నేనే ఇస్తా.. మీరే తీసుకోవాలి.. ఆసియాకప్ పై నఖ్వీ కొత్త మెలిక
దీంతో అతడు ట్రోఫీని ఎత్తుకెళ్లి దుబాయ్ లో తాను ఉంటున్న హోటల్ లో పెట్టాడు. ఆ తర్వాత ఏసీఏ ప్రధాన కార్యాలయానికి తీసుకొచ్చాడని తెలుస్తోంది.;
టీమ్ఇండియా నెగ్గిన ఆసియా కప్ ను ఎత్తుకెళ్లి హోటల్ రూమ్ లో పెట్టుకున్న ఆసియా క్రికెట్ కౌన్సిల్ (ఏసీఏ) చైర్మన్, పాక్ క్రికెట్ బోర్డు (పీసీబీ) చైర్మన్, ఆ దేశ అంతర్గత వ్యవహారాల శాఖ మంత్రి అయిన మొహిసిన్ నఖ్వీ కొత్త రాగం అందుకున్నాడు. కప్ ముగిసి 23 రోజులు అవుతున్నా.. ఇంతవరకు ట్రోఫీని విజేత జట్టు భారత్ చేతికి రాలేదు. పెహల్గాం ఉగ్రదాడికి నిరసనగా పాకిస్థాన్ ఆటగాళ్లతో కరచానలం చేయని టీమ్ ఇండియా కెప్టెన్, ఆటగాళ్లు.. సెప్టెంబరు 28న టైటిల్ గెలిచాక నఖ్వీ నుంచి కప్ ను అందుకునేందుకు నిరాకరించారు. దీంతో అతడు ట్రోఫీని ఎత్తుకెళ్లి దుబాయ్ లో తాను ఉంటున్న హోటల్ లో పెట్టాడు. ఆ తర్వాత ఏసీఏ ప్రధాన కార్యాలయానికి తీసుకొచ్చాడని తెలుస్తోంది.
ఇప్పటికే దుమ్ము దులిపినా..
సెప్టెంబరు 30 ఆసియా క్రికెట్ కౌన్సిల్ (ఏసీఏ) సమావేశం జరిగింది. పాక్ కు వెళ్లిపోయాడో, దుబాయ్ లో ఉన్నాడో కానీ అందులో నఖ్వీ వర్చువల్ గా పాల్గొన్నాడు. ఈ సందర్భంగా ఆసియా కప్ నీ సొత్తు కాదు.. తిరిగిచ్చేయాలని బీసీసీఐ గట్టిగా డిమాండ్ చేసింది. లేదంటే అంతర్జాతీయ క్రికెట్ కౌన్సిల్ (ఐసీసీ)కు ఫిర్యాదు చేస్తామని హెచ్చరించింది. దీంతో నఖ్వీ గొంతులో పచ్చి వెలక్కాయ పడింది. టీమ్ ఇండియా కెప్టెన్ సూర్యకుమార్ యాదవ్ వచ్చి తన దగ్గర నుంచి ట్రోఫీ తీసుకోవాలని అతడు సూచించాడు. బీసీసీఐ ససేమిరా అనడంతో.. ట్రోఫీని ఆసియా క్రికెట్ కౌన్సిల్ ప్రధాన కార్యాలయంలో ఉంచినట్లు తెలుస్తోంది. అయితే, తన అనుమతి లేకుండా ట్రోఫీని ఎవరికీ ఇవ్వొద్దంటూ కార్యాలయ సిబ్బందికి నఖ్వీ ఆదేశాలు ఇచ్చినట్లు సమాచారం.
తాజా ఈ మెయిల్ తో కదలిక..
ట్రోఫీని అప్పగించే విషయమై నఖ్వీకి మంగళవారం ఆసియా కప్ విషయమై బీసీసీఐ మెయిల్ పంపింది. లేదంటే నవంబరు మొదటివారంలో జరిగే ఐసీసీ సర్వసభ్య సమావేశంలో తేల్చుకుంటామని స్పష్టం చేసింది. అదే జరిగితే నఖ్వీ పదవికే ఎసరు. అందుకని అతడు ఆసియా కప్ విషయమై కొత్త మెలిక పెట్టాడు. ఆసియా కప్ ను భారత్ కు తానే ఇస్తానని, ఈ మేరకు వేడుక ఏర్పాటు చేద్దామని నఖ్వీ ప్రతిపాదించాడు. బీసీసీఐ ఆఫీస్ హోల్డర్, టీమ్ ఇండియా సభ్యుడు ఒకరు (అందుబాటులో ఉన్నవారు) వచ్చి ట్రోఫీని తీసుకోవాలని సూచించాడు. దీనిపై బీసీసీఐ స్పందన ఏమిటో తెలియాల్సి ఉంది. ఇప్పటికే ఐసీసీ వద్దనే తేల్చుకోవాలని భారత బోర్డు ఓ నిర్ణయానికి వచ్చినట్లు సమాచారం.
ఇంకా ఆ కప్ అవసరమా?
నఖ్వీ.. పాకిస్థాన్ జాతీయ ప్రభుత్వంలో అంతర్గత వ్యవహారాల మంత్రి. పెహల్గాం ఉగ్రదాడిలో తమ తప్పేమీ లేదని అన్నాడు. ఆసియా కప్ లో పాక్ ఆటగాళ్లు పెహల్గాం ఉగ్రదాడిని గుర్తుచేసేలా సంకేతాలు ఇస్తే వాటిని సమర్థించాడు. పేసర్ హారిస్ రవూఫ్ కు విధించిన 30 శాతం మ్యాచ్ ఫీజు జరిమానాను వ్యక్తిగతం తానే కడతానని అన్నాడు. అలాంటివాడి చేతుల నుంచి కప్ తీసుకోకుండా టీమ్ ఇండియా మంచి పనే చేసింది. ఇప్పుడు నఖ్వీ ఎత్తుకెళ్లి, అతడి చేతులు తాకిన కప్ ను తీసుకోవడం అవసరమా? అని ఆలోచించాల్సి ఉంది.