేసుకున్నాయి.

దోహాలో జ‌రుగుతున్న ఆసియా క‌ప్ రైజింగ్ స్టార్స్ టోర్నీలో శుక్ర‌వారం వికెట్ కీప‌ర్ బ్యాట‌ర్ జితేశ్ శ‌ర్మ సార‌థ్యంలోని టీమ్ ఇండియా టాస్ గెలిచి బౌలింగ్ ఎంచుకుంది. భార‌త బౌల‌ర్లు ప్ర‌త్య‌ర్థిని బాగానే నిలువ‌రించారు. బంగ్లా ఓపెన‌ర్ హ‌బీబుర్ సోహాన్ (46 బంతుల్లో 65 ప‌రుగులు, 3 ఫోర్లు, 5 సిక్సులు) హాఫ్ సెంచ‌రీ చేసినా మిగ‌తావారు పెద్ద‌గా రాణించ‌లేదు. కానీ, ఆఖ‌ర్లో ఎస్ఎం మెహ‌రాబ్ కేవ‌లం 18 బంతుల్లోనే48 ప‌రుగులు బాదాడు. ఇందులో 6 సిక్సులు ఉండడం గ‌మ‌నార్హం. నిర్ణీత 20 ఓవ‌ర్లలోఆరు వికెట్ల న‌ష్టానికి బంగ్లా 194ప‌రుగులు చేసింది.

ఛేజింగ్ లో టీమ్ ఇండియా దూకుడు

195 ప‌రుగుల టార్గెట్ తో బ‌రిలో దిగిన టీమ్ ఇండియాకు 14 ఏళ్ల కుర్ర ఓపెన‌ర్ వైభ‌వ్ సూర్య‌వంశీ (15 బంతుల్లో 38, 2 ఫోర్లు, 4 సిక్సులు), ఐపీఎల్ సంచ‌ల‌నం ప్రియాంశ్ ఆర్య (23 బంతుల్లో 44, 4 ఫోర్లు, 3 సిక్సులు) చెల‌రేగి ఆడి శుభారంభం ఇచ్చారు. 6.2 ఓవ‌ర్ల‌లోనే 62 ప‌రుగులు జోడించి ఇద్ద‌రూ ఔట‌య్యారు. జితేశ్ శ‌ర్మ (23 బంతుల్లో 33, ఫోర్, 2 సిక్సులు), నేహాల్ వ‌ధేరా (29 బంతుల్లో 32, 2 ఫోర్లు, సిక్స్) నిల‌వ‌డంతో టీమ్ ఇండియా ఛేజింగ్ లో దూసుకెళ్లింది. మ‌ధ్య‌లో బంగ్లా బౌల‌ర్లు క‌ట్ట‌డి చేయ‌డంతో విజ‌య‌ స‌మీక‌రణం చివ‌రి ఓవ‌ర్లో 16 ప‌రుగులుగా మారింది. అశుతోష్ శ‌ర్మ‌ ఒక ఫోర్, సిక్స్ బాది ప‌రిస్థితిని తేలిక చేశాడు. కానీ, ఆ ఓవ‌ర్ 5వ బంతికి ఔట‌య్యాడు. గెల‌వాలంటే చివ‌రి బంతికి ఫోర్ కొట్టాల్సిన ప‌రిస్థితిలో హ‌ర్ష్ దూబె 3 ప‌రుగులు చేశాడు. బంగ్లా వికెట్ కీప‌ర్ ర‌నౌట్ ను మిస్ చేయ‌డంతో మ్యాచ్ టై అయి సూప‌ర్ ఓవ‌ర్ కు దారితీసింది.

సూప‌ర్ థ్రిల్లర్ ఓవ‌ర్..

సూప‌ర్ ఓవ‌ర్లో బంగ్లా పేస‌ర్ రిప్ప‌న్ మొండ‌ల్ బంతి అందుకోగా.. టీమ్ ఇండియా త‌ర‌ఫున కెప్టెన్ జితేశ్ క్రీజులోకి వ‌చ్చి మొద‌టి బంతికే బౌల్డ‌య్యాడు. అత‌డి స్థానంలో దిగిన ఆశుతోష్ కూడా క్యాచ్ ఔట్ కావ‌డంతో ప‌రుగులేమీ లేకుండానే సూప‌ర్ ముగిసింది. (రెండు వికెట్లు ప‌డితే త‌ర్వాతి బంతులు వేయ‌రు). కేవ‌లం ఒక్క ప‌రుగు చేస్తే సెమీ ఫైన‌ల్ గెలిచే చాన్సు ఉండ‌గా సూయాశ్ శ‌ర్మ బౌలింగ్ లో బంగ్లా బ్యాట‌ర్ యాసిర్ అలీ క్యాచ్ ఇచ్చి మొద‌టి బంతికే ఔట‌య్యాడు. రెండో బంతికి సూయాశ్ వైడ్ వేయ‌డంతో ప‌రుగు వ‌చ్చింది. కానీ, అదే స‌మ‌యంలో బ్యాట‌ర్ అక్బ‌ర్ అలీ స్టంపింగ్ చాన్స్ మిస్ అయింది. బంగ్లా గెలిచింది. మ‌లుపులు తిరిగిన క్లైమాక్స్ తో బంగ్లా ఫైన‌ల్ చేరింది.

Tags:    

Similar News