ఆసియా కప్ ఫైనల్‌లో సూర్య షాక్.. పాక్ కెప్టెన్ ఒంటరిగా ట్రోఫీ పక్కన
ఆసియా కప్-2025 ఫైనల్‌కు ముందు ఊహించని సంఘటన చోటుచేసుకుంది. సంప్రదాయంగా ప్రతి టోర్నమెంట్‌లో ఫైనల్ మ్యాచ్‌కు ముందు ఇరు జట్ల కెప్టెన్లు ట్రోఫీ పక్కన ఫొటోలు దిగడం ఆనవాయితీగా వస్తోంది.;
ఆసియా కప్-2025 ఫైనల్‌కు ముందు ఊహించని సంఘటన చోటుచేసుకుంది. సంప్రదాయంగా ప్రతి టోర్నమెంట్‌లో ఫైనల్ మ్యాచ్‌కు ముందు ఇరు జట్ల కెప్టెన్లు ట్రోఫీ పక్కన ఫొటోలు దిగడం ఆనవాయితీగా వస్తోంది. కానీ ఈసారి ఆ సంప్రదాయానికి తెరపడింది. భారత కెప్టెన్ సూర్యకుమార్ యాదవ్ పాకిస్తాన్ కెప్టెన్ సల్మాన్ అలీతో కలసి ఫోటో దిగేందుకు నిరాకరించడంతో, పాక్ కెప్టెన్ ఒక్కడే ట్రోఫీ పక్కన నిలబడి పోజులు ఇవ్వాల్సి వచ్చింది.
ఉద్రిక్తతల మధ్య సూర్య నిర్ణయం
ఇటీవల పహల్గామ్ దాడి, ఆపై జరిగిన ఆపరేషన్ సిందూర్ కారణంగా భారత్-పాక్ సంబంధాలు మరింత ఉద్రిక్తంగా మారాయి. అదే పరిణామాల నేపథ్యంలో సూర్యకుమార్ యాదవ్ భిన్నంగా వ్యవహరించారని క్రికెట్ వర్గాలు చెబుతున్నాయి. ఫోటోసెషన్‌లో పాల్గొనకపోవడమే కాకుండా, ఇప్పటికే లీగ్ మ్యాచ్, సూపర్ ఫోర్ మ్యాచ్‌ల్లో కూడా పాకిస్తాన్ ఆటగాళ్లతో షేక్ హ్యాండ్స్ చేయకుండా సూర్య తన అసంతృప్తిని వ్యక్తం చేశారు.
ఐసీసీకి పాక్ ఫిర్యాదు
లీగ్ మ్యాచ్ అనంతరం సూర్య ప్రవర్తనపై పాకిస్తాన్ జట్టు ఐసీసీకి ఫిర్యాదు చేసింది. మ్యాచ్ రిఫరీపై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేసింది. అయితే ఐసీసీ ఎలాంటి చర్యలు తీసుకోకపోవడంతో భారత్ వైఖరి మరింత స్పష్టమైంది.
మైదానంలో తీవ్ర వాగ్వాదం
సూపర్ 4 మ్యాచ్ సమయంలో కూడా ఉద్రిక్త వాతావరణం నెలకొంది. భారత బ్యాట్స్‌మెన్ వికెట్లు పడగొట్టిన పాకిస్తాన్ బౌలర్లు ఆగ్రహావేశంతో దూసుకెళ్లి మాటల యుద్ధానికి దిగారు. అదే సమయంలో ఒక పాకిస్తాన్ ఆటగాడు గన్ ఫైరింగ్ సెలబ్రేషన్ చేయడం టీమిండియా ఆటగాళ్ల ఆగ్రహాన్ని మరింత పెంచింది. ఆ క్రమంలోనే సూర్య ఫైనల్‌కు ముందు పాక్ కెప్టెన్‌తో కలసి ఫోటో దిగకుండా షాక్ ఇచ్చారని తెలుస్తోంది.
సూర్యకుమార్ ప్రత్యేక ఫోటో
తన నిర్ణయానికి కట్టుబడి ఉన్న సూర్యకుమార్ యాదవ్ ప్రత్యేకంగా ఒక్కడే ట్రోఫీ పక్కన నిలబడి ఫోటోలు దిగారు. మరోవైపు, పాక్ కెప్టెన్ సల్మాన్ అలీకి మాత్రం ఒంటరిగా ట్రోఫీ పక్కన నిలబడే పరిస్థితి తలెత్తింది.
ఆసియా కప్ ఫైనల్‌కు ముందు జరిగిన ఈ ఘటన భారత్-పాక్ మధ్య క్రికెట్ ఉద్రిక్తతలను మరోసారి బయటపెట్టింది. మైదానంలో ఆట కొనసాగుతున్నప్పటికీ, రాజకీయ-సామాజిక పరిణామాలు ఆటగాళ్ల ప్రవర్తనపై ఎలాంటి ప్రభావం చూపుతున్నాయో ఈ సంఘటన మరోసారి నిరూపించింది.